US Iran War: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.. ప్రస్తుతం ప్రపంచంలో అగ్రరాజ్యం. అమెరికా తలుచుకుంటే.. ఏ దేశ తలరాతైనా మారుతుంది. ఇది చరిత్ర చెప్తున్న కఠోరమైన వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ వెనిజుయెలా. కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలి అనేది అమెరికా పాలసీ. ఏ దేశంలో అలజడి సృష్టించాలన్నా.. ఆ దేశాన్ని చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవాలన్నా.. ఆ దేశ అధినేతపై ఫోకస్ చేస్తుంది అమెరికా. వెనిజుయెలాలో కూడా అదే చేసింది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో భవనంపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. అతడిని కిడ్నాప్ చేసి.. అమెరికాకు తరలించింది. దీంతో ఓవర్ నైట్‌లో వెనిజుయెలాను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకుంది అమెరికా. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న వెనిజుయెలా ఇప్పుడు అమెరికా చేతుల్లోకి వచ్చేసింది.
ఇదే స్ట్రాటజీని ఇరాన్‌పై కూడా ఇంప్లిమెంట్ చేసింది అమెరికా. ముందుగానే భారీ మోహరింపులు.. రిహార్సల్స్.. పర్‌ఫెక్ట్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్.. ఇరాన్ సుప్రీం లీడర్, ఉన్నతాధికారులు ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు.. ఏం మాట్లాడుతున్నారు.. ఇలా ప్రతీది పక్కాగా ఆరా తీసి తొలిరోజే దాడి చేసింది. ఒకే రోజు ఇరాన్ సుప్రీం లీడర్ అయెతుల్లా అలీ ఖమేనీ సహా.. ఆర్మీ, ఇంటెలిజెన్స్, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు, భద్రతా సలహాదారులను ఖతం చేసింది. ఇది జరిగి వారం రోజులు దాటినా కానీ ఇరాన్‌ను ఇంకా కంట్రోల్‌లోకి తీసుకోలేక పోయింది అమెరికా. ఇక్కడే అమెరికా వ్యూహాలు బెడిసికొట్టాయి. పక్కాగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసినా.. అమెరికా, ఇజ్రాయెల్ క్యాలుక్యులేషన్స్‌కు అందని చాలా విషయాలు ఉన్నాయని తెలుసుకునేందుకు చాలా టైమ్ పట్టింది అమెరికాకు.
నిజానికి పాము ఎంత పెద్దదైనా… ఎంత ప్రమాదకరమైనా.. తల మీద దాడి చేస్తే చాలు.. చచ్చి ఊరుకుంటుంది. ఇరాన్ విషయంలో ఇదే అనుకుంది అమెరికా. ఖమేనీని ఖతం చేస్తే చాలు ఆటోమెటిక్‌గా దేశం తన కంట్రోల్‌లోకి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసింది అమెరికా. కానీ ఇరాన్ ఓ ప్రమాదకరమైన పాము కాదు.. ఓపికగా వేటాడే ఓ నక్కల గుంపును తలపిస్తోంది. గుంపును లీడ్ చేసే ఆల్ఫా హతమైనా… ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వ్యూహాలు మారుస్తూ అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తోంది ఇరాన్. మరి ఇది ఎలా సాధ్యమైంది? ఇరాన్ ఇంతలా ఎదురు దాడులకు ఎలా ప్రిపేర్ అయ్యింది? ఈ విషయాన్ని అమెరికా ఎందుకు పసిగట్టలేకపోయింది? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇరాన్ అంతు చూస్తాం.. ఇరాన్ అగ్ర నేతలు దిగిరావాల్సిందే.. లేదంటే అక్కడ వారిని మార్చేస్తాం.. ఇలా కొన్ని నెలలుగా స్టేట్‌మెంట్స్ ఇస్తూ వచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిజానికి ఈ వార్నింగ్‌లను ఇరాన్ లైట్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే అమెరికా ఏ రోజుకైనా దాడులు చేయక తప్పదు అనే ఆలోచన ఇరాన్ నాయకత్వంలో చాలా రోజులుగా ఉంది. అందుకే ముందస్తుగానే ఇరాన్ కౌంటర్ అటాక్స్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
