YS Jagan New Strategy: అధికారం శాశ్వతమన్నట్లు వ్యవహరించిన వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ తన స్ట్రాటజీలు మారుస్తున్నారా? ఘన విజయం నుంచి ఘోరపరాజయం పాలవ్వడానికి గల కారణాలను ఆయన విశ్లేషించుకుంటున్నారా? అందుకే అటు పార్టీతో పాటు పార్టీ కార్యాలయాల్లోనూ కీలక మార్పులు చేపట్టబోతున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆ కీలక మార్పులను చూడవచ్చంటున్నారు. ఇంతకీ జగన్ ఏం చేయబోతున్నారు?.. ఆయన లెక్కలేంటి?
మరో 30 ఏళ్లు పాలిస్తామని ధీమా వ్యక్తం చేసిన జగన్
గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న వైసీపీ అధికారానికి దూరమై మరో రెండు నెలల్లో ఏడాది పూర్తి కానుంది. అప్పుడు వైసీపీ అధినేత జగన్ దగ్గర ఉన్నదేంటి? ఇప్పుడు లేనిదేంటి? అంటే.. 2019లో 151 సీట్లతో సీఎం పీఠాన్ని అధిరోహించిన జగన్ మరో 30 ముప్పై ఏళ్ల పాటు ఏపీకి చెక్కుచెదరని పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఆయన అనుకున్నంత సజావుగా వైసీపీ పాలన సాగలేదు. ముప్పై ఏళ్లు కాదు కదా, అయిదేళ్లు పూర్తయ్యే సరికి ప్రతిపక్ష నేత హోదా కోసం అధికార పార్టీతో పేచీలు పెట్టుకోవాల్సిన పరిస్దితి తలెత్తింది.
2014 లోనే అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమా
అక్రమాస్తుల కేసుల్లో 16 నెలలు రిమాండ్ ఖైదీగా గడిపి వచ్చిన జగన్..2014 లోనే అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమాగా కనిపించారు. తండ్రి వైఎస్ మరణం, జైలు సెంటిమెంట్ తనకు ప్లస్ అవుతాయని లెక్కలు వేసుకున్నారు. అయితే రాజధాని లేకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొదటి సారి ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయినా ఆయన నిరుత్సాహ పడలేదు. మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి, సంక్షేమ పథకాల హామీలతో జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అప్పటికి కూటమిగా అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ, బీజేపీ, జనసేనలు 2019 ఎన్నికల్లో ఎవరి దారి వారు చూసుకోవడం కూడా జగన్‌కు కలిసి వచ్చింది.
మంచి మైలేజ్ ఇచ్చిన సుదీర్ఘ పాదయాత్ర
జగన్ అధికారంలోకి రావటానికి ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర మంచి మైలేజ్ ఇచ్చింది. మొత్తంమీద కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు జగన్. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని కుదురుకునే లోపే కరోనా రూపంలో ఓ పెద్ద విపత్తు వచ్చినా ప్రజలకు తాను అనుకున్న మంచిని జగన్ ఎంతోకొంత చేయగలిగారు. డీబీటీ రూపంలో సంక్షేమ పధకాలను ప్రజల ఇళ్లలోకి తీసుకు వెళ్లగలిగిన జగన్ సీఎంగా వారితో యాక్సిస్ మాత్రం మిస్ అయ్యారు.
జగన్ కార్యక్రమాల్లో అధికారుల అత్యుత్సాహం
ఆయన సభలకు వచ్చినా, సమావేశాలకు వచ్చినా అధికారులు అవసరానికి మంచి అత్యుత్సాహంతో చేసిన ఏర్పాట్లు జనంతో జగన్‌కు గ్యాప్ కు కారణమయ్యాయి. అప్పులు చేసి ఎక్కడెక్కడ నుంచో తెచ్చిన డబ్బులు నవరత్నాలకే వెచ్చించడంతో అభివృద్ది పూర్తిగా అటకెక్కి వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయింది. మొత్తమ్మీద పరదాల మాటున, ప్యాలెస్ నుంచి బటన్ నొక్కుతూ పాలన సాగించిన మాజీ ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదు
వైసీపీ నిర్వహించిన ధర్నాలకు ప్రజా స్పందన
ప్రజల అంచనాలకు తగినట్లుగా కూటమి సర్కార్ పాలన సాగటం లేదని.. సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు అందటం లేదని ఇటీవల వైసీపీ నిర్వహించిన ధర్నాలకు స్పందన రావటంతో ఆ పార్టీలో కొత్త ఊపును తీసుకు వచ్చింది. పార్టీని వీడే నాయకులు వీడుతున్నా, ప్రజల్లో వైసీపీ పట్ల నమ్మకం చెక్కుచెదరలేదని జగన్ భావిస్తున్నారంట. 11 సీట్లే దక్కినా 40 శాతం ఓటు షేర్ వచ్చిందని ఆయన ధీమాతో ఉన్నారంట. ఆ క్రమంలో ఇటీవల ఆయన పులివెందుల పర్యటనలకు వెళ్లిన సందర్బంలో ఆయనను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. దాంతో ఆయన అక్కడే ప్రజా దర్బార్ నిర్వహించారు.
