Gift Deed vs Will| మీరు కష్టపడి సంపాదించిన ఇంటిని మీ వృద్ధాప్యంలో మీ పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, ఆస్తిని ఇప్పుడే వారి పేరుపై మార్చాలా? లేక మీ మరణం తర్వాత వారికి చెందేలా వీలునామా రాయాలా? అనే ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. ఈ రెండు మార్గాలకు వేర్వేరు ప్రయోజనాలు, నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో మీ ఆర్థిక భద్రత, ఆస్తిపై హక్కులు, పన్నుల భారం వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
గిఫ్ట్ డీడ్ ద్వారా తల్లిదండ్రులు తమ ఇంటిని పిల్లలకు జీవితకాలంలోనే ట్రాన్స్ఫర్ (బదిలీ) చేయవచ్చు. ఇందుకోసం గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయించాక, పిల్లలు ఆ బహుమతిని అంగీకరించినట్లు ధృవీకరణ ఉండాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత పిల్లలే ఆస్తికి చట్టబద్ధమైన యజమానులు అవుతారు. ఆ తరువాత ఇంటిని విక్రయించేందుకు, అద్దెకు ఇచ్చేందుకు, తాకట్టు పెట్టేందుకు అధికారం ఉంటుంది.
అయితే, వీలునామా ద్వారా ఆస్తి యజమాని మరణించిన తర్వాతే పిల్లలకు ఆస్తి బదిలీ అవుతుంది. అప్పటివరకు ఇంటిపై పూర్తి హక్కులు తల్లిదండ్రులకే ఉంటాయి. అవసరమైతే వీలునామాను ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదా రద్దు చేయవచ్చు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(x) ప్రకారం.. తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే బహుమతులపై పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే, ఆస్తిని గిఫ్ట్‌గా ఇచ్చినప్పుడు సాధారణంగా తల్లిదండ్రులకు మూలధన లాభాల పన్ను ఉండదు.
అయితే, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలి. ఈ మొత్తం రాష్ట్రాన్ని బట్టి మారుతుంది.
పిల్లలు భవిష్యత్తులో ఆ ఇంటిని విక్రయిస్తే, సాధారణంగా తల్లిదండ్రులు మొదట కొనుగోలు చేసిన ధర ఆధారంగా మూలధన లాభాలను లెక్కిస్తారు. 2024 జూలై 23 నుంచి దీర్ఘకాలిక మూలధన లాభాలపై సాధారణంగా ఇండెక్సేషన్ లేకుండా 12.5 శాతం పన్ను వర్తిస్తుంది. అయితే, అంతకుముందు కొనుగోలు చేసిన కొన్ని ఆస్తులకు ప్రత్యేక మినహాయింపు ఉంది. అర్హులైన వ్యక్తులు 20 శాతం ఇండెక్సేషన్ పద్ధతిని కూడా ఎంచుకోవచ్చు.
తల్లిదండ్రులు ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇంటిపై యాజమాన్య హక్కులు పిల్లలకు వెళ్తాయి. పిల్లల అప్పులు, న్యాయపరమైన వివాదాలు కూడా ఆస్తిపై ప్రభావం చూపవచ్చు.
అందువల్ల, వృద్ధాప్య ఖర్చులు, వైద్య అవసరాలు, అత్యవసర పరిస్థితులకు సరిపడా డబ్బు ఉంచుకున్న తర్వాతే ఆస్తిని బదిలీ చేయాలి.
మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టం.. 2007లోని సెక్షన్ 23 ప్రకారం కొన్ని పరిస్థితుల్లో గిఫ్ట్ డీడ్ రద్దు చేయించుకోవచ్చు. పిల్లలు సంరక్షణ అందించాలనే షరతును ఉల్లంఘిస్తే ఈ అవకాశం ఉంటుంది. జనవరి 2025లో సుప్రీంకోర్టు ఉర్మిళా దీక్షిత్ vs సునీల్ శరణ్ దీక్షిత్ కేసులో తల్లికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
గిఫ్ట్ డీడ్‌లో పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవాలనే షరతు, జీవితాంతం ఇంట్లో నివసించే హక్కు స్పష్టంగా పొందుపరచడం మంచిది.
Also Read: పెన్షనర్లు ఇక లైన్లో గంటలకొద్ది నిలబడాల్సిన పనిలేదు.. లైఫ్ సర్టిఫికెట్ ఇంటి నుంచే సమర్పించండి
జీవితకాలంలోనే ఆస్తిని పిల్లలకు ఇవ్వాలనుకుంటే గిఫ్ట్ డీడ్ ఉపయోగపడుతుంది. ఆస్తిపై చివరివరకు నియంత్రణ కొనసాగించాలనుకుంటే వీలునామా మంచి ఎంపిక.
అయితే, నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, భవిష్యత్తు అవసరాలను పరిశీలించండి. ఆస్తి బదిలీకి ముందు న్యాయ నిపుణుడిని సంప్రదించండి.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఆస్తి, పన్ను, స్టాంప్ డ్యూటీ నిబంధనలు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.