కొండంత రాగం తీసి.. అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ ప్రకటించిన నిర్ణయాలు ఉన్నాయి. పార్టీ సీరియస్ గా ఉంది.. అధిష్టానం ఇక వదలదు.. తప్పకుండా వేటు వేస్తుంది.. తప్పిస్తారు. చర్యలు తీసుకుంటారు… ఇలా ఏవేవో ఊహాగానాలు. కానీ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడిన తరువాత అదంతా తుస్సేనని తేలింది. పార్టీలైన్ దాటారంటారు.
సీఎంపై అనుచిత వ్యాఖ్యలూ నిజమేనన్నారు. పార్టీలైన్ దాటొద్దు అని హితబోధ చేశారు. కానీ ఇక్కడ అది దాటినట్టుగా కనిపించిందని చెప్పుకొస్తారు. అన్నింటిపైనా వివరాలు సేకరించామన్నారు. ఆధారాలు పరిశీలించామన్నారు. వీడియోలు చూసి ధ్రువీకరించామన్నారు. కానీ చర్యలు ఇప్పుడే ఉండవనే సంకేతమిచ్చారు. మరోసారి కూడా చర్చించాలంటారు.
అంతా సీనియర్లు కదా.. అందుకే ఈ ఆలస్యమంటారు. అదుర్స్ సినిమాలో హీరో అన్నట్టుగా.. తెలియదు.. గుర్తు లేదు.. చెప్పలేము..! అని అన్నట్టుగా దొరికీ దొరకుండా, క్లారిటీ ఇచ్చి ఇవ్వకుండా.. స్పష్టమైన ప్రకటన చేసీ చేయకుండా.. దీనికి పుల్ స్టాప్ పెట్టినట్టా తెలియదు. కామాతో సరిపెట్టి.. సశేషం అనే అర్థం వచ్చేలా మాట్లాడి మొత్తానికి ఇలా ముగించేశారు.
ఓ రకంగా ఆ ప్రెస్‌మీట్‌తో పాటు ఈ వివాదానికి కూడా ముగించేసినట్టే అనిపించింది.ఇ కపై అంతా అంతర్లీనంగా పార్టీ తప్పులు సరిదిద్దుకునే చర్యలే ఉంటాయి తప్ప..ఇలా బాహాటంగా మీటింగులు పెట్టి.. క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పే ప్రెస్‌మీట్లు ఇకపై ఉండకపోవచ్చు. మల్లు రవి మాట్లాడిన తీరు తెన్నులు చూస్తే అదే అనిపించింది. కోమటిరెడ్డి పై ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి… ఎలా ముందుకు వెళ్లాలో ఇంకా ఆలోచిస్తున్నారట. నోటీసులు ఇచ్చేందుకు కూడా తటపటాయిస్తున్నారట.
అసమ్మతి సెగను ఎలా తగ్గించి.. కూల్ చేయాలనే పద్దతిలోనే అధిష్టానం ఉందనే విషయాన్ని చైర్మన్ ఇలా పరోక్షంగా తన నిర్ణయాల ద్వారా, ప్రకటన ద్వారా, ఎటూ తేల్చని చర్యల ద్వారా చెప్పినట్టయ్యింది. మళ్లీ చర్చిస్తాం.. కూర్చుంటాం.. కూలంకశంగా మాట్లాడుతాం.. ఆపై చర్యలు తీసుకుంటాం.. అని అయోమయ ప్రకటన ఒకటి చేసి..ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా.. అనుమానాలను నివృత్తి చేయకుండా అయోమయానికి లోను చేసి ఆయన తాపీగా తన పని పూర్తి చేసి వెళ్లిపోయారన్నమాట.