– మెడ్ ప్లస్ బాగోతాలపై చర్యలేవి?
– డీజీ కమలాసన్ రెడ్డి మౌనానికి కారణాలేంటి?
– వెనుక లోపాయికారి ఒప్పందం జరిగిందా?
– సిబ్బందిని అప్రమత్తం చేస్తామని మెడ్ ప్లస్ నాటకాలు
– ఇప్పటికీ పాత పద్దతుల్లోనే అమ్మకాలు
– అయినా, మౌనంగానే అధికారులు
– చిన్న చిన్న షాపులపైనే ప్రతాపం
– బడా కంపెనీల జోలికి వెళ్లని వైనం
– ప్రజల ప్రాణాలతో చెలగాటం ఇంకెన్నాళ్లు?
What are the action on Med Plus : మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా ముందుకెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. డ్రగ్స్ వల్ల యువత జీవితం నాశనం అవుతోందని స్వేచ్ఛ-బిగ్ టీవీ కొన్నాళ్లుగా అనేక కథనాలను ప్రసారం చేస్తోంది. వీటిపై స్పందించిన రేవంత్ రెడ్డి సర్కార్, డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంది. ప్రత్యేక టీములను ఏర్పాటు చేయించి, మాదకద్రవ్యాల కట్టడికి పూనుకుంది. అయితే, కిందిస్థాయిలో కొందరి అధికారుల తీరు వల్ల అనుకున్న లక్ష్యానికి కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తోంది. డ్రగ్స్ విషయంలో స్వేచ్ఛ-బిగ్ టీవీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయగా, మెడికల్ షాపుల్లో మత్తు మందుల అమ్మకంపై కీలక విషయాలు తెలిశాయి. ముఖ్యంగా మెడ్ ప్లస్ స్టోర్స్‌లో జరుగుతున్న అమ్మకాలు తేడాగా ఉన్నాయని స్వేచ్ఛ-బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. దీనిపై పక్కా ఆధారాలతో కథనాలు ప్రసారం చేశాం. చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డికి లేఖ కూడా రాశాం. కానీ, ఆయన నుంచి సరైన స్పందన లేదు.
డీజీకి రాసిన లేఖలో ఏముందంటే?
మెడ్ ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే 50 మెడికల్ షాపుల్లో స్టింగ్ ఆపరేషన్ చేయగా, షెడ్యూల్ హెచ్ మెడిసిన్స్ ప్రిస్కిప్షన్ లేకుండానే అమ్మేస్తున్నారని బయటపడింది. కేవలం డాక్టర్ సిఫారసు చేస్తేనే ఇవ్వాల్సిన మందుల్ని ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వారికి అమ్మేస్తున్నారు. అంతేకాదు, సర్టిఫైడ్ ఫార్మాసిస్ట్ లేకుండానే చాలా షాపులు రన్ అవుతున్నాయి. టెన్త్, ఇంటర్ వరకు చదివిని వాళ్లనే ఫార్మసిస్టులుగా పెట్టుకున్నారు. దీనిపై మెడ్ ప్లస్ యాజమాన్యాన్ని వివరణ కోరగా, విచారం వ్యక్తం చేసి, తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తామని చెప్పారు. కానీ, యథేచ్ఛగా రూల్స్ బ్రేక్ చేసి మెడిసిన్స్ అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మెడికల్ షాపుల్లో తప్పుడు మాత్రలు ఇవ్వడం ద్వారా ఏటా 7 లక్షలకు పైగా ప్రాణాలు పోతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని మెడికల్ షాపుల నిర్వహణ, పర్యవేక్షణ మీ పరిధిలో ఉన్నందున చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డికి స్వేచ్ఛ-బిగ్ టీవీ లేఖ రాసింది.
మౌనంగా డీజీ.. లోపాయికారి ఒప్పందం జరిగిందా?
