E-Paper
Advertisement

ఆత్మగౌరవమా? సెక్యులరిజమా.. 75 ఏళ్లక్రితం సోమనాథ్ చుట్టూ నడిచిన అసలు రహస్యం ఇదే..?

ఆత్మగౌరవమా? సెక్యులరిజమా.. 75 ఏళ్లక్రితం సోమనాథ్ చుట్టూ నడిచిన అసలు రహస్యం ఇదే..?
Advertisement

Somnath History: సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్ల చరిత్ర ఏంటి? అసలేంటా ప్రత్యేక సందర్భం? ఈ ఆలయ వ్యవహారం ఎలా అర్ధం చేసుకోవాలి? ఇందులో దాగిన ఆధ్యాత్మిక- రాజకీయ- సామాజిక- చారిత్రకాంశాలేంటి? వాటీజ్ హిస్టరీ ఆఫ్ సోమ్ నాథ్. ఆనాటి మన భారతీయ రాజకీయ వైరుధ్యాలకు చిహ్నమెలా అయ్యింది? ఇందులో దాగిన సెక్యులరిస్టిక్ యూనిటీ ఎలాంటిది? ఆ వివరాలు ఏంటి?

నిర్మాణానికి పునాది 1947- 50 మధ్య కాలంలో..

గుజరాత్ లోని సోమనాథ ఆలయ పునర్నిర్మాణం కేవలం ఒక కట్టడానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. దీన్నొక భారతీయ ఆత్మగౌరవానికి పునరుద్దరణగా చూస్తారు. ప్రస్తుత సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి పునాది 1947- 50 మధ్య కాలంలో పడింది. సరిగ్గా 1951 మే 11న నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆలయంలో ప్రాణ ప్రతిష్ట జరిగింది. 2026నాటికి ఈ చారిత్రక నిర్మాణ ఘట్టం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రాణ ప్రతిష్ట ప్లాటినం జూబ్లీ వేడుకలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. పరాయి పాలనలో ధ్వంసమైన ఆలయం స్వతంత్ర భారతంలో మళ్లీ వైభవాన్ని సమంతరించుకోడానికిదో గుర్తుగా మారింది.

మళ్లీ నిర్మిస్తామని ప్రతిజ్ఞ..

Advertisement

సోమనాథ్ ఆలయ చరిత్రలో ఏకంగా 17 సార్లు ధ్వంసం చేయబడింది. అయితే ఆధునిక పునర్నిర్మాణానికి ఎలా బీజం పడిందో చూస్తే.. 1947లో జరిగిన జూనాగడ్ విప్లవానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆనాడు జూనాగఢ్ పాకిస్థాన్ లో కలవాలని చూడగా.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జోక్యంతో అది భారతదేశంలో విలీనమైంది. ఆ సమయంలోనే పటేల్.. ప్రభాస్ పటాన్ దర్శించి.. సోమనాథ్ ఆలయాన్ని మళ్లీ నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఈ ఆలయా నిర్మాణానికి ప్రభుత్వ ధనాన్ని కాకుండా ప్రజల నుంచి సేకరించిన విరాళాలను మాత్రమే వాడాలని మహాత్మా గాంధీ సూచించారు. దీని ప్రకారమే ట్రస్ట్ ద్వారా నిధులు సేకరించారు. ఈ ఆలయ నిర్మాణ విషయంలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశమే.

Also Read: త్వరలో లండన్ థేమ్స్ నదిలా మారనున్న హైదరాబాద్..!

భారతీయ సంస్కృతికి..

Advertisement

నాటి ప్రధాని నెహ్రూ ఈ నిర్మాణాన్ని హిందూ పునరుద్దరణ వాదంగా భావించి కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ పటేల్, మున్షీ పట్టుదలతో నిర్మాణం కొనసాగించారు. ఈ ఆలయ వ్యవహారాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో చూస్తే.. సోమనాథ్ ఆలయాన్ని కేవలం ఒక మతపరమైన కట్టడంగా చూడకుండా.. ఎన్నిసార్లు కూల్చినా తిరిగి లేవగలం అనే భారతీయ సంస్కృతికి ఇది నిదర్శనం. అందుకే దీన్ని అక్షయ పాత్ర వంటి నిర్మాణంగా భావిస్తారు. ఇందులోని రాజకీయ చైతన్యం సైతం చర్చనీయాంశమే. భారత్ తన ప్రాచీన మూలాలను కూడా గౌరవించుకోవాలని భావించిన పటేల్, రాజేంద్ర ప్రసాద్ వంటి వారి ఆలోచనలకిదో నిదర్శనం.

