Fake Lecturers: ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 35 మంది అక్రమార్కుల ఆట ముగిసింది. నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ కొలువుల్లో తిష్టవేసి, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఫేక్ లెక్చరర్ల బాగోతం బట్టబయలైంది. బిగ్ టీవీ వరుస కథనాల దెబ్బకు ఉన్నత విద్యాశాఖ దిగొచ్చింది. 35 మంది జూనియర్ లెక్చరర్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ టెర్మినేషన్ వేటు వేసింది.
గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా రెగ్యులరైజ్ అయిన నాటి నుంచీ.. యూనియన్ నేతల అండతో, ఉన్నతాధికారుల లాలూచీతో ఈ 35 మందిని కాపాడేందుకు వేసిన పన్నాగాలు అన్నీ ఇన్నీ కావు. షోకాజ్ నోటీసుల పేరిట కాలయాపనలు, కోర్టుల పేరిట సాగదీతలు, ఆర్జేడీ కార్యాలయపు తెరవెనుక డ్రామాలు.. ఒక్కటి కాదు, రకరకాల ఎత్తుగడలతో అక్రమార్కులను బతికించేందుకు విశ్వప్రయత్నాలు జరిగాయి. కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రజాపక్షాన నిలబడ్డ బిగ్ టీవీ.. అధికారుల మెడలు వంచి అక్రమార్కుల భరతం పట్టింది.
బోగస్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ, నిరుద్యోగుల గొంతు కొస్తున్న ఫేక్ బ్యాచ్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. 2023 మే 3న కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరుతో గత ప్రభుత్వం తెచ్చిన నిర్ణయం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో తెచ్చిన ఫేక్ పీజీ మెమోలతో నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులర్ సర్వీసులోకి జూనియర్ లెక్చరర్లుగా దూరిపోయారు. అయితే, 2024లో ఈ నకిలీ వ్యవహారం రచ్చకెక్కడంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ.. అక్రమార్కుల సర్టిఫికెట్ల గుట్టు తేల్చేందుకు ఆయా విశ్వవిద్యాలయాలకు లేఖలు రాసింది. తీరా ఆ లేఖలకు యూనివర్సిటీల నుంచి వచ్చిన సమాధానం చూసి ఉన్నతాధికారుల మైండ్ బ్లాంక్ అయింది. ప్రాథమికంగా గుర్తించిన 35 మంది మెమోలు పక్కా ఫేక్ అని వర్సిటీలు తేల్చేశాయి.
Also read: తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!
2026 ఫిబ్రవరి, మార్చి నాటికే ఈ 35 మంది నకిలీల బాగోతం పూర్తిగా నిర్ధారణ అయింది. కానీ, ఇక్కడే అసలు పైరవీలు మొదలయ్యాయి. యూనియన్ పెద్దల ఒత్తిళ్లు, తెరవెనుక జరిగిన ముడుపుల మంత్రాంగంతో వీరిని కాపాడేందుకు విద్యాశాఖలోని కొందరు పెద్దలు గట్టిగానే ప్రయత్నించారు. అపాయింట్‌మెంట్ ప్రొసీడింగ్ ఆర్డర్ ప్రకారం నకిలీ సర్టిఫికెట్లని తేలిన వెంటనే నేరుగా టెర్మినేట్ చేసే పూర్తి అధికారమున్నా.. అధికారులు కావాలనే కాలయాపన మొదలుపెట్టారు. ఆగస్టు మొదటి వారంలో నామమాత్రపు షోకాజ్ నోటీసు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అధికారులు ఇచ్చిన లొసుగులతో వెంటనే హైకోర్టును ఆశ్రయించి ఆ నోటీసులను కొట్టేయించుకున్నారు అక్రమార్కులు.
ఇక అంతా సేఫ్.. తమ సీట్లకు ఢోకా లేదనుకుని సంబరపడిపోతున్న సమయంలోనే ఎంట్రీ ఇచ్చింది బిగ్ టీవీ. నకిలీ లెక్చరర్ల ముసుగును చీల్చుతూ వరుస కథనాలతో దండెత్తింది. అసలు ప్రొసీడింగ్స్ ప్రకారం వేటు వేయకుండా లాలూచీ ఎందుకంటూ విద్యాశాఖ గుండెల్లో దడ పుట్టించింది. బిగ్ టీవీ కథనాల సెగతో ఆగస్టు 18న ఆర్జేడీ రెండోసారి షోకాజ్ నోటీసులు ఇవ్వక తప్పలేదు. ఈసారి కూడా అక్రమార్కులు విడివిడిగా, విడతల వారీగా కోర్టు మెట్లెక్కి తప్పించుకునే కుట్ర చేశారు. కానీ, షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందేనంటూ న్యాయస్థానం వారి పిటిషన్లను కొట్టివేసింది.
కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా, షోకాజ్ నోటీసు గడువు ముగిసినా చర్యలు శూన్యం. ప్రత్యేకించి వరంగల్ ఆర్జేడీ వ్యవహారశైలిపై అనుమానాలు రేకెత్తాయి. ‘నా చేతుల్లో ఏమీ లేదు. డైరెక్టరేట్ నుంచే తేల్చాలి’ అంటూ అక్రమార్కులకు కొమ్ముకాసే ప్రయత్నం చేశారు. చివరి నిమిషం దాకా లీగల్ ఒపీనియన్ల పేరిట ఫైళ్లను అటకెక్కించేందుకు స్కెచ్ వేశారు. కానీ బిగ్ టీవీ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. ఆర్జేడీ నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల లాలూచీ తతంగంపై ఉడుం పట్టు పట్టి ప్రతిక్షణం నిలదీసింది. ఇంపాక్ట్ స్టోరీలతో ఉన్నత విద్యాశాఖను కదిలించింది. తప్పించుకునే దారులన్నీ మూసుకుపోవడంతో.. గత్యంతరం లేక చివరకు ఆ 35 మంది నకిలీ జూనియర్ లెక్చరర్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమార్కులపై బిగ్ టీవీ అలుపెరగని పోరాటం మరోసారి విజయవంతమైంది. అయితే నకిలీలపై బిగ్ టీవీ పోరాటం ఇంతటితో ఆగలేదు. నకిలీ సర్టిఫికెట్లు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత విద్యాశాఖలో దూరిన సుమారు 736 మంది అక్రమార్కులపై చర్యలు తీసుకునేవరకు మేం పోరాడతాం.
Also read: అల్లూరి జిల్లాలో ఘోరం.. 5 నెలల పసిబిడ్డను దారుణంగా చంపేసిన కన్నతండ్రి!