Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8 దాదాపు ఫైనల్స్‌కు చేరుకుంది. ఇటీవల హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్‌కు కూడా బయట బాగానే పాపులారిటీ లభించింది. అలా గత వారం ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటికి వెళ్లాడు పృథ్వి. తను హౌస్‌లో ఉన్నంతకాలం విష్ణుప్రియా అసలు తనను వదిలిపెట్టలేదు. విష్ణుప్రియా, పృథ్వి మధ్య నడుస్తున్న ట్రాక్.. కొన్నాళ్ల తర్వాత ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. పృథ్వి ఎన్ని తప్పులు చేసినా విష్ణు వల్లే హౌస్‌లో ఉంటున్నాడని చాలామంది ఫీల్ అయ్యారు. అందుకే తనను బయటికి పంపించేశారు. పృథ్వి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయినా కూడా విష్ణు తనను మరిచిపోకుండా తలచుకుంటూనే ఉంది.
అవే రిగ్రెట్స్
తాజాగా ప్రసారమయిన వీకెండ్ ఎపిసోడ్‌లో హౌస్‌లో జరిగిన ఏ సంఘటనల వల్ల కంటెస్టెంట్స్ రిగ్రెట్ అయ్యారో చెప్పమని అడిగారు నాగార్జున. అందరూ తమకు గుర్తున్న సందర్భాలను చెప్పారు. ప్రేరణ అయితే తను మెగా చీఫ్‌గా ఉన్న వారం గురించి రిగ్రెట్ అవుతానని, ఇంకా మంచిగా ఉండాల్సింది అని చెప్పుకొచ్చింది. గౌతమ్.. తాను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయిన వారం గురించి తలచుకొని రిగ్రెట్ అవుతానని అన్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావడం తనకు సంతోషంగా ఉన్నా కూడా ఆ వారం తన ఎమోషన్స్‌ను హ్యాండిల్ చేసుకోలేకపోయానని, ఇంకా బాగా ఉండాల్సింది అని చెప్పుకొచ్చాడు. రోహిణి.. ఎలిమినేషన్ షీల్డ్ టాస్క్ సమయంలో అవినాష్‌ను సేవ్ చేసి ఉండాల్సిందని, ఆ విషయంలో రిగ్రెట్ అవుతానని చెప్పింది.
Also Read: రోహిణి ఎలిమినేట్..8 వారాలకు ఎంత రెమ్యునరేషన్ అందుకుందంటే..?
మళ్లీ కలిసిపోయారు
నిఖిల్.. ఈవారం గురించే రిగ్రెట్ అవుతున్నానని అన్నాడు. మామూలుగా తను నోరుజారను అని, కానీ గౌతమ్ తనను తిట్టగానే తాను కూడా తిరిగి తిట్టానని గుర్తుచేసుకున్నాడు. అలా నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన గొడవల గురించి నాగార్జున కూడా కాసేపు మాట్లాడారు. ఇద్దరూ కోపంలో నోరు జారి మాటలు అనుకోవడం కరెక్ట్ కాదని మందలించారు. ఇద్దరూ తమ తప్పును ఒప్పుకొని హగ్ చేసుకున్నారు. నబీల్ విషయానికి వచ్చేసరికి రెండోసారి మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చినా కూడా తాను కాకుండా అవినాష్‌కు త్యాగం చేసినందుకు రిగ్రెట్ అవుతున్నానని అన్నాడు. అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో, టాస్కులు ఆడే విషయంలో నబీల్‌కు తిత్తర ఎక్కువయ్యిందని స్టేట్‌మెంట్ ఇచ్చారు నాగార్జున.
అప్పటివరకు తెలియలేదు
చివరిగా విష్ణుప్రియాను ఏ విషయంలో రిగ్రెట్ అవుతున్నావని అడగగా.. మామూలుగా తాను అసలు ఏ విషయంలోనూ రిగ్రెట్ అవ్వకుండా జీవితాన్ని గడిపే మనిషిని అని స్టేట్‌మెంట్ ఇచ్చింది విష్ణు. అలా అంటే 6వ వారం నుండి 11వ వారం వరకు అన్నింటిలో రిగ్రెట్ అవ్వాలి అని చెప్పుకొచ్చింది. తనకు మామూలుగా ఫ్లర్ట్ చేసే అలవాటు ఉందని, అదే అలవాటులో పృథ్విని ఫ్లర్ట్ చేశానని, అలా తన వల్లే పృథ్వి బయటికి వెళ్లిపోయాడేమో అని ఫీల్ అయ్యింది విష్ణుప్రియా. బయట నుండి వచ్చిన గెస్టులు చెప్పేవరకు తను చేసిన తప్పేంటో తనకు అర్థం కాలేదని చెప్పింది. అంతే కాకుండా తాను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు నబీల్‌ను నామినేట్ చేయడం కూడా రిగ్రెట్ అవుతున్నానని తెలిపింది.