వైసీపీ కేంద్ర కార్యాలయానికి పెరుగుతున్న కార్యకర్తల తాకిడి
పులివెందుల వెళ్లిన సందర్బాల్లో కచ్చితంగా ప్రజాదర్బార్ కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా పార్టీ కార్యకర్తలు, నేతల తాకిడి ఎక్కువైంది. జగన్ పార్టీ కార్యాలయంలో ఉండే రోజుల్లో ఆయన్ని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఆయన తనను కలవడానికి వచ్చే వారికి కొంత సమయమే కేటాయిస్తుండటంతో రోజులో ఎక్కువ మందికి ఆయనను కలిసేందుకు సమయం సరిపోవటం లేదంట. దీంతో ఆయన సెంట్రల్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారంట.
సెంట్రల్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహించే ఆలోచన
ఇప్పటివరకు కేవలం పులివెందుల నియోజకవర్గంలో మాత్రమే ప్రజాదర్బార్ నిర్వహించి అక్కడివారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న జగన్ ఇకపై తాడేపల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇలా ప్రజా దర్బార్ నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా ప్రారంభించారంట. ప్రజాదర్బార్‌తో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, రాష్ట్ర పరిస్థితుల పట్ల కూడా ఒక అవగాహన వస్తుందని జగన్ భావిస్తున్నారంట.
తాడేపల్లి నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు
గతంలో కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలాగే ప్రజాధర్బార్ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకునే వారు. ఇప్పుడు జగన్ సైతం రూటు మార్చి తన తండ్రి బాటలోనే పయనించేందుకు సిద్దమయ్యారంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రారంభమవుతుందని సమాచారం. ప్రజాదర్బార్ సందర్భంగా అభిమానులతో ఫోటో సెషన్‌కు కూడా ఆయన కొంత సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Also Read: ఫేక్ వీడియోలపై హైకోర్టులో పిటిషన్.. కేటీఆర్ చిక్కేనా?
సన్నిహితులు, ముఖ్య నేతలతో బెంగుళూరు ప్యాలెస్‌లో సమావేశం
ప్రజాదర్బార్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే తేదీలు వైసీపీ ప్రకటించనప్పటికీ తాడేపల్లి ప్యాలెస్‌లో అందుకు కావాల్సిన ఏర్పాట్లు మాత్రం చురుకుగా జరుగుతుండటంతో అతి త్వరలోనే ఉండవచ్చంటున్నాయి వైసీపీ వర్గాలు. పార్టీని బతికించుకోవడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ ఇటీవల బెంగళూరు ప్యాలెస్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారట. పార్టీ కీలక నేతలు, కొంతమంది సన్నిహిత కుటుంబ సభ్యులను పిలిపించుకొని చర్చలు జరిపారంట.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన తర్వాత జగన్ పాదయాత్ర?
ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి? ఎలా ముందుకు పార్టీని తీసుకువెళ్లాలి అనే దానిపై మంతనాలు సాగించారంట. అందులో భాగంగానే ప్రజాదర్బార్ ప్రతిపాదన వచ్చిందంట. అలాగే ఏపీలో మరోసారి జగన్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారంట. మరో మూడు నెలల సమయం టిడిపి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన తర్వాత జగన్ పాదయాత్ర ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది
జగన్ జిల్లాల పర్యటనపై ఊదరగొట్టిన వైసీపీ నేతలు
అయితే సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు ఊదరగొట్టాయి. ఆ పర్యటన మాట ఏమో కాని వైసీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో కూడా జగన్ పాల్గొనలేదు. దాంతో పార్టీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిపోతున్నాయి. అసలు జగన్ ఎప్పుడు తాడేపల్లిలో ఉంటారో? ఎప్పుడు బెంగళూరు ఫ్లైట్ ఎక్కుతారో ఆ పార్టీ నేతలకే అంతుపట్టకుండా తయారైంది. మరోవైపు సజ్జల, వైవీ సుబ్బారెడ్డి లాంటి కీలక నేతలు పార్టీ శ్రేణులకు కనిపించడమే మానేశారు. మరిలాంటి పరిస్థితుల్లో ప్రజాదర్బార్, పాదయాత్ర అంటున్నారు. మరి ఆయన జిల్లా పర్యటనల తరహాలో ఆ కార్యాచరణ కూడా అటకెక్కుతుందో? లేక పోతే నిజంగా ఆయన జనంలోకి వస్తారో చూడాలి