success story| ఆమె జీవితంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. భర్తను కోల్పోయింది. మళ్లీ చదువుకోవాలని చెప్పి ప్రోత్సహించిన పెద్దలు చనిపోయారు. పదేళ్ల కుమార్తె మరణించింది. ప్రమాదంలో తన కన్నుకు తీవ్ర గాయం అయింది. ఇంత జరిగినా ఆమె వెనకడుగు వేయలేదు. చివరకు ఆమె రాష్ట్ర గ్రూప్స్ పరీక్షలో అద్భుత విజయం సాధించారు. జీవితంలో ఇన్ని ఎత్తుపల్లాలు సాధించిన ఆమె పేరు రోహిణి గుర్జర్.
రోహిణి గుర్జర్ రాజస్థాన్‌లోని ఘూఘ్రా గ్రామానికి చెందినవారు. 2006లో BA పూర్తి చేసి, తన గ్రామంలో మొదటి గ్రాడ్యుయేట్ అమ్మాయిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు. 2011లో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే 2021 ఫిబ్రవరి 18న గుండెపోటుతో భర్త మరణించడంతో రోహిణి జీవితం ఒక్కసారిగా మారిపోయింది.
భర్త మరణం తర్వాత ఆమెకు కుటుంబ సమస్యలతో పాటు సామాజిక విమర్శలు కూడా ఎదురయ్యాయి. కొందరు గ్రామస్తులు, అత్తింటి బంధువులు ఆమెను నష్టజాతకురాలని, చేతబడి చేసే ‘మంత్రగత్తె’ అంటూ నిందించారు. ఇద్దరు కుమార్తెలు ఉండటంపైనా విమర్శలు చేశారు.
దాదాపు 15 ఏళ్ల పాటు చదువుకు దూరంగా ఉన్న రోహిణి, భర్త మరణం తర్వాత తిరిగి చదువుపై దృష్టి పెట్టారు. 2021 చివర్లో పోటీ పరీక్షలకు సిద్ధమవడం ప్రారంభించారు. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించినా, మెయిన్స్‌కు పది మార్కుల తేడాతో అర్హత సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు.
2023లో జైపూర్‌కు వెళ్లి RAS కోసం మరింత కష్టపడి సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఆమెకు తన కుటుంబం నుంచి ముఖ్యంగా సోదరుడు నరేంద్ర గుర్జర్, భర్త నాన్నమ్మ పుష్పా దేవి నుంచి ప్రోత్సాహం లభించింది.
రోహిణి భర్తకు నాన్నమ్మ అయిన పుష్పా దేవికి విద్య లేకపోయినా, రోహిణి చదువుకుని జీవితంలో ఎదగాలని బలంగా కోరుకున్నారు. ఆమెకు ప్రోత్సహిస్తూ కుటుంబానికి, సమాజాన్ని ఎదిరించి నిలబడ్డారు. అయితే రోహిణి RAS కోసం సిద్ధమవుతున్న సమయంలో వృద్ధాప్యం కారణంగా ఆరోగ్య సమస్యలతో పుష్పాదేవి చనిపోయారు. ఈ విషాదం నుంచి కోలుకుంటున్న సమయంలో మరో పెద్ద దెబ్బ తగిలింది. 2024 జూన్ 29న రోహిణి పదేళ్ల పెద్ద కుమార్తె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మరణించింది.
RAS మెయిన్స్ పరీక్షకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ ఘటనతో రోహిణి తీవ్రంగా కుంగిపోయారు. మొదట పరీక్ష రాయకూడదని అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చిన్న కుమార్తె భూమి కోసం అయినా ముందుకు సాగాలని ఆమెకు ధైర్యం చెప్పారు.
Also Read: భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగంలో బిజీ.. దాంపత్య జీవితం సంతోషంగా సాగడానికి టిప్స్
పరీక్షకు కేవలం రెండు రోజుల ముందు రోహిణికి మరో ప్రమాదం ఎదురైంది. ఈ ప్రమాదంలో ఒక కన్నుకు తీవ్ర గాయమైంది. అయినప్పటికీ ఆమె పరీక్షను వదులుకోలేదు. ఒక కన్నుకు బ్యాండేజ్‌తోనే పరీక్షా కేంద్రానికి వెళ్లి RAS మెయిన్స్ రాశారు. శారీరక నొప్పితో పాటు కుమార్తెను కోల్పోయిన బాధను మోస్తూనే పరీక్ష పూర్తి చేశారు.
Also Read: పుట్టుకతో ఎడమ చేయిలేదు.. పట్టుదలతో చదివి రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగం
RAS 2024 ఫలితాల్లో రోహిణి గుర్జర్ MBC వితంతు కేటగిరీలో రెండో ర్యాంక్ సాధించారు. ఆమెకు రాజస్థాన్ అకౌంట్స్ సర్వీస్‌లో స్థానం లభించింది.
ఈ విజయంతో తనపై నమ్మకం చూపినవారిని గర్వపడేలా చేయాలన్నదే తన లక్ష్యమని రోహిణి చెబుతున్నారు. రోహిణి కథ ఒక ఉద్యోగం సాధించిన విజయగాథ మాత్రమే కాదు. ఎంతటి కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని వదులుకోకుండా ముందుకు సాగితే జీవితాన్ని మార్చుకోవచ్చని ఆమె ప్రయాణం చెబుతోంది.