
Twitter Files: అమెరికా రాజకీయం మామూలుగా ఉండదు. ప్రజాస్వామ్య దేశమంటూ.. ప్రజాస్వామ్య సంరక్షకులమంటూ.. భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువంటూ.. ప్రపంచ పెద్దన్నగా తెగ ఫోజులు కొడుతుంది. మరి, అగ్రరాజ్యంలో అంతా సజావుగానే సాగుతోందా? అక్కడ ప్రజల హక్కులు సంరక్షించ బడుతున్నాయా? అంటే డౌటే అంటున్నారు. కొవిడ్ సమాచారాన్ని యూఎస్ గవర్నమెంట్ తొక్కిపెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ట్విటర్ పిట్ట గొంతు నులిపేసిందంటూ విమర్శలు వచ్చాయి. అదంతా నిజమేనంటూ లేటెస్ట్ ‘ట్విటర్ ఫైల్స్’ ఆనాటి సంచలన విషయాలు బహిర్గతం చేయడం కలకలం రేపుతున్నాయి.
రెండేళ్ల క్రితం. కరోనా కల్లోలం చెలరేగిన సమయం. అంతా ఆగమాగం. జనాలు తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు. ఏదో జరిగిపోతోందంటూ ఆందోళన చెందారు. వదంతులూ అదే రేంజ్ లో వ్యాపించాయి. అమెరికన్లు నిత్యావసరాల కోసం ఆరాటపడటం చూసి విపరీతంగా కొనుగోళ్లు చేపట్టకుండా అప్పటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ట్విటర్, గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. సోషల్ మీడియాలో ఓ సెక్షన్ ఆఫ్ న్యూస్ రాకుండా అడ్డుకోవాలని కోరారు. తప్పుడు సమాచారంతో ప్రజల్లో ఆందోళన రేకెత్తకుండా ఆ టైప్ న్యూస్ ను బ్యాన్ చేయాలని రిక్వెస్ట్ చేశారని ‘ట్విటర్ ఫైల్స్’ చెబుతున్నాయి.
ట్రంప్ లానే బైడెన్ ప్రభుత్వం సైతం కొన్ని వార్తలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టీకాలపై వ్యతిరేక ప్రచారం జరగకుండా ఆపేసింది. హార్వర్డు మెడికల్ స్కూల్ ఎపిడమాలజిస్టు మార్టిన్ కుల్డ్రోఫ్ అకౌంట్ ను ట్విటర్ సస్పెండ్ చేయడం అందులో భాగంగానే జరిగింది. కొవిడ్ టీకాలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే మార్టిన్ ఖాతా క్లోజ్ చేసినట్టు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఆ మేరకు ట్విటర్ ఫైల్స్ అమెరికాను షేక్ చేస్తున్నాయి.
ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్ వచ్చాక.. గత యాజమాన్యం పలు కీలక వార్తలను ఏ విధంగా తొక్కిపట్టిందనే వివరాలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇవి ట్విటర్ ఫైల్స్‌గా పాపులర్ అయ్యాయి. కొవిడ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని అణగదొక్కడంలో కొందరు ట్విటర్ ఎగ్జిక్యూటీవ్‌ల పాత్ర ఉన్నట్టు ‘ట్విటర్ ఫైల్స్’ను బట్టి తెలుస్తోంది. ఆ మేరకు ‘న్యూయార్క్ పోస్టు’లో డేవిడ్ జ్వెంగ్ ఓ కథనం రాశారు. ట్రంప్, బైడెన్ కార్యవర్గాలు కొవిడ్ విషయంలో తమకు అసౌకర్యంగా ఉన్న సమాచారం వాస్తవమైనా.. వాటిని అణగదొక్కేందుకు ట్విటర్ ఎగ్జిక్యూటీవ్‌లపై ఒత్తిడి తెచ్చినట్టు తన కథనంలో రాశారు. ‘న్యూయార్క్ టైమ్స్’ రిపోర్టర్ అలెక్స్ బెర్న్‌సన్ కొవిడ్ వ్యాక్సిన్‌పై పలు ప్రశ్నలు లేవనెత్తగా.. అతడి అకౌంట్ ను సస్పెండ్ చేయాలని ట్విటర్‌పై బైడెన్ సర్కారు ప్రెజర్ తెచ్చినట్టు తేలింది. ట్విటర్లో భావప్రకటనా స్వేచ్ఛను అమెరికా ప్రభుత్వం అణచివేసినట్టు ఆ కథనం సారాంశం.