Home Loan vs Rent: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఈ కలని నెరవేర్చుకునే క్రమంలో చాలామందిలో ఓ సందేహం ఉంటుంది. ప్రస్తుతం ఇంటికి కడుతున్న అద్దె కంటే నెలవారీ హోమ్ లోన్ ఎక్కువ ఉంటే.. ఇల్లు కొనడం మంచిదా? కాదా? అని వారు ఆలోచిస్తుంటారు. ఉదాహరణకు నెలకు రూ.30,000 అద్దె చెల్లిస్తున్న చోట.. లోన్ తీసుకుంటే ఈఎంఐ రూ.50,000 వరకు రావచ్చు. ఇలాంటప్పుడు అదనపు భారాన్ని మోయడం అవసరమా అని కొందరికి అనిపించవచ్చు. ఈ అనుమానాలను ఈ కథనంలో నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం.
ఇల్లు కొనాలనుకునే వారు ఎక్కువగా ఈఎంఐ పైనే దృష్టి పెడతారు. కానీ, ఇంటి కొనుగోలుతో పాటు డౌన్ పేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, మెయింటెనెన్స్, ప్రాపర్టీ టాక్స్, ఇన్సూరెన్స్ వంటి అనేక ఇతర ఖర్చులూ ఉంటాయి. ఈ అదనపు ఖర్చులన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే.. నెలవారీ భారం ఈఎంఐ కంటే ఎక్కువే అవుతుంది. అందుకే కేవలం ఈఎంఐ, అద్దెలను మాత్రమే పోల్చకుండా.. ఒక ఏడాదికి ఇంటి నిర్వహణకు ఎంత ఖర్చవుతుందో ముందే అంచనా వేసుకోవడం మంచిది.
అద్దెకు, ఈఎంఐకి మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఏంటంటే.. అద్దె అనేది వేరొకరి ఆస్తిని ఉపయోగించుకున్నందుకు ఇచ్చే రుసుము. దాని ద్వారా మీకు ఎలాంటి ఆస్తి సమకూరదు. కానీ మీరు చెల్లించే ప్రతి ఈఎంఐలో కొంత భాగం అసలు కిందకి వెళ్లి.. క్రమంగా ఆ ఇంటిపై యాజమాన్య హక్కును పెంచుతుంది. భవిష్యత్తులో అది మీ సొంత ఆస్తిగా మారుతుంది. ఈ వెసులుబాటు అద్దె ఇంట్లో లేకపోవడం పెద్ద మైనస్.
అయితే ఇంటి కొనుగోలు కోసం చాలా మంది తమ దగ్గర ఉన్న పొదుపు మొత్తాన్ని అంతటినీ డౌన్ పేమెంట్ రూపంలో చెల్లిస్తుంటారు. ఇలా చేయడం మంచిదికాదని నిపుణులు అంటున్నారు. కొనుగోలు తర్వాత కూడా మీ వద్ద తగినంత ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇల్లు కొన్నాక అనుకోకుండా వచ్చే మరమ్మతులు, ఇతర అత్యవసరాల కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తే ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక ఆస్తి జీవితానికి రక్షణగా ఉండాలి తప్ప.. అప్పుల ఊబిలోకి నెట్టకూడదు.
కొందరు ఉద్యోగం, వ్యాపారం రిత్యా తరుచూ ప్రాంతాలు మారుతుంటారు. ప్రతీ 3-5 ఏళ్లకోసారి ఊర్లు మారే అవకాశం ఉంటే ఇల్లు కొనడం అంత లాభదాయకం కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వంటి లావాదేవీ ఖర్చులను రికవర్ చేసుకోవడానికి సమయం పడుతుంది. అలాంటి సందర్భాల్లో అద్దె ఇంట్లో ఉండడమే ఎక్కువ సౌలభ్యాన్ని ఇస్తుంది. ఒకే చోట కనీసం 7 – 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం స్థిరపడాలనుకున్నప్పుడే సొంత ఇంటి ఆలోచన చేయడం మంచిదని సూచిస్తున్నారు.
కొందరు అవసరానికి మించి లోన్లు తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా బ్యాంకులు ఆదాయాన్ని బట్టి భారీ మొత్తంలో లోన్ ఇవ్వడానికి ముందుకు రావచ్చు. కానీ బ్యాంకు ఆమోదించినంత మాత్రాన గరిష్ట పరిమితి వరకు లోన్ తీసుకోకూడదు. నెలవారీ ఆదాయంలో సింహభాగం ఈఎంఐలకే పోతే.. పిల్లల చదువులు, రిటైర్మెంట్ ఇన్వెస్ట్‌మెంట్లు, రోజువారీ అవసరాలకు డబ్బు ఏమాత్రం సరిపోదు. కాబట్టి ఈఎంఐ భారం ఇతర ఆర్థిక అవసరాలను దెబ్బతీయకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: పూర్తిగా కుక్కలా మారిన మిలీనియర్.. ఆ సర్జరీ కోసం రూ.22 కోట్లు వెచ్చించాడా? నిజమేంటీ?
అద్దె కంటే ఈఎంఐ ఎక్కువగా ఉన్నప్పటికీ.. అది మీ నెలవారి బడ్జెట్‌ను ప్రభావితం చేయకపోతే సొంత ఇల్లు వైపే మెుగ్గు చూపొచ్చు. అలాగే తగినంత పొదుపు ఉండి.. ఒకే చోట సెటిల్ అవ్వాలనుకుంటే ఇల్లు కొనడం మంచి నిర్ణయమే. కానీ ఆ ఈఎంఐ వల్ల రోజువారీ జీవితం కష్టంగా మారినా, ఇతర అవసరాలకు డబ్బు కష్టమైనా అద్దె ఇంట్లో ఉండటమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: టెలికాం గేమ్ ఛేంజర్స్.. అసలు Local, STD, PCO అంటే ఏంటి? 1990’s జ్ఞాపకాలు!