అజేయ శక్తికి మొదటి చిహ్నం

ఇక ఈ ఆలయ నిర్మాణ శైలి.. చాళుక్య శైలిగా భావిస్తారు. మరు- గుర్జర శైలిలో దీన్ని నిర్మించారు. సముద్ర తీరాన అద్భుతమైన వాస్తు కళతో అలరారుతున్న ఆలయాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. ఇంతకీ ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటని చూస్తే.. సృ ష్టిలో మొట్టమొదట వెలిసిన జ్యోతిర్లింగం కావడం. చంద్రుడు తన పూర్వ వైభవాన్ని ఇక్కడే పొందడం. ప్రాచీన వేద, పురాణ వాంగ్మయంలో కూడా దీని ప్రస్తావన ఉండటం. ఎన్నిసార్లు ధ్వంసం చేసినా కూడా.. మళ్లీ మళ్లీ ప్రాణం పోసుకున్న ఈ ఆలయం, భారతీయ ధర్మంలోని అజేయ శక్తికి మొదటి చిహ్నంగా భావిస్తారు. సోమనాథ్ 75 ఏళ్ల పండుగ అనేది ఒక ఆలయ వేడుక మాత్రమే కాదు, ఇది ఒక జాతి తన అస్తిత్వాన్ని చాటుకున్న సందర్భంగానూ చూస్తారు. భారత పునర్నిర్మాణ ప్రయాణంలో ఒక మైలురాయిగానూ చెబుతారు.

ఎందుకంత ప్రత్యేకం?

సోమనాథేశ్వరుడు చెప్పే శివతత్వమేంటి? సామాజిక తత్వమేంటి? పడమట వెలసిన ఈ శివాలయం దేశ ఆధ్యాత్మిక రాజకీయ చరిత్రలో ఎందుకంత ప్రత్యేకం? అన్నది కూడా భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో చర్చనీయాంశమే. దేశంలో కొన్నంటే కొన్ని ఆలయాలకు మాత్రమే ఒక రకమైన సామాజికాంశం తోడై ఉంటుంది. అదెలాగో చూస్తే.. భారతీయ సామాజిక, రాజకీయ పరిణామాలకు ఒక మౌన సాక్షి సోమనాథేశ్వరాలయం. పడమటి సముద్ర తీరాన వెలసిన ఈ శివాలయం అందించే సందేశాన్ని ముఖ్యంగా మూడు కోణాల్లో అర్థం చేసుకోవచ్చని అంటారు. ఇక్కడి సోమనాథేశ్వరుడు చెప్పే శివతత్వం.. పునరుత్థానం. మాములుగా శివుడ్ని మనం లయకారుడిగా కొలుస్తాం. లయం అంటే అంతానికి సంబంధించిన పదం. కానీ ఇక్కడి శివుడు మాత్రం అనంతానికి చెందిన చిహ్నంగా విశ్వసిస్తారు.

Also read: నువ్వు నాకు నచ్చావ్ అనగానే నమ్మేసారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?

చాటి చెప్పడం..

చంద్రుడు తన కాంతి కోల్పోయి క్షయ వ్యాధి గ్రస్తుడైతే.. ఇక్కడ పునరుజ్జీవం పొందినట్టు చెబుతుంది ఆలయ స్థలపురాణం. అంటే, జీవితంలో మనం సర్వం కోల్పోయినా సరే ఈశ్వరుని కృపతో తిరిగి వైభవం పొందవచ్చని చాటి చెబుతుందీ ఆలయం. మాములుగా శివుడికి కాలభైరవుడనే పేరు కూడా ఉంది. సముద్రం నిరంతరం మారుతున్నా.. ఈ తీరంలోని శివుడు మాత్రం స్థిరంగా ఉంటాడు. ఇది మారుతున్న ప్రపంచంలో కొన్ని మాత్రం స్థిరంగా నిలిచే ఉంటాయని చెప్పడానికిదో సంకేతంగా భావిస్తారు. ఇక సామాజికంగా ఇందులో దాగిన సత్యం ఏంటంటే.. సముద్రం తనలో అన్ని నదులను ఎలా కలుపుకుంటుందో సోమనాథుడు కూడా కులమతాలకు అతీతమని, అందర్నీ ఆహ్వానిస్తాడని అంటారు.. ఈ ఆలయంలో వెలసిన సోమనాథుడి తత్వం తెలిసిన వారు.

దాడులు మతంపై జరిగినవా..?

