BigTV English

Middle Class Housing Decline : తగ్గిపోతున్న మిడిల్ క్లాస్ ఇళ్ల నిర్మాణం.. రియల్టీపైనే సంపన్నుల కన్ను

Middle Class Housing Decline : తగ్గిపోతున్న మిడిల్ క్లాస్ ఇళ్ల నిర్మాణం.. రియల్టీపైనే సంపన్నుల కన్ను

Middle Class Housing Decline | భారతదేశంలో మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు కరువైపోతున్నాయి. బిల్డర్లు ఇప్పుడంతా లగ్జరీ ఇళ్ల నిర్మాణానికే మొప్పుచూపుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో రూ.1 కోటి కంటే తక్కువ ధర కలిగిన ఇళ్ల లభ్యత గత ఏడాదిలో 30% తగ్గిందని రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ ప్రాప్‌ఈక్విటీ ఒక నివేదికలో వెల్లడించింది. రియల్ ఎస్టేట్ సంస్థలు అత్యంత ఖరీదైన లగ్జరీ ఇళ్ల నిర్మాణాల వైపు దృష్టి పెట్టడం దీనికి ప్రధాన కారణమని నివేదిక వివరించింది. 2024లో తక్కువ ధరలో లభించే ఇళ్ల సంఖ్య 1,98,926 యూనిట్లు మాత్రమే ఉండగా.. 2023లో 2,83,323 యూనిట్లు, 2022లో 3,10,216 యూనిట్లు అందుబాటులో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.


ఉద్యోగాల కోసం వివిధ నగరాలకు వలస వెళ్లే మధ్యతరగతి ప్రజల సంఖ్య భారతదేశంలో వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశ జనాభాలో 8% మంది పెద్ద నగరాల్లో నివసిస్తున్నారు. ఈ సంఖ్య వచ్చే 5 సంవత్సరాలలో మరింత పెరగనున్నట్లు అంచనా. ఈ కారణంగా అందుబాటు ధరల్లో ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. దీనికి తగ్గట్టుగా ఇళ్ల లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పెద్ద సంక్షోభం ఎదురవుతుందని సంస్థ హెచ్చరించింది. వచ్చే 5 సంవత్సరాలలో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 1.5 కోట్ల ఇళ్ల అవసరం ఉంటుందని నివేదిక పేర్కొంది. అందుబాటు ధరల్లో లభించే ఇళ్ల నిర్మాణాలు.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో బాగా తక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

లగ్జరీ రియల్ ఎస్టేట్ వైపు సంపన్నుల మొగ్గు
దేశంలోని అత్యంత సంపన్నులు (హెచ్‌ఎన్‌ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు) రియల్ ఎస్టేట్ (Real Estate) రంగంలో పెట్టుబడులు పెట్టడంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వచ్చే 2 సంవత్సరాలలో రియల్టీపై గణనీయంగా పెట్టుబడులు పెట్టాలని 62% మంది సంపన్నులు భావిస్తున్నారు. లగ్జరీ ప్రాపర్టీలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ఇండియా సోత్‌బీస్‌ ఇంటర్నేషనల్‌ రియల్టీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో పెద్ద నగరాలకు చెందిన 623 మంది హెచ్‌ఎన్‌ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు పాల్గొన్నారు.


Also Read: భార్య బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపినా ట్యాక్స్ కట్టాలి!.. ఇన్‌కం ట్యాక్స్ రూల్స్ తెలుసుకోండి

సర్వే ప్రకారం, భారత ఆర్థిక వృద్ధిపై ఆశాభావం కొంతవరకు తగ్గినప్పటికీ, వృద్ధి పటిష్టంగానే కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. 2024లో ఆశాభావం 79%గా ఉండగా, 2025 సర్వేలో ఇది 71%కి తగ్గింది. అయినప్పటికీ, దేశ జీడీపీ వృద్ధి 6% నుంచి 6.5% వరకు ఉండనున్నట్లు అంచనా వేయడంతో, భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగానే కొనసాగుతుందని చాలా మంది హెచ్‌ఎన్‌ఐలు మరియు యూహెచ్‌ఎన్‌ఐలు విశ్వసిస్తున్నారు.

“2024లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే సంపన్నుల సంఖ్య 71%గా ఉండగా, 2025లో ఇది 62%కి తగ్గింది. అయినప్పటికీ, పెట్టుబడులకు ఆకర్షణీయమైన సాధనంగా రియల్టీపై ఇంకా గట్టి నమ్మకం ఉంది” అని నివేదిక వివరించింది.

రాబడులపై ఆశాభావం
పెట్టుబడులపై గణనీయమైన రాబడులు అందుబాటులో ఉంటాయనే అంచనాలే, లగ్జరీ రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణమని సంపన్నులు వెల్లడించారు. 2024లో ఇలా చెప్పిన వారి సంఖ్య 44%గా ఉండగా, ప్రస్తుతం ఇది 55%కి పెరిగింది. రియల్టీ పెట్టుబడులపై రాబడులు 12–18% స్థాయిలో ఉంటాయని సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది ఆశాభావంతో ఉన్నారు. 38% మంది ఇది 12% కంటే తక్కువే ఉంటుందని భావించగా, 18% కంటే ఎక్కువ రాబడులు అందుబాటులో ఉంటాయని 15% మంది అభిప్రాయపడ్డారు.

“కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించే ధోరణి ఉన్నప్పటికీ, దేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి కొనసాగుతుంది. ముఖ్యంగా విశాలమైన ఫార్మ్‌హౌస్‌లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు వంటి వాటికి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం” అని ఇండియా సోత్‌బీస్‌ ఇంటర్నేషనల్‌ రియల్టీ ఎండీ అమిత్‌ గోయల్‌ తెలిపారు. ఒకప్పుడు హోదాకు చిహ్నంగా నిలిచిన లగ్జరీ రియల్ ఎస్టేట్, ప్రస్తుతం మెరుగైన పెట్టుబడి సాధనంగా మారిందని సంస్థ సీఈవో అశ్విన్‌ చడ్ఢా పేర్కొన్నారు.

బిలియనీర్ల సంపద: రియల్టీకి బూస్ట్
దేశంలో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. యూబీఎస్‌ నివేదికను ఉటంకిస్తూ, భారతదేశంలో కుబేరుల సమష్టి సంపద 42% వృద్ధి చెంది, ఏకంగా దాదాపు 905 బిలియన్‌ డాలర్ల స్థాయిని దాటిందని వివరించింది. గత దశాబ్దంలో భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపై 185కి చేరుకోగా, మొత్తం సంపద మూడు రెట్లు పెరిగింది. దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సంఖ్యలో కుబేరులకు కేంద్రంగా అమెరికా, చైనా తర్వాత భారతదేశం మూడో స్థానంలో ఉందని నివేదిక తెలిపింది.

ఈ పెరుగుదల రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది, ముఖ్యంగా లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్ పెరగడంతో రియల్టీ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Related News

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Big Stories

×