Telangana 22A Lands Issue:బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్ట్రైట్ టాక్’ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యపేట BRS ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.తెలంగాణా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న22A నిషేధిత భూముల విషయంపై మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ప్రజలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి
తెలంగాణలో 22A సమస్య ఇప్పటిది కాదని జగదీశ్ రెడ్డి అన్నారు. చాలాకాలంగా ఈ సమస్య కొనసాగుతోందని, దీని వల్ల చివరికి ఇబ్బంది పడేది మాత్రం సామాన్య ప్రజలేనని చెప్పారు. భూమి కొనుగోలు చేసి, డబ్బులు చెల్లించి, అన్ని పత్రాలు తమ దగ్గరే ఉన్నా.. ఒక్కసారిగా ఆ భూమి 22A జాబితాలో ఉందని తెలిసినప్పుడు ప్రజలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తోందని ఆయన పేర్కొన్నారు.
చాలా ప్రాంతాల్లో ప్రజలు తమ భూముల సమస్యను స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తున్నారని జగదీశ్ రెడ్డి చెప్పారు. ఈ సమస్య యాదగిరి గుట్టలో మొదలై, క్రమంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు విస్తరిస్తోందని అన్నారు. 22Aలో భూమి ఉందంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అమ్ముకోవడం, కొనుగోలు చేయడం వంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఎకరం భూమి విషయంలో సమస్య వచ్చినా
ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, వ్యవసాయ భూములు, ఓపెన్ ల్యాండ్స్.. ఇలా రకరకాల భూములు ఈ వివాదంలోకి వస్తున్నాయని జగదీశ్ రెడ్డి ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఒక్క ఎకరం భూమి విషయంలో సమస్య వచ్చినా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు.
తమ దగ్గరకు కూడా ఇలాంటి సమస్యలతో చాలామంది వస్తున్నారని జగదీశ్ రెడ్డి చెప్పారు. కొందరు తమ భూమి విషయంలో పంచాయతీ కూడా లేకపోయినా సమస్య ఎదుర్కొంటున్నారని, మరికొందరు ఎన్నో ఏళ్లుగా ఆస్తిని అనుభవిస్తున్నప్పటికీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ప్రజలేనని ఆయన చెప్పుకొచ్చారు.
పూర్తి స్థాయిలో పరిశీలన జరగాలి
22A జాబితాలో ఉన్న ప్రతి భూమి విషయంలో పూర్తి స్థాయిలో పరిశీలన జరగాలని జగదీశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజంగా ప్రభుత్వ భూమి అయితే దాన్ని రక్షించాల్సిందేనని, కానీ ప్రైవేట్ వ్యక్తుల భూములు తప్పుగా నిషేధిత జాబితాలోకి వెళ్లి ఉంటే వాటిని కూడా పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చి చెప్పారు.
ఇక ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన విధానం తీసుకురావాలని, ప్రజలకు తమ భూముల విషయంలో క్లారిటీ ఇవ్వాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా భూములు కొనుగోలు చేసి, ఇళ్లు కట్టుకుని ఉంటున్న కుటుంబాలకు ఒక్కసారిగా సమస్యలు రావడం ఆందోళన కలిగించే విషయమని వాపోయారు.
also read:ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ.. అభ్యర్థి ఎవరంటే?
మొత్తానికి 22A భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మంటలు స్ప్రుష్టిస్తుంది. చూడాలి మరి తొందరలో అయినా ఈ వ్యవహారంలో సాధారణ ప్రజలకి రిలీఫ్ దక్కుతుందో లేదో !