Vande Bharat Metro Ready For Launch: వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత భారతీయ రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధిక వేగం, వరల్డ్ క్లాస్ సదుపాయలు కల్పించడంతో ప్రయాణికులు వందే భారత్ ట్రైన్లలో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు. వందే భారత్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అప్ డేట్ వెర్షన్లను తీసుకొస్తోంది.
ఇప్పుడు 8, 16 కోచ్ ల రైళ్లు సేవలు అందిస్తుండగా, మరికొద్ది రోజుల్లోనే 20 కోచ్ ల రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్లను కూడా తీసుకురాబోతోంది. రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుగా విశాలమైన బెర్తులు, అత్యాధునిక ఇంటీరియర్, చక్కటి టాయిలెట్ల వసతి కల్పించబోతోంది. ఈ ఏడాదిలోనే ఈ ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయి.
త్వరలో పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు
తాజాగా రైల్వే ప్రయాణీకులకు రైల్వేశాఖ మరో అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలోనే వందే భారత్ మెట్రో రైల్ ను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించింది. అర్బన్ ట్రావెట్ కోసం డిజైన్ చేసిన ఈ రైలును ఈనెల 16న ప్రధాని మోడీ ప్రారంభించినున్నట్లు తెలిపింది. దేశంలోనే తొలిసారి గుజరాత్ అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ఈ మెట్రో ట్రైన్ పరుగులు పెట్టబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడున్న మెట్రో రైళ్లు ప్రధాన నగరాల్లోనే తమ సేవలను కొనసాగిస్తున్నాయి. కానీ, తొలిసారి ఈ మెట్రో రైలు ఏకంగా 334 కిలో మీటర్ల మేర ప్రయాణించనుంది. అహ్మదాబాద్, భుజ్ మధ్య ఉన్న ఈ దూరాన్ని వందే భారత్ మెట్రో రైలు సుమారు 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకోనుంది. ఈ రైలు టికెట్ ధర రూ. 30 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
వారంలో 6 రోజులు మెట్రో రైలు సేవలు
కొత్తగా ప్రారంభించబోయే వందే భారత్ మెట్రో రైలు అహ్మదాబాద్-భుజ్ మధ్య వారానికి 6 రోజుల పాటు సేవలు అందించనుంది. భుజ్ స్టేషన్ లో పొద్దున్నే 5.50 గంటలకు మొదలై, ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ కు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయల్దేరుతుంది. రాత్రి 11.10 గంటలకు భుజ్ స్టేషన్ కు వస్తుంది. ఈ మార్గంలో మొత్తం 9 స్టాఫ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రతిచోటా 2 నిమిషాల పాటు రైలు ఆగనుంది.
వందే భారత్ మెట్రో రైలు వేగం ఎంతో తెలుసా?
వందే భారత్ మెట్రో సెమీ హై-స్పీడ్ రైలుగా రూపొందించారు. ఈ రైలు గంటకు 100 నుంచి 250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. 12 కోచ్ లతో తొలి మెట్రో ప్రారంభం కానుంది. వందే భారత్ రైలు మాదిరిగానే కంప్లీట్ ఏసీ ఉండబోతుంది. మెట్రో రైల్ లా ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ఇందులో టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల భద్రత కోసం సీసీ కెమెరాలను కూడా అమర్చారు. తొలి వందే భారత్ మెట్రో రైలుకు వచ్చే ఆదరణను బట్టి కోచ్ లు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.