Telangana Land: రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు భూ ఆక్రమణల అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కుటుంబ ఆస్తులు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న అసైన్డ్, ప్రభుత్వ భూములు, బీఆర్ఎస్ ముఖ్య నేతల కబ్జాలు, కన్వర్షన్లపై కాంగ్రెస్ ఎంపీల బృందం క్షేత్రస్థాయి వేట శరవేగంగా సాగుతోంది. అయితే అసలు ఈ ‘ల్యాండ్ ఎపిసోడ్’ ఎంతవరకు వర్కవుట్ అవుతోంది? ప్రజల్లోకి ఈ అంశం ఏ మేర వెళ్ళింది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందా? అనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలిస్తున్నారు. సీఎం ఆదేశాలతో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. మూడు కేటగిరీల్లో వివరాలు సేకరిస్తున్నారు. దాని ఆధారంగానే నెక్ట్స్ ఎపిసోడ్ కు ప్లాన్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి సర్కార్ మరో స్టెప్ ముందుకు వేయనున్నది.
కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ కీలక నేతలు అక్రమంగా సంపాదించారంటున్న భూముల వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ , దాని చుట్టుపక్కల సుమారు 388 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములపై సర్వే వేగంగా జరుగుతుంది. సమగ్ర సర్వే జరిపి భూములను స్వాధీనం చేసుకుని దళితులకు పంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇదే క్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీలు, ప్రతినిధుల బృందం సిద్ధిపేట, జాన్వాడ, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్, హరీష్ రావు వ్యవసాయ క్షేత్రాలపై వరుసగా క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించింది.అంతేగాక మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నాయకులు జీవో 111 పరిధిని ఉల్లంఘించి, ధరణి పోర్టల్‌ను ఆసరాగా చేసుకుని సమీకరించిన భూముల చిట్టాను మీడియా ద్వారా బయటకు రిలీజ్ చేస్తున్నారు. త్వరలో డాక్యుమెంట్లను సీరియల్ రూపంలో విడుదల చేస్తామని ఎంపీల బృందం వెల్లడించింది.
Also read: విజయవాడలో విషాదం.. వేడి సాంబార్ గిన్నెలో పడి మహిళ దుర్మరణం!
కేటగిరీ 1లో ప్రజల నుంచి స్పందన తీసుకోనున్నారు. బీఆర్ఎస్ నేతల అక్రమ ఆస్తుల బహిర్గతంపై సామాన్యులు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని దళితులు, నిరుపేదలకు పంచుతామన్న సీఎం మాటలపై ప్రజల్లో ఏ మేరకు విశ్వసనీయత ఉంది? అనే అంశాలపై వివరణ తీసుకోనున్నారు. కేటగిరీ 2లో హామీల నుంచి దారిమళ్లించేందుకే ఈ పొలిటికాలిక డ్రామా అని బీఆర్ఎస్ (కేటీఆర్, హరీష్ రావు) చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్ముతున్నారా? లేదా అక్రమాలు నిజమేనని భావిస్తున్నారా? అని తెలుసుకోనున్నారు. ఇక కేటగిరీ 3 లో భూ సమస్యల పరిష్కారం లభిస్తుందా? ధరణి స్థానంలో వచ్చిన భూ భారతి, 22 ఏ జాబితా సవరణ వంటి నిర్ణయాలతో మేలు జరిగిందా? లేదా? అని ఎంక్వైయిరీ చేయనున్నారు.
ఈ ఫ్లాష్ సర్వే రిపోర్టు ఆధారంగానే కాంగ్రెస్ తన వ్యూహం మార్చనున్నది. ప్రజల్లో మంచి స్పందన వచ్చి,కేసీఆర్ ఫ్యామిలీపై ‘ల్యాండ్ గ్రాబింగ్’ ముద్ర బలంగా పడిందని రుజువైతే వెంటనే ప్రభుత్వం విచారణ సంస్థలను రంగంలోకి దించనున్నది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిధిలోని వివాదాస్పద భూములపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేయడం తో పాటు ‘సిట్’ పరిధిని విస్తరించనున్నారు. అంతేగాక ఆరోపణలు నిజమని తేలిన భూములకు రికవరీ నోటీసులు ఇచ్చి మళ్లీ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అంతేగాక ఇక నుంచి పొలిటికల్ ప్లాట్ ఫామ్ లు, ప్రజల్లోకి కేసీఆర్ అండ్ టీమ్ లను ప్రధానంగా టార్గెట్ చేస్తూ సీఎం ఎదురుదాడికి దిగనున్నారు.
Also read: మైనర్ బాలికపై దారుణం.. దిశా పటానీ సిస్టర్ ఫైర్!