New Investment Options for Indian Investors| భారతీయ పెట్టుబడిదారులు చాలా కాలంగా సంపద పెంచుకోవడానికి కొన్ని సంప్రదాయ పెట్టుబడులనే ఎక్కువగా ఎంచుకున్నారు. వృద్ధి కోసం షేర్లు, భద్రత కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇన్నాళ్లు ఉపయోగించారు. బంగారాన్ని ఆర్థిక అనిశ్చితి సమయంలో రక్షణగా భావించారు. దీర్ఘకాలంలో భారీ సంపద కూడబెట్టేందుకు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇప్పుడు పెట్టుబడిదారులు క్రమంగా మారుతున్నారు. యువ పెట్టుబడిదారులు కొత్త ఆర్థిక అవకాశాలను పరిశీలించడం ప్రారంభించారు.
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సమాచారం అందుబాటులోకి రావడంతో కొత్త ఆప్షన్స్ పెరిగాయి. ప్రైవేట్ క్రెడిట్, స్ట్రక్చర్డ్ డెట్ డిజిటల్ ఆస్తులు ప్రాధాన్యం పొందుతున్నాయి. సంప్రదాయ పెట్టుబడులు పూర్తిగా ప్రాధాన్యం కోల్పోతున్నాయని దీని అర్థం కాదు. పెట్టుబడిదారులు ఇప్పుడు తమ పోర్ట్‌ఫోలియోలను మరింత విభిన్నంగా రూపొందిస్తున్నారు.
ముఖ్యంగా యువ పెట్టుబడిదారులు క్రిప్టోకరెన్సీలపై ఆసక్తి చూపుతున్నారు. వారు గ్లోబల్, అధిక వృద్ధి అవకాశాల కోసం కొత్త ఆస్తులను పరిశీలిస్తున్నారు. చాలామంది ఇప్పుడు బిట్‌కాయిన్, ఎథీరియం వంటి ప్రముఖ డిజిటల్ ఆస్తులపై దృష్టి పెడుతున్నారు. అధిక రిస్క్ ఉన్న టోకెన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా క్రమం తప్పకుండా చిన్న మొత్తాలను పెట్టుబడి చేస్తున్నారు. ఈ విధానం మార్కెట్ టైమింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. అయితే క్రిప్టో పెట్టుబడులు అధిక రిస్క్‌ను కలిగి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు ఆ అస్సెట్ (ఆస్తి) విలువ ఎలా పెరుగుతుందో లేదా తగ్గుతుందో? అర్థం చేసుకోవాలి.
సంపన్న పెట్టుబడిదారులు సంప్రదాయ స్టాక్ మార్కెట్లకు మించి ఇతర అవకాశాలను చూస్తున్నారు. ప్రైవేట్ క్రెడిట్, స్ట్రక్చర్డ్ డెట్ మరియు రియల్ ఆస్తులు ఆసక్తిని పొందుతున్నాయి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ కూడా గత కొన్నేళ్లలో విస్తరించాయి. ఇవి గతంలో ప్రధానంగా సంస్థాగత పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండేవి. డైవర్సిఫికేషన్ (వైవిధ్యీకరణ) ఈ మార్పునకు ప్రధాన కారణం. వివిధ ఆస్తులు మార్కెట్ పరిస్థితులకు భిన్నంగా స్పందించే అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లో లిక్విడిటీ సమస్యలు, అధిక రిస్క్ ఉండవచ్చు. అందువల్ల ఇన్‌వెస్ట్‌మెంట్ చేసే ముందు దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం.
నిర్దిష్ట కాలపరిమితి, ఆదాయం కోరుకునే పెట్టుబడిదారులు ప్రైవేట్ క్రెడిట్‌ను పరిశీలిస్తున్నారు. నాన్ – కన్వర్టిబుల్ డిబెంచర్లు కూడా కొన్ని పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొన్ని డెట్ సాధనాలకు ఆస్తి ఆధారిత భద్రత ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఆధారిత డెట్ ద్వారా ప్రత్యక్ష ఆస్తి కొనుగోలు లేకుండా అవకాశాలు పొందవచ్చు. ఈ పెట్టుబడులు రిస్క్, రాబడి పరంగా ఎఫ్‌డీలు, ఈక్విటీల మధ్య ఉండవచ్చు. అయితే రాబడులు లేదా మూలధన భద్రతకు ఎలాంటి హామీ ఉండదు. పెట్టుబడి చేసే ముందు కంపెనీ, భద్రత, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పరిశీలించాలి. డిఫాల్ట్ జరిగితే ఏమవుతుందో కూడా తెలుసుకోవాలి.
Also Read: ఐటిఆర్ ఫైల్ చేశాక.. ట్యాక్స్ రీఫండ్ ఎప్పుడు వస్తుంది?
రియల్ ఎస్టేట్ ఇప్పటికీ ముఖ్యమైన పెట్టుబడి ఎంపికగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా ఇల్లు లేదా భూమి కొనడమే ఏకైక మార్గం కాదు. పెట్టుబడిదారులు ప్రొఫెషనల్‌గా నిర్వహించే రియల్ ఎస్టేట్ ఫండ్లను పరిశీలించండి. అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడి అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఎంపికకు రిస్క్, లిక్విడిటీ, రాబడి అవకాశాలు వేర్వేరుగా ఉంటాయి. అంచనా రాబడులను హామీగా భావించకూడదు.
ఎక్కువ పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయని అధిక రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పెట్టుబడిదారుడి లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి కాలం మరియు లిక్విడిటీ అవసరాలను పరిశీలించాలి. అందరికీ ఒకే రకమైన పెట్టుబడి కేటాయింపు సరిపోదు. సోషల్ మీడియా ట్రెండ్లను చూసి తొందరపడి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకూడదు. నష్టపోయినా భరించలేని మొత్తాన్ని అధిక రిస్క్ ఆస్తుల్లో పెట్టకూడదు. భవిష్యత్తులో భారతీయుల సంపద నిర్మాణం అనేక ఆస్తుల కలయికతో సాగవచ్చు. వృద్ధి, ఆదాయం, భద్రత కోసం వేర్వేరు పెట్టుబడులు ఉపయోగపడవచ్చు.
Also Read: ఐటిఆర్ ఫైల్ చేసినా ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందా? దీనికి 3 కారణాలు ఇవే