మరో కీలకమైన విషయం ఏంటంటే.. ఇరాన్ అనేది ప్రపంచం అనుకున్నట్టు.. వెస్ట్రన్ మీడియా ప్రచారం చేసినట్టు సుప్రీం లీడర్ ఖమేనీ ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా నడిచే దేశం కాదని ఇప్పుడు ప్రూవ్ అయ్యింది. వెనిజుయెలాలో సైన్యం మొత్తం నికోలస్ మదురో కంట్రోల్‌లో ఉండేది. కానీ ఇరాన్ అలా కాదు. ఇరాన్‌లో నార్మల్ ఆర్మీతో పాటు.. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కూడా ఉంది. ఇది కేవలం ఆర్మీ మాత్రమే కాదు.. ఇది ఓ సమాంతర సైనిక వ్యవస్థ. అంతేకాదు.. ఇరాన్ తన ఆర్మీ కమాండ్‌ను డివైడ్ చేసింది. ఒక్కో కమాండ్‌కు ఒక్కో అధికారిని నియమించింది. ఏదైనా విపతక్కర పరిస్థితులు ఎదురైనప్పుడు బ్యాటిల్ ఫీల్డ్‌లో ఈ కమాండర్లు సొంతంగా డెసిషన్స్ తీసుకుంటారు.. దాడులు చేస్తారు.
ఎప్పుడైతే అమెరికాతో కయ్యం మొదలైందో.. అప్పటి నుంచే ఇరాన్ కౌంటర్ అటాక్ స్ట్రాటజీలకు పదును పెట్టడం ప్రారంభించింది. మిసైల్స్‌ను డెవలప్ చేసింది.. డ్రోన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది. భూమిపైన ఉంటే ఈజీగా దాడులు చేస్తుంది కాబట్టి.. తన మిసైల్స్, డ్రోన్స్‌ను భూమికి వందల అడుగుల లోతులో ఉన్న మిసైల్ సిటీస్‌లో స్టోర్ చేసింది. వీటిని చేరడం అమెరికా బంకర్ బస్టర్ బాంబులకు కూడా వీలు కావడం లేదు.
ఎట్ ది సేమ్ టైమ్.. ప్రాక్సీ వార్‌ను ప్రారంభించింది ఇరాన్. అమెరికా ఇరాన్‌పై దాడి చేయగానే.. ఇరాన్ నేరుగా సమాధానం చెప్పడంతో పాటు.. తన వెనకున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ రంగంలోకి దించింది. లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లో హుతీలు, ఇరాక్‌లోని షియా మిలిషియాలు అమెరికా బేస్‌లపై దాడులు చేస్తున్నారు. మొత్తానికి మొత్తం మిడిల్ ఈస్ట్‌ను ఓ యుద్ధక్షేత్రంగా మార్చేసింది ఇరాన్.
ఇరాన్ మరో ముఖ్యమైన పని చేసింది. అదే మిసైల్, డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం. ఇరాన్ చేసిన దాడుల్లో గల్ఫ్ దేశాల్లోని అమెరికాకు చెందిన 2 బిలియన్ డాలర్ల విలువైన రాడార్లు.. థాడ్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది ఇరాన్. కువైట్, ఖతార్, బహ్రెయిన్‌లోని కీలకమైన రాడార్ వ్యవస్థలు ఇప్పుడు నేలమట్టం అయ్యాయి. ఇది అమెరికా అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఖమేనీని ఖతం చేస్తే ఇరాన్ కథ సమాప్తమవుతుందని ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ అలా జరగకపోగా.. తీవ్రమైన ప్రతిదాడులు చేస్తోంది.
ఓవరాల్‌గా వెనిజుయెలాలో జరిగింది ఓ సర్జికల్ స్ట్రైక్ లాంటిది. కానీ ఇరాన్‌తో చేస్తున్నది ఒక ఐడియాలజీ వార్ అని చెప్పాలి. అక్కడ నాయకుడు మారినా, వ్యవస్థ మారదు. అమెరికా ఎయిర్‌స్ట్రైక్స్ ద్వారా ఇరాన్‌ను దెబ్బతీయగలదు కానీ, ఆ దేశాన్ని ఆక్రమించి కంట్రోల్ చేయగలదా? అనేది ఇప్పుడు తెలాల్సిన అంశం. అయితే ఇరాన్ తీవ్ర స్థాయిలో కౌంటర్ అటాక్స్ చేస్తుండటంతో అమెరికా ఇప్పుడు స్క్రిప్ట్ మార్చింది. దాడులు కొనసాగిస్తూనే.. ఇరాన్ వద్ద ఆయుధాలు అయిపోతున్నాయంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. అయితే అమెరికాకు మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఇరాన్.
అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలవ్వగానే మొదటి రెండు రోజులు అమెరికా పైచేయి సాధించినట్టు కనిపించినా.. ప్రతి దాడులతో ఇరాన్ కూడా సై అంటే సై అన్నట్టుగా దాడులు చేయడం మొదలుపెట్టింది. బాలిస్టిక్, హైపర్‌సోనిక్ మిసైల్స్‌తో పాటు డ్రోన్‌లను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌తో పాటు.. అనేక గల్ఫ్ దేశాల్లోని అమెరికా అసెట్స్, బేస్‌లపై దాడులు చేయడం మొదలుపెట్టింది. నిజానికి టెక్నాలజీ పరంగా కావొచ్చు.. ఇంటెలిజెన్స్ పరంగా కావొచ్చు.. పైచేయి సాధించిన అమెరికాకు ఇది కాస్త మింగుడు పడని అంశం. ఎందుకంటే ఇరాన్ నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని అమెరికా అంచనా వేసింది కానీ.. ఈ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ఊహించలేదు అమెరికా.
ఈ డ్యామేజ్‌ను కవర్ చేసుకోవడానికి అమెరికా కొత్త ప్రచారం మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. ఇరాన్ వద్ద క్షిపణులు, డ్రోన్స్ అయిపోయాయని.. ఇప్పటికే మిసైల్స్ దాడులు 90 శాతం తగ్గాయని.. డ్రోన్ దాడులు 80 శాతం తగ్గిపోయాయని ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించింది. కానీ ఇక్కడో లాజిక్ మిస్సవుతుంది అమెరికా. ఖర్చు పరంగా చూసుకుంటే ఇరాన్ చేసే దాడుల కారణంగా అమెరికాకు తడిసి మోపెడు అవుతుంది. 20 లక్షలతో తయారైన డ్రోన్, మిసైల్‌ను కూల్చడానికి ఇజ్రాయెల్, అమెరికాలు కోట్ల విలువైన ఇంటర్ సెప్టర్ మిసైల్స్‌ను ప్రయోగిస్తూ వస్తోంది. ఇది ఆర్థికంగా భారం కావడంతో పాటు.. మిసైల్స్ అయిపోతున్నాయనే చర్చ మొదలైంది. దీనిని ధ్రువీకరిస్తూ పెంటగాన్ ఏకంగా అఫిషియల్‌గా ఒక లెటర్ కూడా రాసింది. మరో 10 రోజుల పాటు ఇదే స్థాయిలో మిసైల్స్‌ను ప్రయోగిస్తూ పోతే.. స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కోల్పోతామని చెబుతోంది.
అయితే ఇదే స్ట్రాటజీని ఇరాన్‌పై ప్రయోగిస్తోంది అమెరికా. ఇరాన్ వద్ద ఆయుధాలు అయిపోయాయని.. మరికొన్ని వారాల్లో ఇరాన్ మన కంట్రోల్‌లోకి వస్తుందంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు ఇరాన్ పని పూర్తైన తర్వాత క్యూబా సంగతి కూడా చూద్దామంటున్నారు. కానీ ట్రంప్‌కు అంత చాన్స్ ఇవ్వమంటోంది ఇరాన్.
