Post Office Schemes: సొంతగా వ్యాపారం చేసే మహిళలైనా, గృహిణులైనా, ఉద్యోగినులైనా తమ ప్రతి పైసాకు భద్రతతో పాటు మంచి రాబడిని కోరుకుంటారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో లాభాలు ఉన్నప్పటికీ.. ఒక్కోసారి నష్టాలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో పెట్టిన ప్రతీ రూపాయి భద్రంగా ఉండటంతో పాటు దానిపై కచ్చితమైన రాబడి కోరుకునే మహిళలకు పోస్టాఫీసు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. ఆడ పిల్లలు, మహిళల కోసం ప్రత్యేకంగా పోస్టాఫీసు తీసుకొచ్చిన కొన్ని పొదుపు పథకాలు.. వారికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఆ స్కీమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆడపిల్లల ఉన్నత చదువులు, వివాహ అవసరాల కోసం చిన్నప్పటి నుంచే పెద్ద మొత్తంలో నిధిని జమ చేయాలనుకునే తల్లిదండ్రులకు సుకన్య స్కీమ్ బెస్ట్ ఛాయిస్. పోస్టాఫీస్ పథకాల్లోనే అత్యధికంగా 8.2 శాతం వడ్డీ రేటును ఇది అందిస్తోంది. పాపకు 10 ఏళ్లు వచ్చేలోపు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను తెరిచే వెసులుబాటు ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఖాతా ప్రారంభించిన దగ్గర నుంచి పాపకు 21 ఏళ్ల వచ్చేవరకూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అయితే అమ్మాయి చదువుల కోసం 18 ఏళ్లు పూర్తయ్యాక జమ చేసిన మొత్తంలో 50 శాతానికి వరకు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంది.
మహిళలు తమ రిటైర్మెంట్ లేదా సుదూర ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక పొదుపు చేయాలనుకుంటే ‘పీపీఎఫ్’ చక్కటి ఎంపిక. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 7.1 శాతం వడ్డీని అందిస్తోంది. ఏడాదిలో కనీసం రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతా కాలవ్యవధి 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ప్రతి ఐదేళ్ల చొప్పున దీనిని పొడిగించుకోవచ్చు. అత్యవసర సమయాల్లో రుణ సదుపాయంతో పాటు, విత్ డ్రాయల్స్ చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. దీని ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
ఇప్పటికే చేతిలో కొంత పెద్ద మొత్తం ఉండి దానిపై ప్రతి నెలా ఖర్చుల కోసం స్థిరమైన రాబడి కావాలనుకునే మహిళలకు ‘పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్’ అనువుగా ఉంటుంది. ఇందులో పెట్టిన పెట్టుబడిపై 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీని ప్రభుత్వం ప్రతి నెలా చెల్లిస్తుంది. వ్యక్తిగత ఖాతా ద్వారా గరిష్టంగా రూ. 9 లక్షలు, ఉమ్మడి (జాయింట్) ఖాతా అయితే రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒక వ్యక్తి రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదికి రూ. 66,600 వడ్డీ లభిస్తుంది. అంటే నెలకు దాదాపు రూ. 5,550 స్థిర ఆదాయం చేతికి అందుతుంది.
ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు ప్రతి నెలా కొద్ది కొద్దిగా నిధిని సమకూర్చుకోవడానికి రికరింగ్ డిపాజిట్ అనువుగా ఉంటుంది. ఐదేళ్ల కాలవ్యవధి గల ఈ ఆర్‌డీ పథకం.. ప్రస్తుతం 6.7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. నెలకు రూ.100 పెట్టుబడితో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. తమ బడ్జెట్ ప్రకారం నెలకు రూ.1,000, రూ. 5,000 లేదా రూ.10,000 చొప్పున జమ చేసుకుంటూ పోతే కాలపరిమితి పూర్తయ్యేసరికి చేతికి పెద్ద మొత్తం అందుతుంది.
బ్యాంకులలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) మాదిరిగానే పోస్టాఫీస్ ‘టైమ్ డిపాజిట్’ పనిచేస్తుంది. నిధులు ఉండి నిర్దిష్ట సమయం వరకు వాటితో పనిలేదనుకునే మహిళలు దీనిని ఎంచుకోవచ్చు. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన టైమ్ డిపాజిట్‌పై ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. కనిష్టంగా రూ.1,000తో ఖాతా తెరిచి ఎంత మొత్తాన్నైనా ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎటువంటి పరిమితి విధించలేదు.
ఐదేళ్ల కాలపరిమితి కలిగిన మరో సురక్షితమైన పథకం ‘నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్’. దీనిపై ప్రభుత్వం 7.7 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఇందులో కనీసం రూ. 1,000 నుండి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇది ప్రతి నెలా ఆదాయాన్ని చెల్లించే స్కీమ్ కాదు. కాబట్టి టైమ్ పిరియడ్ ముగిసే వరకు డబ్బును కదలించకూడదని భావించే మహిళలకు గరిష్ట ప్రయోజనాన్ని ఇస్తుంది.
Also Read: వీరమణి పోక్సో కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఫోన్‌లో విస్తుపోయే వీడియోలు.. కీలక అనుచరుడు అరెస్ట్!
60 ఏళ్లు దాటిన మహిళలకు భద్రతతో కూడిన అత్యధిక రాబడిని అందించే పథకం ఇది. ఈ పథకంలో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీని అందిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత తమ జీవితాన్ని ఎవరిపైనా ఆధారపడకుండా గడపాలనుకునే వృద్ధులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఖాతాలో గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశముంది. ఈ విధంగా పోస్టాఫీస్ అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాలు మహిళలు తమ వివిధ వయస్సులు, ఆర్థిక అవసరాలకు తగినట్లుగా ప్రణాళిక వేసుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి.
Also Read: Airtel రూ.999 ఫ్యామిలీ ప్లాన్.. కాల్స్, అపరిమిత డేటాతో పాటు.. ఫ్రీగా యాపిల్ కంటెంట్, ఓటీటీలు!