AP Capital Amaravati Submerged in Floods: బెజవాడలో కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయింది. రూపుదిద్దుకుంటున్న సరికొత్త రాజధాని వరదలకే తట్టుకోలేదు. ఇక విశ్వనగరంగా ఏం మారుతుంది? ఇదే స్టైల్‌లో జరుగుతుంది కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజంగా నిజమేనా? అమరావతి వరద గుప్పిట్లో చిక్కుకుందా?
విజయవాడ ఏరియాలో రెండు రోజుల్లో దాదాపు 42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఓ వైపు కృష్ణానదిలోకి రికార్డ్ స్థాయిలో వరద వచ్చి చేరింది. దీనికి తోడు బుడమేరు వాగు కూడా ఉప్పొంగింది. దీంతో విజయవాడ మునిగిపోయింది. అదే సమయంలో పక్కనే ఉన్న అమరావతి కూడా మునిగిపోయిందన్న ప్రచారం మొదలైంది. ఈ విషయం ఎంత వరకు నిజం? ఎంత వరకు అబద్ధం అనేది తెలుసుకునేందుకు బిగ్ టీవీ టీమ్ అమరావతిలో ల్యాండ్ అయ్యింది. కానీ.. అక్కడ అలాంటి పరిస్థితులు ఏం కనిపించలేదు.
ఏపీ అసెంబ్లీ వరద గుప్పిట్లో ఉందా?.. లేదు. ఎమ్మెల్యే, IAS అధికారుల నివాసాల వరద ఉందా?.. లేదు. హైకోర్టు ప్రాంతం వరదలో మునిగిపోయిందా?.. లేదు. పోనీ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగాయా?.. లేదు. కానీ విజయవాడ వరదలో మునిగినప్పటి నుంచి.. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి వరద నీటిలో మునిగిపోయిందని ఓ ప్రచారం జరుగుతోంది. నిజం ఏంటంటే.. వచ్చిన వరద వచ్చినట్టుగా కొండవీటి వాగు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నదిలోకి వెళ్లిపోతుంది.
రాజధాని ప్రాంతానికి, కృష్ణా నదికి మధ్యలో పెద్ద కరకట్ట ఉంది. వరదనీరు వచ్చింది.. కానీ ఆ కరకట్ట వరకే వచ్చి ఆగిపోయింది. ఆ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని భవనాలు మాత్రం కొంత వరకు మునిగాయి. మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం నది ఒడ్డునే ఉంది. అందుకే దానిలోకి నీళ్లు వచ్చాయి. ఆ పక్కనే ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటోన్న ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూడా నదికి ఆనుకొనే ఉండటంతో.. ఆ ఇంటి ప్రాంతంలోకి స్వల్పంగా వరద నీరు చేరింది. దీంతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
Also Read: ఈ వరదలకే విజయవాడ విలయవాడగా ఎందుకు మారింది ?
సాధారణంగా ఏ నదిలోకైనా ఎగువ ప్రాంతాల నుంచి పెద్దుత్తున వరదనీరు వచ్చి చేరినప్పుడు.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం కృష్ణానదికి గతంలో ఎన్నడూ లేని, చూడని రీతిలో వరదనీరు వచ్చి చేరింది. ఇది సరికొత్త రికార్డ్. ఇప్పట్లో దీన్ని బీట్ చేసేంతలా వరదలు వస్తాయా? అని ప్రశ్నిస్తే.. అది కూడా అనుమానమే. మరి ఇలాంటి వరదల సమయంలోనే అమరావతి చెక్కుచెదరలేదు. అంటే.. ఇన్‌డైరెక్ట్‌గా అమరావతి చాలా సేఫ్ అని ఓ సర్టిఫికేట్ ఇచ్చినట్టైంది.
అయితే రాజధానిపై విషప్రచారం చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. రాక్షసులతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాల్సి వస్తుందంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షోభం నుంచి బయటపడటానికి తాము ప్రయత్నిస్తుంటే.. కొందరు మాత్రం ఇక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగించే రాజకీయాలు చేస్తున్నారంటూ ఇన్‌డైరెక్ట్‌గా వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు.
అమరావతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ ఎందుకు మునిగింది? పక్కనే ఉన్న గుంటూరులోని లోతట్లు ప్రాంతాలు ఎందుకు జలమయం అయ్యాయి? వీటి మధ్యలో అమరావతి ఎందుకు మునగలేదు? దీనికి ఆన్సర్ అమరావతి మాస్టర్ ప్లాన్. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించే సమయంలోనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. రాజధాని గ్రామాల్లో ముంపునకు కారణమయ్యేంది కొండవీటి వాగు. దాని ముంపు నుంచి రాజధానిని రక్షించేందుకు అప్పట్లోనే చర్యలు తీసుకున్నారు. అత్యధిక వరద వచ్చినప్పుడు సమస్య తలెత్తకుండా లిఫ్టులను ఏర్పాటు చేశారు. వరద కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ ఏర్పాటు చేయడంతో ఈసారి ఆ వాగు ప్రవాహం సాఫీగా వెళ్లిపోయింది. ఎలాంటి ముంపునకు అవకాశం లేకుండా పోయింది. మొత్తంగా ఈ వివాదం అమరావతి నిర్మాణానికి వ్యతిరేక ప్రచారంగా మొదలైనా.. అనుకూలంగానే మారిందని చెప్పాలి.