Delhi Weather: ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన దేశ రాజధానిలో ఇప్పుడు చల్లటి గాలులు. ఆదివారం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. 2001 తర్వాత సెప్టెంబర్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. దీంతో ఏసీలు ఆఫ్ ఫ్యాన్ల స్పీడ్ డౌన్. ఉదయం, రాత్రి వేళల్లో చలి పంచ్లు తప్పడం లేదు. అయితే ఇదంతా వింటర్ ఎఫెక్ట్ కాదు. బంగాళాఖాతంలో ఏర్పడిన సుదీర్ఘకాలం కొనసాగిన తీవ్ర అల్పపీడనం. దేశవ్యాప్తంగా వాతావరణాన్ని మార్చేసింది.
ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు తెలంగాణ నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ వరకూ భారీ వర్షాలు కురిశాయి. మేఘాలు దట్టంగా కమ్ముకోవడం వర్షాలు ఎడతెరిపి లేకుండా పడటం వాతావరణంలో తేమ పెరగడం దీంతో పగటి వేళల్లో భూమి వేడెక్కడం తగ్గిపోయింది. అదే ఇప్పుడు రాత్రి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపించింది. కానీ ఈ చలి ఎంతో కాలం ఉండబోదట. అక్టోబర్ 1 నుంచి సీన్ మారే అవకాశం ఉందన్నారు.
ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ ఎండలు పెరిగే సూచనలు ఉన్నాయి. మేఘాలు తొలగి వాతావరణం పొడిగా మారితే.. ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో మయన్మార్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. అది బంగాళాఖాతంలోకి వస్తే తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. అంటే ఢిల్లీలో చలి చూసి వింటర్ వచ్చేసిందని ఫిక్స్ అయిపోవద్దు. ఇది ముందస్తు శీతాకాలం కాదు వర్షాలు, మేఘాల కారణంగా వచ్చిన తాత్కాలిక చలి మాత్రమే! వాతావరణం ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో చెప్పలేం.. ఢిల్లీలో చలి పంచ్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది!
Also read: డ్రాగన్ కోసం వెయిటింగ్.. ఎన్టీఆర్ సినిమా జక్కన్న కామెంట్స్!