Atal Pension Yojana: యవ్వనం, మధ్య వయసులో ఉపాధికి పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. రోజూవారీ అవసరాలు, కుటుంబ పోషణకు ఏదోక రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వీలుంటుంది. కానీ వయసు పైబడిన తర్వాత సంపాదన శక్తి తగ్గిపోతుంది. అలాంటి సందర్భాల్లో వైద్య ఖర్చులు, నిత్యవసరాలు, నివాస అవసరాల కోసం డబ్బు కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కూలీలు, డ్రైవర్లు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు.. వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారికి అండగా కేంద్రం తీసుకొచ్చిన అద్భుతమైన పథకమే ‘అటల్ పెన్షన్ యోజన’ భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే ‘అటల్ పెన్షన్ యోజన’. ఈ స్కీమ్ వల్ల సామాన్యులకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అటల్ పెన్షన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక సురక్షితమైన పెన్షన్ స్కీమ్. ఇందులో ప్రతి నెలా చిన్న మొత్తాల్లో పొదుపు చేయడం ద్వారా 60 ఏళ్ల వయసు నిండిన తర్వాత నెలకు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు స్థిరమైన పెన్షన్ పొందవచ్చు. షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఈ పెన్షన్ మొత్తానికి పూర్తి గ్యారెంటీ ఇస్తుంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించే అవకాశం లభిస్తుంది.
ఈ పథకంలో చేరడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. భారతీయ పౌరుడై ఉండి.. ఏదైనా జాతీయ లేదా ప్రైవేట్ బ్యాంకులో పొదుపు ఖాతా (Savings Account) కలిగి ఉండాలి. ప్రధానంగా పన్ను పరిధిలోకి రాని అసంఘటిత రంగానికి చెందిన వారికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది.
పెన్షన్ స్కీమ్ లో నెలవారీగా పెట్టాల్సిన పెట్టుబడి.. వ్యక్తుల వయస్సుపై ఆధారపడి ఉంటుంది. చిన్న వయస్సులోనే ఈ పథకంలో చేరితే ప్రీమియం భారం చాలా తక్కువగా ఉంటుంది. 18 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ. 1,000 పెన్షన్ కోసం కేవలం రూ. 42.. అలాగే రూ. 5,000 పెన్షన్ కోసం నెలకు రూ. 210 చెల్లిస్తే సరిపోతుంది. 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ. 1,000 పెన్షన్ కోసం రూ. 291, అదే రూ. 5,000 పెన్షన్ కోసం నెలకు రూ. 1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. సౌకర్యాన్ని బట్టి ఈ చందా మొత్తాన్ని ప్రతి నెలా లేదా మూడు నెలలకోసారి, బ్యాంకు ఖాతా నుండి ఆటోమేటిక్‌గా జమ అయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఈ స్కీమ్ చేరి 60 ఏళ్లు పూర్తయిన మరుసటి నెల నుండి ఎంచుకున్న మొత్తం (రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు) జీవితాంతం క్రమం తప్పకుండా పెన్షన్‌గా అందుతుంది. ఒకవేళ పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే అదే పెన్షన్ మొత్తం వారి జీవిత భాగస్వామికి (భార్య/భర్త) జీవితాంతం అందుతుంది. దురదృష్టవశాత్తూ ఇద్దరూ మరణించినట్లయితే ఇప్పటివరకు జమ అయిన మొత్తం కార్పస్ సొమ్మును నామినీకి తిరిగి చెల్లిస్తారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80CCD కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది.
Also Read: Jio, Airtel, Vi యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. 5 కీలక విషయాలివే!
అటల్ పెన్షన్ యోజనలో అర్హులైన వ్యక్తులు ఎంతో ఈజీగా చేరిపోవచ్చు. ఇందుకోసం సమీపంలోని బ్యాంకు లేదా పోస్టాఫీసు శాఖను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ లభించే అటల్ పెన్షన్ యోజన (APY) దరఖాస్తు ఫారాన్ని నింపి.. కేవీసీ వివరాలను (ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు) అందించాలి. అనంతరం మీకు భవిష్యత్తులో రావాల్సిన పెన్షన్ మెుత్తాన్ని (రూ.1000 నుంచి రూ.5000) ఎంచుకొని.. బ్యాంక్ ఖాతా నుండి ఆటో-డెబిట్ (Auto-debit) సౌకర్యాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఇలా చిన్న మొత్తంలో పొదుపు ప్రారంభించడం ద్వారా భవిష్యత్తుకు, వృద్ధాప్య జీవితానికి కొండంత అండను ఏర్పరుచుకోవచ్చు.
Also Read: రూ.106 వల్ల ఇన్సూరెన్స్ కట్.. బ్యాంక్‌కు ఊహించని షాక్.. రూ. 1.5 లక్షల జరిమానా!