ఇరాన్ లెటెస్ట్‌గా ఒక ప్రకటన చేసింది. మరో 6 నెలల పాటు పోరాడడానికి అవసరమైన ఆయుధాలు, క్షిపణులు, డ్రోన్స్ తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు ఇరాన్ బ్రిగేడియర్ జనరల్ అలీ మొహమూద్. అంతేకాదు.. ఇప్పటి వరకు అమెరికాకు చెందిన ఏడు హైలీ అడ్వాన్స్‌డ్ రాడార్లు, థాడ్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ధ్వంసం చేశామని చెబుతోంది ఇరాన్. అంతేకాదు ఇరాన్ గగనతలంలో చక్కర్లు కొడుతున్న 80 అమెరికా డ్రోన్లను కూల్చేశామని ప్రకటించింది. ఇప్పటి వరకు 23 వేల విమానాలు రద్దయ్యాయని.. అనేక దేశాల విమానయాన రంగాలకు కోలుకోలేని దెబ్బ పడిందని ప్రకటించింది. దీనంతటికి కారణం అమెరికానే అని ప్రకటించింది. ఇరాన్ ప్రకటనలో మరో కీలక విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు ప్రయోగించిన మిసైల్స్ డ్రోన్స్ అన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్‌వి అని. అంటే 2012, 2013, 2014లో ఉత్పత్తి చేసిన మిసైల్స్‌ను మాత్రమే ప్రయోగించామని ఇరాన్ చెబుతోంది. ఇంకా లెటెస్ట్ టెక్నాలజీతో తయారైన మిసైల్స్‌ను తాము ఇంకా రంగంలోకి దించలేదంటోంది. గత పదేళ్లలో తాము చాలా మిసైల్స్‌ను సిద్ధం చేశామని చెబుతోంది. యుద్ధం మరో ఆరు నెలల పాటు కొనసాగినా.. పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామనేది ఇరాన్ ఇస్తున్న స్టేట్‌మెంట్.
ఇరాన్ చెప్పేది నిజంగా నిజమైతే.. అమెరికాకు తిప్పలు తప్పవనే చెప్పాలి. ఎందుకంటే మిసైల్స్, ఆయుధాల తయారీకి అమెరికా చేసే ఖర్చుకు, ఇరాన్ చేసే ఖర్చుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిసైల్ తయారీకి ఇరాన్ 20 లక్షలు ఖర్చు చేస్తే.. అమెరికాకు 2 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. సో.. అమెరికా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు అమెరికన్ ఆర్మీ మొత్తం కూడా సొంత దేశాలకు దూరంగా ఉంటుంది. వీటి మెయింటనెన్స్ మొత్తం గల్ఫ్ దేశాల్లోనే జరగాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ ఎప్పుడు ఏ వైపు నుంచి మిసైల్ ప్రయోగిస్తుందో తెలియని పరిస్థితి. సో.. దూర ప్రాంతంలో ఉన్న బేస్‌లకు వాటిని తరలించాల్సి ఉంటుంది.
ఇరాన్ ఒకటే మాట చెబుతోంది. మేము ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ దాడులు ప్రారంభించాయి. కాబట్టి మా సుప్రీం లీడర్ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం.. చేసిన ప్రతి దాడికి సమాధానం చెప్పేలా చేస్తామనే స్టేట్‌మెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది జరగడానికి మరో ఆరు నెలలు సమయం పట్టినా పర్లేదు అని చెబుతోంది ఇరాన్.
నిజానికి ఆరు నెలల పాటు పోరాడుతామనే స్టేట్‌మెంట్ చాలా వ్యూహాత్మకం అనే చెప్పాలి. ఇదే జరిగితే ఈ ఆరు నెలల పాటు గల్ఫ్ దేశాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.. ఆరు నెలల పాటు హర్మూజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచ చమురు రవాణాపై ఎఫెక్ట్ పడుతుంది.. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు తినడానికి తిండి కూడా ఉండదు. సో ఇన్‌డైరెక్ట్‌గా అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధం ఆపాలని ఒత్తిడి చేసే బాధ్యతను గల్ఫ్ దేశాలకు అప్పగించే ఎత్తుగడలా కనిపిస్తోంది. మరి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఇరాన్ నిజంగా ఆరు నెలల పాటు పోరాటం చేయగలదా? అమెరికా దాడులను కంటిన్యూ చేస్తుందా? లేక కొత్త సాకును చూపించి వెనక్కి తగ్గుతుందా?
Also Read:13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మాడియా బ్యాన్, రైతులకు గుడ్ న్యూస్, ఇంకా ఎన్నో..
Story by: Anup, Big Tv