CM Revanth Reddy :గత కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలను నేడు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు(Dilraju) నేతృత్వంలో దాదాపు 36 మంది సెలబ్రిటీలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సెలబ్రిటీలందరూ తమ ప్రతిపాదనలను వినిపించగా.. ప్రభుత్వం కూడా సెలబ్రిటీలు చేయవలసిన పనులను సూచించడం జరిగింది. ఒక బెనిఫిట్ షో విషయం మినహా.. మిగతా అన్ని విషయాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతేకాదు ఇదే సమావేశంలో అల్లు అర్జున్ (Allu Arjun) కేసుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ కేస్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
తాజాగా జరిగిన సెలెబ్రిటీ భేటీలో.. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..” అల్లు అర్జున్ , రానా లాంటి సూపర్ స్టార్లు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మాకు గర్వకారణం. వాళ్లంతా కూడా మా ముందే పెరిగారు. మాకు ఎవరిమీద ద్వేషం లేదు. అలాగని ఎవరిమీద కోపం లేదు. చట్ట ప్రకారమే నడుచుకుంటాము. మంత్రివర్గ ఉపసంఘ భేటీ వేస్తున్నాము. మీరు కూడా ఒక కమిటీ వేసుకోండి. సినిమా పరిశ్రమ ఎదగాలన్నదే మా ఉద్దేశం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్ మీటింగ్లో తెలిపారు. అంతే కాదు బెనిఫిట్ షోలకు పర్మిషన్ లేదని చెప్పిన ఆయన, ఇకపై బెనిఫిట్ షోల గురించి ప్రస్తావన రాకూడదు అని కూడా స్పష్టంగా తెలియజేసినట్లు సమాచారం.
బెనిఫిట్ షో రద్దు చేయడానికి ప్రధాన కారణం అదే..
ఇకపోతే బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం అందరికీ తెలిసిన విషయమే. అల్లు అర్జున్, సుకుమార్(Sukumar )కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప 2. ఈ సినిమా బెనిఫిట్ షో డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్లో ప్రదర్శించారు. ఈ సినిమా చూడడానికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో వచ్చి ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అనుమతి నిరాకరించినా ఆయన ర్యాలీ నిర్వహించడం ప్రశ్నార్ధకంగా మారింది. దీనికి తోడు తమ అభిమాన హీరోని చూడడానికి అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఆడియన్స్ పై అల్లు అర్జున్ బౌన్సర్లు దాడి చేశారు.అలా తొక్కిసలాట జరగగా.. సినిమా చూడడానికి వచ్చిన రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకు శ్రీ తేజ్ ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇదంతా బెనిఫిట్ షో వల్లే జరిగిందని, ఏకంగా ప్రాణాలు పోవడంతో ప్రజలలో వ్యతిరేకత నెలకొంటుందని భావించిన ప్రభుత్వం ఇకపై ఏ సినిమాకైనా సరే బెనిఫిట్ షో ఉండదని తెలిపారు. అంతేకాదు బెనిఫిట్ షో ప్రస్తావన కూడా రాకూడదని కరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఏది ఏమైనా బెనిఫిట్ షో ల వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని, ప్రజల మేలే ప్రభుత్వం ధ్యేయం అంటూ తెలిపినట్లు సమాచారం.