Goldy Brar: సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ కోసం FBI వేట ముమ్మరం చేసింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని ప్రకటించింది. లారెన్స్ బిష్ణోయ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్‌తో గోల్డీ బ్రార్‌కు సంబంధాలు ఉన్నాయని FBI ఆరోపిస్తోంది. అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఈ గ్రూప్ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతోందని తెలిపింది.
హత్యలు, కాల్పులు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా వంటి కేసుల్లో గోల్డీ బ్రార్ ప్రమేయం ఉందని FBI చెబుతోంది. ప్రస్తుతం గోల్డీ బ్రార్ అమెరికాలో ఉన్నాడని.. ఉత్తర అమెరికాలోని బిష్ణోయ్ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్నాడని దర్యాప్తు సంస్థ తెలిపింది. అతడిని అత్యంత ప్రమాదకర వ్యక్తిగా పరిగణించాలని హెచ్చరించింది.
జూలైలో అమెరికా కోర్టులో గోల్డీ బ్రార్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ర్యాకెటీర్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ కుట్ర, ఎక్స్‌టార్షన్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ క్రైమ్ టీమ్ లపై అమెరికా చేపట్టిన ఆపరేషన్ హార్డ్‌బాల్‌లో భాగంగా గోల్డీ బ్రార్ పేరు బయటకు వచ్చింది. బిష్ణోయ్ ఎంటర్‌ప్రైజ్‌కు సంబంధించిన కేసుల్లో అతడు కీలక వ్యక్తిగా ఉన్నట్లు FBI ఆరోపించింది.