Polytechnic Skills: స్వేచ్ఛ బ్యూరో: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకుంటే విద్యార్థులకు చదువు పూర్తయ్యేలోపే కొలువు అవకాశాలు తలుపుతట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ దిశగా పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునిక కోర్సులు, పరిశ్రమల అనుసంధానం, ప్రాక్టికల్ శిక్షణతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్ కళాశాలలను తీసుకురావడం ద్వారా సంప్రదాయ సాంకేతిక విద్యకు ‘స్కిల్’ టచ్ ఇవ్వనున్నారు. పరిశ్రమలతో నేరుగా అనుసంధానం చేస్తూ ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తే.. పాలిటెక్నిక్‌లు ఇక కేవలం డిప్లొమా చదువుల కేంద్రాలుగా కాకుండా, కొలువుల గనులుగా మారే అవకాశం ఉంది.
క్షణానికి అప్‌డేట్ వస్తున్న కాలంలో అంతే వేగంగా వాటిని అందిపుచ్చుకునే నైపుణ్యం, మారుతున్న సాంకేతిక పరిస్థితులను అందిపుచ్చుకునే అవకాశం ఉన్నప్పుడే మార్కెట్‌లో రాణించడం సులువవుతుంది. కృత్రిమ మేధ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని శాసిస్తున్న కాలంలో పురాతన కోర్సులతో ఉపాధి అవకాశాలు లభించడం కష్టం. ఈ నేపథ్యంలో మన యువతకు మంచి ఉపాధి అవకాశాలు సృష్టించాలనే సంకల్పంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని(వైఐఎస్ యూ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలకొల్పారు.
ఆధునిక పరిశ్రమలకు కావల్సిన నైపుణ్యాలను అందించే కోర్సుల రూపకల్పన, ఆధునిక పారిశ్రామిక శిక్షణలతో సీఎం మార్గదర్శనంలో ఏర్పడిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ) ఇప్పటికే కొలువుల గనులుగా మారాయి. ఏటీసీల్లో శిక్షణ పొందిన వారంతా మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సంపాదించారు. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కోర్సులను సైతం ఆధునిక అవసరాలకు తగినట్లు రూపకల్పన చేయాలనే లక్ష్యంతో వాటిని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగై ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండడంతో, ప్రతిపక్ష నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పలు కుట్రలకు తెరలేపారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. విద్యార్థులు, బోధనా సిబ్బంది నష్టపోతారనే అపోహలు సృష్టించి గందరగోళానికి తెరలేపుతున్నారని మండిపడుతున్నారు.
Also Read: పట్టాలెక్కి ఆగిపోయిన చిరంజీవి చిత్రాలు..లిస్ట్ పెద్దదే!
ప్రపంచవ్యాప్తంగా ఏఐ దూకుడు అన్ని రంగాలను బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లోనూ ఉపాధి అవకాశాలు దక్కాలంటే స్పేస్, ఏరోనాటికల్, డాటా సెంటర్ ఆపరేషన్స్-మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, మెడికల్ కోడింగ్, సాఫ్ట్ స్కిల్స్, డాటా ఎనలిటిక్స్, ఫినిషింగ్ స్కిల్స్ ఫర్ నర్సింగ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, తయారీ రంగంలో ఆటోమేషన్ వంటి నూతన కోర్సుల్లో ప్రావీణ్యం తప్పనిసరి. వీటిలోనూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఉంటేనే మనుగడ సాధ్యమవుతుంది.
ఆధునిక పరిశ్రమలు నిపుణులకే పెద్దపీట వేస్తున్నాయి. ఈ తరుణంలో మూస ధోరణిలో ఉన్న పాలిటెక్నిక్ కోర్సుల స్థానంలో వారికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నైపుణ్యాలు నేర్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే పాలిటెక్నిక్ లను పరిశ్రమలతో భాగస్వామ్యం నెలకొల్పేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో విద్యా నాణ్యత పెరగడంతో పాటు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతాయి. వీటి వల్ల దేశవిదేశాల్లోని పరిశ్రమల్లో వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తోంది.
తెలంగాణ విద్యార్థులకు బంగారు భవిత ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతోంది. అదే సమయంలో సమూలమైన మార్పులు చేపట్టడం లేదు. పాలిటెక్నిక్‌ల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న డిప్లొమా విద్యా హోదాలో ఎలాంటి మార్పు చేయడం లేదు. ఏఐసీటీఈ నిబంధనలు, పాఠ్యాంశాలు, విద్యా ప్రమాణాలు, పరీక్షలు, సర్టిఫికెట్ల జారీ విధానం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. డిప్లొమా కోర్సును స్వల్పకాలిక నైపుణ్య శిక్షణగా మార్చే యోచన ప్రభుత్వానికి లేదని చెబుతున్నారు.