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ప్రభుత్వ నిథులతో కాకుండా ప్రజల విరాళాలతో నిర్మించారు. అంటే సమాజం అంతా కలిస్తే ఎలాంటి గొప్ప కార్యమైనా సరే సాధించవచ్చన్న సామాజిక స్పృహకు దీన్నొక నిదర్శనంగా చెబుతారు మన ఆధ్యాత్మికవేత్తలు. ఆధ్యాత్మిక రాజకీయ చరిత్రలోనూ సోమనాథ్ ఆలయానికో ప్రత్యేకత ఉంది. భారతీయ ఆత్మగౌరవ పునరుద్ధరణ చరిత్రలో సోమనాథ్ పై జరిగిన దాడులు కేవలం మతంపై జరిగినవి కావు, అవి భారతీయ ఆర్థిక, రాజకీయ శక్తిపై జరిగినవిగా విశ్వసిస్తారు. పరాయి పాలనలో ధ్వంసమైన ఆలయం, స్వాతంత్రం వచ్చిన వెంటనే పునర్నిర్మించడం అనేది మేము మళ్లీ స్వతంత్రులమయ్యాం, మా సంస్కృతిని మేము గౌరవించుకోగలమని ప్రపంచానికి చాటిచెప్పిన స్వయం ప్రకటనగా అభివర్ణిస్తారు.

అత్యధిక దాడులు..

ఇందులో సెక్యులరిజం – సాంస్కృతిక జాతీయవాదం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆనాడు నెహ్రూ ఆలయ నిర్మాణంలో ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించగా, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ దీనిని జాతీయ గౌరవంగా భావించారు. ఈ చర్చ భారతదేశం తన స్వయం గుర్తింపును ఎలా వెతుక్కోవాలి? అనే రాజకీయ సిద్ధాంతానికి పునాది వేసిందని అంటారు పులువురు సామాజికవేత్తలు. భారతదేశానికి పడమటి తీరం ద్వారానే అత్యధిక దాడులు జరిగాయి. సోమనాథ్ అక్కడ వెలసి ఉండటం అంటే దేశానికి ఒక ఆధ్యాత్మిక కాపలాదారుగా చెప్పొచ్చు. పడమర వెలసిన ఈ జ్యోతిర్లింగం, సముద్ర మార్గం గుండా వచ్చే ఆపదలను అడ్డుకునే శక్తిగా నమ్ముతారు శివ భక్తులు. మొత్తంగా సోమనాథ్ అంటే ఏంటి? అని చూస్తే.. ఈ ఆలయం కేవలం రాయి, రప్పలతో కట్టిన కట్టడం కాదు. అది అవమానాన్ని అధిగమించిన ఆత్మగౌరవం. రాజకీయంగా ఇదొక దేశ సమగ్రతకు చిహ్నం. ఆధ్యాత్మికంగా ఇది మృత్యువుపై గెలిచిన అమరతత్వం. సామాజికంగా.. పడిలేచిన కెరటం వంటి భారతీయ జీవన విధానం. ఈ ఆలయ చరిత్రను చూసినప్పుడు మనకు అర్థమయ్యే ఒకే ఒక విషయం. సత్యాన్ని ఎన్నిసార్లు అణచివేసినా, మళ్లీ వెలుగులోకి వచ్చి తీరుతుంది అని చెప్పడమేనంటారు మన ఆధ్యాత్మిక, సామాజికవేత్తలు.

Also Read: BJP : బీజేపీలో మోడీ టెన్షన్.. ఈసారి ఏమంటారో?

స్వాతంత్రం వచ్చిన తర్వాత..

18వ శతాబ్దం నాటికి ఈ ఆలయం కేవలం ఒక రాళ్ల గుట్టలా మిగిలిపోయిందంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. అప్పట్లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్, శిథిలమైన ప్రధాన ఆలయానికి కొంచెం దూరంలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు పునరుద్ధరించారు. కానీ అసలైన ప్రాచీన ఆలయ స్థానం మాత్రం అలాగే పాడుబడి ఉంది. ఇక భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. 1947 నవంబర్ 13న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జూనాగఢ్ విముక్తి తర్వాత సోమనాథ్ తీరాన్ని సందర్శించారు. అక్కడ శిథిలమైన ఆలయాన్ని చూసి ఆయన చలించిపోయారు. సముద్రపు నీటిని చేతిలోకి తీసుకుని, ఈ ఆలయాన్ని మళ్లీ నిర్మిస్తాం, పూర్వ వైభవం తెస్తామని ప్రతిజ్ఞ చేశారు. పటేల్ అభ్యర్థన మేరకు పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఆనాటి క్యాబినేట్. అయితే గాంధీజీ సూచన మేరకు, దీనికి ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా ప్రజల నుంచి పబ్లిక్ ట్రస్ట్ పేరిట సేకరించిన విరాళాల ద్వారానే నిధులు సమకూర్చారు. ఇదే విధానం అయోధ్య రామమందిరం విషయంలోనూ అనుసరించారు.