మెడ్ ప్లస్ అక్రమ అమ్మకాలపై వరుస కథనాలు ఇస్తున్నా, ఉన్నతాధికారుల్లో స్పందన కరువైంది. 80 శాతం షాపుల్లో రూల్స్ అనేవే పాటించడం లేదు. లైసెన్స్ ఉన్నా సరైన నిర్వహణ లేదు. దీనిపై అధికారులను అప్రమత్తం చేసినా మౌనమే సమాధానంగా వస్తోంది. డీజీ కమలాసన్ రెడ్డి అసలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈనెల 8న రెయిడ్ చేస్తామని, విజువల్ తీసి పంపుతామని ముందు చెప్పి, ఇంతవరకు పంపింది లేదు. దీనిపై మళ్లీ అడుగుదామని కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో మెడ్ ప్లస్‌తో ఆయన లాలూచీ పడి డ్రామా చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చిన్న షాపులపైనే ప్రతాపం
మెడ్ ప్లస్‌లో చాలావరకు ప్రిస్కిప్షన్ లేకుండానే మందులు ఇస్తున్నారు. ఇలా చేయడం తప్పు. అంతేకాదు, సరైన అర్హత లేనివాళ్ల చేత మెడిసిన్స్ అమ్మడం ద్వారా ప్రజల ప్రాణాలకే ప్రమాదం. మెడికేషన్ ఎర్రర్‌తో లక్షల మంది చనిపోతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్య. బాధ్యత గల అధికారులు చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలి. కానీ, పైస్థాయిలో అలాంటిదేం కనిపించడం లేదు. మామూలుగా, ఏదైనా చిన్న చిన్న మెడికల్ షాపులపై కంప్లయింట్ రాగానే వెంటనే అధికారులు అక్కడ వాలిపోతారు. క్షణాల్లో చర్యలు తీసుకుంటున్నారు. కానీ, బడా కంపెనీల జోలికి పోవడం లేదు. దీన్నిబట్టి చూస్తుంటే సిస్టమ్‌ను మేనేజ్ చేస్తున్నారని అర్థం అవుతోంది.
ఈ మెడ్ ప్లస్ మారదా?
పైకి తక్కువ రేటుకి మెడిసిన్స్ అమ్ముతామని మెడ్ ప్లస్ ఎంత ప్రమోషన్ చేసుకున్నా, వెనుక జరుగుతున్న బాగోతాలు బయటకు రాకుండా ఉండవు. చాలా స్టోర్స్‌లో రూల్స్ బ్రేక్ చేసి చేస్తున్న పనుల్ని ఎంత మేనేజ్ చేసినా గుట్టంతా బయటపడకుండా ఉండదు. గతంలో బల్క్ ఆర్డర్స్ తీసుకుని మెడ్ ప్లస్ చేసిన బాగోతాలు, సొంత బ్రాండ్ల అమ్మకాల పెంపు కోసం సిబ్బందికి కమీషన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎండీ మధుకర్ రెడ్డి చేసినవెన్నో వెలుగులోకి వచ్చాయి. వీటిపై చర్యలు తీసుకునేందుకు మాత్రం ఉన్నతాధికారి కమలాసన్ రెడ్డికి టైమ్ ఉండడం లేదు.
వీకెండ్ అంటున్న ఉన్నతాధికారులు
ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతూ, రోగుల జేబులతోపాటు ఆరోగ్యాన్ని కూడా కోలుకోలేని రీతిలో దెబ్బతీస్తున్న మెడ్ ప్లస్‌పై చర్యలు తీసుకోవడానికి కమలాసన్ రెడ్డి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? సాధారణంగా, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకి ఏదైనా కంప్లయింట్ వస్తే వెంటనే రంగంలోకి దిగుతారు. క్షణాల్లో స్పాట్ దగ్గరకు వెళ్తారు. కానీ, మెడ్ ప్లస్ విషయంలో మాత్రం అది జరగడం లేదు. శనివారం, ఆదివారం అంటూ కబుర్లు చెప్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు చాలా కీలకం. అయినా, పట్టింపు ఉండడం లేదు. ఈ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల నిర్వహణ అంతా డీజీ చేతుల్లో ఉంటుంది. ఆయన ఏది చెప్తే అదే చేస్తారు. మెడ్ ప్లస్ విషయంలో నిర్లక్ష్యం తగదని స్వేచ్ఛ-బిగ్ టీవీ ఆయనకు చెప్పినా, రెయిడ్ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదు. పైగా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. బాధ్యత గల అధికారులు ఇలా చేస్తే, ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుంది?