IIT Graduate Live In Maid| IIT సంస్థల్లో బిటెక్ చేస్తే మంచి ఉద్యోగం ఈజీగా వస్తుందని చాలా మంది భావిస్తారు. దశాబ్దం క్రితం వరకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్లు వచ్చినా కంపెనీ మళ్లీ ఆ ఆఫర్లని రద్దు చేసుకుంటున్నాయి. దీంతో ఐఐటి సహా చాలా పెద్ద యూనివర్సిటీల్లో చదువుకున్న వారికి కూడా ఉద్యోగాలు లభించడం లేదు. అలా ఐఐటీలో చదువుకున్న ఓ యువతి ప్రస్తుతం ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి రావడంతో ఆమెకు తాత్కాలిక వసతి కూడా అవసరమైంది. చేతిలో ఉన్న డబ్బు మరో రెండు లేదా మూడు రోజులకు మాత్రమే సరిపోతుందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఉద్యోగంతో పాటు సురక్షితమైన తాత్కాలిక వసతి కోసం ఆమె రెడ్డిట్ ప్లాట్‌ఫామ్ ద్వారా సహాయం కోరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగం దొరికితే ప్రాధాన్యం ఇస్తానని ఆమె పేర్కొంది. అవసరమైతే ఇతర నగరాలకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఆ యువతి ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, అనలిటిక్స్, రీసెర్చ్ రంగాలను కూడా ఆమె పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్ సపోర్ట్, టెక్నికల్ రైటింగ్ ఉద్యోగాలపై కూడా ఆసక్తి చూపినట్లు సమాచారం. ఆమెకు Excel, CAD, CAE, FEA వంటి సాంకేతిక నైపుణ్యాలు ఉన్నట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అలాగే మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్ అనలిటిక్స్‌లో అనుభవం ఉన్నట్లు సమాచారం. Python, Pandas, SQL నేర్చుకుంటున్నట్లు కూడా ఆమె చెప్పింది.
హైదరాబాద్ ఆమెకు మొదటి ప్రాధాన్యతగా ఉన్నట్లు తెలిపింది. అయితే బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, పుణె వంటి నగరాలకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగంతో పాటు సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన తాత్కాలిక వసతి ఆమెకు అవసరమైంది.
ఆమె పరిస్థితిపై స్పందించిన రెడ్డిట్ యూజర్స్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కొందరు టీచింగ్, కోచింగ్ సెంటర్లలో తాత్కాలిక ఉద్యోగాలను సూచించారు. మరికొందరు IIT అలుమ్ని, ప్రొఫెసర్లు, స్టార్టప్‌లను సంప్రదించాలని సూచించారు.
ఆమెకు ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు సంబంధించిన ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్ అనుభవం ఉన్నట్లు సమాచారం. మ్యాచినింగ్ సమస్యలు, ప్రాసెస్ ఆప్టిమైజేషన్ వంటి అంశాలపై పనిచేసినట్లు తెలుస్తోంది. కెపాసిటీ ప్లానింగ్, ఫిక్చర్స్, టూలింగ్పై కూడా ఆమెకు అనుభవం ఉన్నట్లు సమాచారం. మాన్యుఫ్యాక్చరింగ్ లీడ్ టైమ్ తగ్గించడంపై ఆమె ప్రాజెక్టులు చేసినట్లు తెలుస్తోంది.
ఆ యువతి IIT నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసినట్లు రెడ్డిట్ పోస్ట్‌లో తెలిపింది. ఆమె మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో స్పెషలైజేషన్ చేసింది. అయితే ప్రస్తుతం తన డ్రీమ్ జాబ్ కోసం ఎదురుచూడటం లేదని ఆర్థికంగా నిలబడేందుకు వెంటనే ఏదైనా సరైన ఉద్యోగం కావాలని ఆమె కోరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లివ్ – ఇన్ మెయిడ్ (ఇంట్లోనే నివాసం ఉండే పనిమనిషి) గా పనిచేసే అవకాశం వచ్చినా సరే చేస్తానని తెలిపింది.
ఆ యువతి రెడ్డిట్లోని FresherTechJobsIndia అనే కమ్యూనిటీలో తన పరిస్థితిని వివరించింది. “Does anyone need a live in maid?” అనే శీర్షికతో ఆమె పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగంతో పాటు హైదరాబాద్‌లో తాత్కాలికంగా ఉండేందుకు స్థలం కావాలని ఆమె కోరింది. వెంటనే ఉద్యోగంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా పేర్కొంది. కొంతమంది ఆమె CVను పరిశీలించేందుకు, ప్రత్యక్షంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం.
Also Read: నెలకు రూ.3000 నుంచి ఏకంగా రూ.5 లక్షల జీతం.. NITలో బిటెక్ డ్రాపవుట్ సక్సెస్ స్టోరీ