1951లో ఆలయం..

ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే, సముద్రపు ఉప్పు గాలి వల్ల ఆలయం త్వరగా పాడవకుండా ఉండటానికి ప్రత్యేకమైన రాళ్లను వాడారు. ఈ విషయంలో ఆలయం సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మించే ఆలయాలకంటూ ఒక రోల్ మోడల్ గా నిలిచింది. 1951లో ఆలయం మొత్తం సిద్ధమయ్యాక, దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీనిని ప్రారంభించారు. విదేశీ ఆక్రమణదారులు భారతీయుల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఆలయాలను కూల్చారు. ఆ గాయాన్ని మాన్పి, దేశం మళ్లీ తన కాళ్ల మీద తాను నిలబడుతోందని చాటి చెప్పడానికి సోమనాథ్ పునర్నిర్మాణం ఒక సంకేతంగా నిలిచింది. అందుకే దీనిని శైవ పునరుద్ధరణ అని కూడా అంటారు. సోమనాథ్ ఆలయం చుట్టూ అల్లుకుని కనిపించే రాజకీయ వ్యవహారాలేంటి? ఆ నాటి నుంచి ఈ నాటి వరకూ సాగిన రాజకీయ కార్యకలాపాలు ఎలాంటివి? అని పరిశీలిస్తే.. 1947 నుంచి నేటి వరకు ఈ ఆలయం చుట్టూ జరిగిన రాజకీయ పరిణామాలు భారత దేశంలోని సెక్యులరిజం వర్సెస్ సాంస్కృతిక జాతీయవాదం మధ్య గల చర్చను ప్రతిబింబిస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..

నేడు సోమనాథ్ ఆలయం దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా ఉంది. దీని రాజకీయ ప్రాముఖ్యత ఇంకా కొనసాగుతోంది. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ బోర్డులో దేశంలోని అత్యున్నత స్థాయి నాయకులు సభ్యులుగా ఉండటం దీని ప్రాముఖ్యతను మరింతగా తెలియ చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ట్రస్ట్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. అమిత్ షా వంటి నాయకులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. శ్రీ సోమనాథ్ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఎన్నికైన రెండవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఈ పదవిని నిర్వహించారు. ఈ ట్రస్ట్‌లో ఇతర ప్రముఖులు కూడా సభ్యులుగా ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎల్.కె. అద్వానీ వంటి వారు ఈ బోర్డు మెంబర్లుగా ఉంటూ ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి పనులు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలపై తుది నిర్ణయాలు ఈ ట్రస్ట్ చైర్మన్ నేతృత్వంలోనే జరుగుతాయి. సోమనాథ్ ట్రస్ట్ అనేది 1949లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో ఏర్పాటైన ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.

Also Read: రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త రేట్ల కసరత్తు.. ఇక పెరగనున్న భూముల ధరలు..!

సోమనాథేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటివాడు కావడానికి గల కారణాలు పురాణాలలో, వేద సాహిత్యంలో ఇతర చారిత్రక ఆధారాల్లో.. ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. మొదటగా పురాణ గాథలను పరిశీలిస్తే.. శివపురాణం ప్రకారం, సోమనాథుడిని తొలి లింగంగా గుర్తించడానికి సోముడు అంటే, చంద్రుడు కారణంగా తెలుస్తోంది. చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకుంటాడట. అయితే ఆయన కేవలం రోహిణిపైనే ఎక్కువ ప్రేమను చూపిస్తాడట. మిగిలిన కుమార్తెల ఫిర్యాదు మేరకు దక్షుడు చంద్రుడిని క్షయ వ్యాధి బారిన పడమని శపిస్తాడట.

జ్యోతిర్లింగ రూపంలో..

