వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ఇప్పటికే షాక్ ఇచ్చిన ఆ నాయకుడు .. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్‌కి ఊహించని స్ట్రోక్ ఇచ్చారట. తనతో పాటు మరో 12 మందితో కలిసి ఫ్యాన్ పార్టీకి బై బై చెప్పిన ఆ నేత… తనకు ఎర్త్ పెట్టాలని చూసిన టీడీపీ సీనియర్‌కి వ్యూహాత్మకంగా ఝలక్ ఇచ్చారంటున్నారు. కీలకమైన తన పదవి కాపాడుకోవడానికి ఆయన ఎసిన ఎత్తుగడతో పసుపు నేతలు అవాక్కయ్యారంట. ఇంతకీ ఎవరా వలస నేత? ఆయన గీసిన స్కెచ్ ఏంటి?
శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్… విశాఖ డెయిరీగా పాపులర్ అయిన ఆ సహకార సంస్థ చైర్మన్, వైసీపీ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసిన రోజుల వ్యవధిలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి చెందడంతో వైసీపీకి దూరంగా ఉన్న ఆడారి ఆనంద్.. తనతో పాటు విశాఖ డైరీలో ఉన్న 12 మంది డైరెక్టర్లతో ఆ పార్టీకి రాజీనామా చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ డెయిరీలో జరుగుతున్న అవకతవకలపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. విశాఖ డైరీ లోని తమ ప్రాధాన్యాన్ని, ఆస్తులను కాపాడుకోవడానికే ఆడారి ఆనంద్ కాషాయ కండువా కప్పుకున్నారంట.
ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలో విశాఖ డెయిరీ పేరు తెలియని వారు ఉండరు. రెండు లక్షల 50 వేల మంది పాడి రైతులతో లాభాల్లో నడుస్తున్న విశాఖ డెయిరీ వ్యవస్థాపకుడు ఆడారి తులసీరావు వారసుడుగా విశాఖ డైరీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు ఆడారి ఆనంద్ కుమార్. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి చెందడంతో కొంత గ్యాప్ తీసుకుని వైసీపీలో జాయిన్ అయ్యారు. 2021 నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో.. అప్పటి నుంచి వైసీపీకి, రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు
2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆడారి ఆనంద్.. కూటమి అధికారంలోకి వస్తే.. పార్టీ మారిపోతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి.. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీలో దిగిన ఆడారి ఆనంద్ .. సడన్‌గా బీజేపీలో చేరడానికి విశాఖ డెయిరీనే కారణమంటున్నారు. ప్రతిరోజు 8 లక్షల 50 వేల లీటర్ల పాలను సేకరించి వ్యాపారం చేస్తున్న విశాఖ డెయిరీ ఆస్తులను.. అక్రమాల ఉచ్చు బిగుసుకోకుండా, తన సొంత ఇమేజ్ ను కాపాడుకోవడానికే ఆయన కూటమి బాట పట్టారంట.
విశాఖ డెయిరీ ఆస్తులను మళ్లించి ఎన్నికల్లో ఖర్చు చేశారని అడారి ఆనంద్‌పై ఆరోపణలు వచ్చాయి. . దానికి తోడు సొసైటీ కింద ఉన్న విశాఖ డైరీని తర్వాత కార్పొరేట్ సంస్థగా మార్చేశారన్న అభియోగాలున్నాయి. రైతుల కోసం ప్రభుత్వం డెయిరీకి కేటాయించిన భూములను కూడా.. ఆడారి ఆనంద్ కుమార్ ఫ్యామిలీ సొంతం చేసుకుంటున్నారంటున్నారు. అందుకు సంబంధించిన ఫిర్యాదులను, అసెంబ్లీ సాక్షిగా విశాఖ నగర ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా బయటపెట్టారు. దాంతో విశాఖ డైరీలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీయడానికి.. ఆరుగురు ఎమ్మెల్యేలతో హౌస్ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు.
