POCSO Cases: భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తోంది. పిల్లల కస్టడీ కోసం న్యాయపోరాటం జరుగుతోంది. సీన్ కట్ చేస్తే మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ తండ్రిపై మోపారు. ఇలాంటి కేసుల్లో అసలు నేరం ఏంటి? ఆరోపణల వెనుక నిజమెంత? అన్నదే కీ నోట్ గా తీసుకుంది సుప్రీం. తండ్రి 9 ఏళ్ల కుమార్తెను లైంగికంగా వేధించాడంటూ POCSO కేసు నమోదైంది. కస్టడీ వివాదంలో భాగంగానే తప్పుడు కేసు పెట్టారన్న ఆరోపణలపై CBI దర్యాప్తు చేసింది. చివరకు ఆరోపణలు నిర్ధారించలేకపోవడంతో సుప్రీంకోర్టు FIRను కొట్టివేసింది.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. వైవాహిక వివాదాల్లో POCSO కేసుల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ప్రతి POCSO కేసును అనుమానంతో చూడాలని కాదు.. ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య వివాదం ఉండి, తల్లిదండ్రి లేదా అదే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుడిపై ఆరోపణ వచ్చిన సందర్భాల్లో జాగ్రత్తగా దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో కేవలం FIR నమోదైందన్న కారణంతో ఆటోమేటిక్‌గా అరెస్ట్ చేయకూడదు.
అవసరమైన సందర్భాల్లో పిల్లల మానసిక స్థితిని చైల్డ్ సైకాలజీ లేదా సైకియాట్రీ నిపుణులతో అంచనా వేయాలి. ఆ నివేదికతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి అరెస్ట్‌పై నిర్ణయం తీసుకోవాలన్నది సుప్రీం కోర్టు. ఒకవైపు నిజమైన బాధిత చిన్నారికి POCSO రక్షణ కొనసాగాలి. మరోవైపు తప్పుడు ఆరోపణలకు ఈ చట్టం వేదిక కాకూడదు అంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయ్.
Also read: నన్ను తొక్కేయాలని చూస్తున్నావా? ఫరియా పై చిరు కామెంట్స్ వైరల్!