11 KV HT Connections: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీ ఈఆర్సీ) 11 కేవీ స్థాయిలో అర్హత కలిగిన హై టెన్షన్ విద్యుత్ కనెక్షన్లు, అదనపు లోడ్లకు ఏకరీతి సర్వీస్ లైన్ ఛార్జీలను అమలు చేస్తూ తీసుకొచ్చిన తాజా నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. లైసెన్సెస్ డ్యూటీ ఫర్ సప్లయ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రతిపాదించిన నిబంధనల సవరణ ద్వారా 11 కేవీ హెచ్ టీ వినియోగదారులకు యునిఫాం సర్వీస్ లైన్ చార్జీల విషయంలో స్పష్టమైన విధానం అందుబాటులోకి వచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పటికే ఉన్న 11 కేవీ విద్యుదీకరించిన నెట్‌వర్క్/కామన్ ఫీడర్ నుంచి ఓవర్‌హెడ్ లైన్ ద్వారా 1 కిలోమీటర్ పరిధిలో సరఫరా కల్పించే అర్హత కలిగిన 11 కేవీ హెచ్ టీ కొత్త కనెక్షన్లు, అదనపు లోడ్లకు ప్రతి కేవీఏ కాంట్రాక్టెడ్ డిమాండ్‌కు రూ.4,078 సర్వీస్ లైన్ చార్జీ వర్తించనుంది. దీంతో అర్హత కలిగిన వినియోగదారులకు సర్వీస్ లైన్ వ్యయంపై ముందుగానే స్పష్టత లభించడంతో పాటు, దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్‌లో మరింత ఏకరూపత ఏర్పడుతుంది. గతంలో కేసు వారీగా స్థల పరిశీలన, సాంకేతిక అంచనాల ఆధారంగా సర్వీస్ లైన్ వ్యయాన్ని నిర్ణయించాల్సి ఉండేది. కొత్త విధానం అమలుతో అర్హత కలిగిన కేసుల్లో కేసు వారీ అంచనాలపై ఆధారపడే అవసరం తగ్గి, దరఖాస్తుల ప్రాసెసింగ్ మరింత సరళంగా మరియు వేగవంతంగా జరిగే అవకాశం ఉంటుంది.
పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు ప్రయోజనం
ఈ విధానం వల్ల పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ, డేటా సెంటర్లు తదితర రంగాల్లో కొత్త విద్యుత్ కనెక్షన్లు లేదా అదనపు లోడ్ల కోసం దరఖాస్తు చేసే అర్హత కలిగిన వినియోగదారులకు వ్యయంపై ముందస్తు స్పష్టత ఏర్పడనుంది. విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియలో పారదర్శకత, సమయపాలన పెరగడం ద్వారా వ్యాపారాలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన మరింత సులభతరం కావడంతో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని విద్యుత్ శాఖ పేర్కొంది. అయితే 1 కిలోమీటర్‌కు మించిన ఓవర్‌హెడ్ లైన్ విస్తరణలు, 33 కేవీ స్థాయి కనెక్షన్లు, భూగర్భ కేబుల్ వ్యవస్థలు వంటి ప్రత్యేక సందర్భాల్లో సాంకేతిక అవసరాలు, వ్యయాలు ప్రదేశానుసారం మారే అవకాశం ఉన్నందున, వాటిని సంబంధిత సాంకేతిక ప్రమాణాలు, నిబంధనల ప్రకారం కేసు వారీగా పరిశీలిస్తారు. అదేవిధంగా, ప్రధాన నిబంధనల ప్రకారం వర్తించే డెవలప్‌మెంట్ చార్జీలు యథావిధిగా వర్తిస్తాయి. రూ.4,078/కేవీఏ సర్వీస్ లైన్ చార్జీలో వినియోగదారు ప్రాంగణంలోని టెర్మినల్, మీటరింగ్ ఏర్పాట్ల ఖర్చులు చేర్చరని స్పష్టంచేశారు.
Also Read: నర్సింగ్ కౌన్సిల్ ఖాతాల్లో కోట్ల రూపాయలు.. మరి ఆ డబ్బంతా ఏమైనట్లు?