Ankita Naidu: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9). సెప్టెంబర్ 5వ తేదీ నుండి స్టార్ మా వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ షోలో దాదాపు 5 మంది కామన్ మ్యాన్ క్యాటగిరిలో అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే 20 వేలకు పైగా అప్లికేషన్లు రాగా అందులో ఫిల్టర్ చేసి 450 మందిని బయటకు తీశారు. అందులో మళ్ళీ ఫిల్టర్ చేసి 45 మందిని ఎంపిక చేయగా.. వీరందరికీ ‘అగ్నిపరీక్ష’ అంటూ ఒక మినీ షో ద్వారా చిన్నచిన్న టాస్కులు పెట్టి అందులో నెగ్గిన 15 మందిని మొదట ఎంపిక చేసి.. వారికి మరింత కఠినమైన టాస్కులు ఇచ్చి చివరిగా 5 మందిని ఎంపిక చేయనున్నారు. అలా ఎంపికైన ఐదు మందిని హౌస్ లోకి పంపించబోతున్నారు. ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్స్టార్ వేదికగా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష మినీ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.
ఎన్నో కష్టాలు దాటి బిగ్ బాస్ షో కి సెలెక్ట్ అయ్యా..
అలా అగ్నిపరీక్షకు అప్లికేషన్లు పెట్టుకున్న వారిలో ట్రాన్స్ జెండర్ అంకిత నాయుడు (Ankita Naidu) కూడా ఒకరు. పలు రౌండ్లలో ముందుకు వెళ్లిన ఈమె అగ్నిపరీక్ష స్టేజ్ పై మాత్రం కనిపించలేదు. అందుకు గల కారణాన్ని, తన జర్నీ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. ట్రాన్స్ జెండర్ అయిన అంకిత నాయుడు మాట్లాడుతూ.. “నేను అబ్బాయిగా పుట్టాను. కానీ చిన్నప్పుడే ఇంట్లో ఎవరూ లేనప్పుడు చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని గాజులు వేసుకోవాలనిపించేది. అలా చేసేదాన్ని కూడా.. కానీ 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇక నా వల్ల కాలేదు. అమ్మాయిలా మారిపోదాం అనుకున్నాను. కానీ నాకున్న ఇద్దరు అక్కలు పెళ్లి అయిన తర్వాత అమ్మాయిగా మారాను. ఈమధ్య బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చింది. ఇది చాలా పెద్ద ప్లాట్ఫారం అలాంటి షో కి సెలెక్ట్ అయ్యాను అని తెలిసి సంతోషపడ్డాను.
నా కమ్యూనిటీ వాళ్లే వెనక్కి లాగారు – అంకిత నాయుడు
కానీ నేనంటే గిట్టని వారు నాపై నిందలు వేశారు. నిజానికి నేను గతంలో భిక్షాటన చేశాను. వేశ్యగా కూడా మారాను.. షాప్ ఓపెనింగ్స్ కి కూడా వెళ్లాను. ఇవన్నీ దాటుకొని ఇప్పుడు బిగ్ బాస్ లో అవకాశం అందుకుంటే.. నా కమ్యూనిటీ వాళ్లు మాత్రం నన్ను వెనక్కి లాగేసారు. నిజానికి గతంలో బిగ్ బాస్ కు వెళ్ళిన ప్రియాంక సింగ్ చాలామందికి డ్రీమ్ గర్ల్. నాకు కూడా ఆమె రోల్ మోడల్. ఆమె లాగే నేను కూడా సక్సెస్ సాధించి, నా కమ్యూనిటీకి ఆదర్శంగా నిలవాలి అనుకున్నాను. కానీ అది జరగలేదు. ముఖ్యంగా అగ్నిపరీక్ష షోలో శ్రీముఖి నన్ను స్టేజ్ పైకి రమ్మని ఆహ్వానించింది. ఒక పాట కూడా ప్లే చేశారు. ఇంతలో వెళ్లకుండానే ఆపేశారు.. బిగ్ బాస్ టీం కి నేను వేశ్యగా పనిచేసినప్పటి వీడియోలు పంపించారు. దాంతో నన్ను తీసుకోవడానికి వారు ఇష్టపడలేదు. ముఖ్యంగా నేను సెలెక్ట్ అవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.. ఇక నన్ను నెగిటివ్ చేసి ఇక నా కల నెరవేరకుండా చేశారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అంకితా నాయుడు.
ALSO READ:Samantha: క్రైమ్ థ్రిల్లర్ కథతో సమంత కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?