శాప విముక్తి కోసం చంద్రుడు బ్రహ్మదేవుని సలహా మేరకు నేటి సోమనాథ్ అయిన ప్రభాస క్షేత్రంలో మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివుని కోసం ఘోర తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై చంద్రుడికి పక్షం రోజులు కళలు క్షీణించినా, మరో పక్షం రోజులు పెరుగుతాయని వరమిచ్చాడట. ఇవే శుక్లపక్షం, కృష్ణపక్షంగా చెబుతారు. సోముడి కోరిక మేరకు శివుడిక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడట. అందుకే దీనికి సోమనాథుడు అనే పేరు వచ్చిందని చెబుతారు మన ఆధ్యాత్మికవేత్తలు. సోమనాథుడి ప్రాచీనత కేవలం పురాణాలకే పరిమితం కాదు, ఇతర ఆధారాలు కూడా ఉన్నట్టు చెబుతారు మన పండితులు. ఋగ్వేదంలోని కొన్ని శ్లోకాల్లో ప్రభాస క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ప్రస్తావించినట్టు తెలుస్తోంది.. చంద్రుడు ఇక్కడ తన కాంతిని తిరిగి పొందాడని సూచిస్తాయి వేదాలు.

పురాణగాథలోని సైంటిఫిక్..

ఆధ్యాత్మిక ప్రపంచంలో సోమనాథ్ ఎందుకు ప్రత్యేకం అంటే, ఇది కేవలం మతపరమైన కేంద్రం కాదు, ఇది ఒక కాస్మిక్ సెంటర్ గానూ భావిస్తారు. పురాణాల ప్రకారం చంద్రుడు తన 27 మంది భార్యలలో రోహిణిని మాత్రమే ప్రేమించడం వల్ల దక్షుడి శాపానికి గురై కాంతిని కోల్పోతాడు. ఇక్కడ శివుడిని ఆరాధించి తిరిగి కాంతిని పొందుతాడు. అనే పురాణగాథలోని సైంటిఫిక్ యాంగిల్ ఏంటంటే చంద్రుని గమనం వల్ల సముద్రంలో అలలు ఏర్పడతాయి. సోమనాథ్ సరిగ్గా సముద్ర తీరాన ఉండటం వల్ల, అక్కడ చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో చంద్రుని దశలను, తిథులను లెక్కించడానికి సోమనాథ్ ఒక ఖగోళ అబ్జర్వేటరీ గా పనిచేసేదని కొందరి నమ్మకం.

Also Read: రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త రేట్ల కసరత్తు.. ఇక పెరగనున్న భూముల ధరలు..!

గజనీ మహమ్మద్ దాడి..

జ్యోతిర్లింగం అంటేనే ప్రకాశించే లింగం. సోమనాథ్ ఆలయంలోని లింగం ప్రాచీన కాలంలో గాలిలో తేలేదని చెబుతున్నాయి కొన్ని చారిత్రక కథనాలు. అప్పట్లో గజనీ మహమ్మద్ దాడి చేసినప్పుడు, ఆ లింగం ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడని, ఆ లింగం చుట్టూ ఉన్న గోడలలో అయస్కాంతాలను అమర్చడం ద్వారా ఆ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాధ్యమైందని విశ్లేషిస్తుంటారు చరిత్రకారులు. ఇది మన ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతంగానూ చెబుతారు. సోమనాథ్ ఆలయం ప్రభాస క్షేత్రంలో ఉంది. హిందూ కాలగణన ప్రకారం, ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది ఇక్కడే అని చెబుతారు. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన భాల్కా తీర్థం ఇక్కడికి అతి దగ్గరలోనే ఉంది. అంటే ఒక యుగం ముగిసి మరో యుగం మొదలైన సంధి కాలానికి ఈ క్షేత్రం సాక్షిగానూ విశ్వసిస్తారు.

దక్షిణ ధ్రువానికి ఉన్న గేట్ వే…

సోమనాథ్ ఆలయం కేవలం భక్తుల కోసం కట్టిన గుడి కాదు. అది.. భౌగోళికంగా దక్షిణ ధ్రువానికి నేరుగా ఉన్న గేట్ వే. ఇక ఖగోళపరంగా చూస్తే చంద్రుని గమనాన్ని, కాలగణనను సూచించే కేంద్రంగానూ చెబుతారు. ఇంజనీరింగ్ పరంగా: సముద్రపు దాడులను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే అద్భుత నిర్మాణంగా వర్ణిస్తారు. సముద్రపు హోరు, చంద్రుని వెన్నెల, శివుని ధ్యానం – ఈ మూడింటి కలయికే సోమనాథ్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రహస్య ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చిందని అంటారు.

Also Read: రాహుల్ వ్యూహం.. బీజేపీకి గ‌ర్వ‌భంగం! ఏన్డీయేపై ఇండి కూట‌మి రెండో విజ‌యం..!

Related News

ఉత్తరాదిని ముంచెత్తుతున్న వానలు.. నదుల ఉగ్రరూపం, చార్‌ధామ్ యాత్ర వాయిదా!

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

Big Stories

Advertisement
×