విశాఖ డెయిరీలో అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు శాసనసభ.. సభా సంఘాన్ని ఏర్పాటు చేశారు. సభా సంఘానికి MLA జ్యోతుల నెహ్రూను ఛైర్మన్‌గా .. MLAలు బొండా ఉమామహేశ్వర రావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, RVSKK రంగారావు, దాట్ల సుబ్బరాజులను సభ్యులుగా నియమించారు. విచారణ విషయంలో ఈ సంఘానికి పూర్తిస్థాయి అధికారాలు అప్పగించారు. విచారణకు అవసరమైతే నిపుణులను నియమించుకునేందుకు కమిటీకి వెసులుబాటు కల్పించారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈ హౌస్ కమిటీ.. విశాఖ డైరీలో తనిఖీలు చేసింది. సంస్థ నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలపై ప్రశ్నిస్తే.. యాజమాన్యం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదంట. ఆర్థిక లావాదేవీలపై ఆడిటర్లు, కంపెనీ చట్టంపై అవగాహన ఉన్న నిపుణులతో సమగ్ర విచారణ చేయిస్తామని సభా కమిటీ అంటోంది. పాడిరైతులకు ఎలాంటి నష్టం లేకుండా, డెయిరీ మళ్లీ లాభాల్లో నడిచేలా ఏం చేయాలనే అంశంపై శాసనసభకు నివేదిక ఇస్తామంటోంది. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల రైతులతో కూడా హౌస్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. విశాఖ డైరీలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీయడానికి విచారణను వేగవంతం చేసింది.
ఆ భయంతోనే ఆడారి ఆనంద్ కుమార్.. గత కొంత కాలంగా జనసేన పార్టీలో జాయిన్ అవుతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆనంద్ జాయినింగ్ వ్యవహారం కూటమి నేతల మధ్య చర్చకు రాగా.. టీడీపీ నుంచి సానుకూలమైన స్పందన రాలేదంట.. దాంతో జనసేనలో ఆడారి చేరికకు డోర్లు క్లోజ్ అయ్యాయంట. ఒక వైపు విశాఖ డైరీ ఛైర్మన్ పదవి చేయి జారిపోతుందన్న బెంగ, మరోవైపు కేసుల భయంతో అల్లాడుతున్న అడారిని టీడీపీ, జనసేనలు వద్దనుకున్నప్పటికీ బీజేపీ అక్కన చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఆయన చేరిక వెనుక చక్రం తిప్పారంటున్నారు.
Also Read: ముహూర్తం ఫిక్స్.. ఆ మంత్రులు ఔట్!
అసలు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కొంతమంది టీడీపీ సీనియర్ల ఒత్తిడి వల్లే విశాఖ డైయిరీపై హౌస్ కమిటీ వేశారంట. తన కుమారుడి కోసం ప్రతిష్టాత్మకమైన విశాఖ డెయిరీ చైర్మన్ పదవిపై కన్నేసిన టీడీపీ సీనియర్ నేత ఈ హౌస్ కమిటీ ఏర్పాటు చేయించేలా ఒత్తిడి తీసుకొచ్చారంటున్నారు. హౌస్ కమిటీ విచారణలో విశాఖ డెయిరిలో వైసీపీ హయాం నాటి అక్రమాలు వెలుగుచూస్తున్నాయంటున్నారు. ఆ కమిటీ నివేదిక స్పీకర్‌కి అందితే ఖచ్చితంగా అడారి ఆనంద్ పదవికి ఎసరు వచ్చి, ఆయనపై చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన పొలిటికల్ ప్రొటక్షన్ కోసం బీజేపీలో చేరారంట. మరి ఈ పరిణామాన్ని తెలుగుదేశం ఎలా తీసుకుంటుందో? హౌస్ కమిటీ విచారణలో అడారి అక్రమాలు వెలుగుచూస్తే కమలనాథులు ఆయనకు ఎంత వరకు అండగా ఉంటారో చూడాలి.