Also Read: రూ.5799కే 24 ఇంచుల టీవీ..చిన్న రూమ్స్, షాపులకు ఇది పర్ఫెక్ట్!
ఈసెట్ ఉండదనే అపోహను ప్రతిపక్షాలు సృష్టించి విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయని, అయితే ఈసెట్ ను నిర్వహించి అందులోని ర్యాంకుల ద్వారా బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ అవకాశాలను ప్రభుత్వం యథాతథంగా కల్పించనుంది. పాలిటెక్నిక్ కళాశాలలు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్లినా, ఆ కళాశాలలకు చెందిన భూములు, భవనాలు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక వసతులు పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోని శక్తి శాఖ పరిధిలోనే ఉంటాయని సర్కార్ స్పష్టంచేసింది. విద్యార్థులకు ఆధునిక ప్రయోగశాలలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల్లోని నిపుణుల గైడెన్స్, ఇంటర్న్ షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, మెరుగైన ఉపాధి అవకాశాలు వంటివి కల్పించడానికే పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని ప్రభుత్వం నెలకొల్పుతోంది.
పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, ఇతర ఉద్యోగుల సర్వీస్ రూల్స్, క్యాడర్, వారికి లభించాల్సిన ప్రమోషన్లు, బదిలీలు ఇలా అన్నింటికీ పూర్తిస్థాయి రక్షణ ఉండనుంది. వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారని సర్కార్ స్పష్టంచేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా పాలిటెక్నిక్‌ల ఫీజుల్లో మార్పు చేసే అవకాశం ఉండదని స్పష్టంచేసింది. పేద విద్యార్థులకు అందుతున్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్, రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగనున్నాయి. జీవో 97 ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను రద్దు చేయడం, ప్రైవేటీకరించడం, వాటి విద్యా స్వరూపాన్ని మారుస్తున్నారనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సర్కార్ వెల్లడించింది.
అవన్నీ ఉద్దేశ్యపూర్వకంగా ప్రతిపక్షాలు సృష్టిస్తున్న అపోహలేనని వెల్లడించింది. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడమే లక్ష్యంతో పాలిటెక్నిక్ లను సైతం ఏటీసీల తరహాలో తీర్చిదిద్దనున్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఆయా సంస్థలందించిన కోర్సులు పూర్తి చేసుకున్న వెయ్యికి పైగా విద్యార్థులు మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, పవర్ మెక్, అపోలో హాస్పిటల్స్ తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది.
Also Read: వామ్మో..బాబర్ కే కెప్టెన్సీ ఇచ్చేస్తా, లేకపోతే నన్ను రాళ్లతో కొడతారు !
ఏటీసీల్లో, స్కిల్స్ యూనివర్సిటీలో పరిశ్రమలు వారి అవసరాలకు తగిన శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన వారికి ఆయా సంస్థలు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. తాజా మార్పుతో ఇక ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ పొంది అగ్రగామి సంస్థల్లో ఉద్యోగాలు పొందనున్నారు. అలాకాకుండా ఉన్నత విద్యకు వెళ్లాలనుకున్న వారికి ఎప్పటిలాగే ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి వెసులుబాటు ఉంది.
కొత్త కోర్సులతో విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. లెక్చరర్ల సర్వీస్ రూల్స్ మారవు. ప్రమోషన్లు, జీత భత్యాల్లో తేడాలు రావు. వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారు. వారు ఎలాంటి అభద్రతభావానికి లోను కావద్దు. విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో రెండో సంవత్సరంలో జాయిన్ కావొచ్చు. ఈసెట్ ను ఎట్టి పరిస్థితుల్లో తొలగించం. విద్యార్థుల ఫీజులు పెరగవు.
విద్యార్థులకు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశ్యంతో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కు రూ.2వేలు స్కాలర్ షిప్ ఇస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. స్కిల్ నేర్పించేందుకు శక్తి డిపార్ట్ మెంట్ కిందకు తెచ్చాం. ఈ మార్పులు అటు లెక్చరర్లకు, ఇటు విద్యార్థులకు లాభదాయకంగా ఉంటాయి. తమ స్వార్థం కోసం ప్రతిపక్ష నేతలు విద్యార్థుల భవిష్యత్‌ను బలి చేయొద్దని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
Also Read: కేవలం చూడటానికే కాదు.. మీ స్మార్ట్ టీవీతో ఈ అద్భుతమైన పనులు కూడా చేయొచ్చు!