Veeramani POCSO Case: తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్న గ్రానైట్ వ్యాపారి వీరమణిపై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన అత్యంత ఆప్తుడైన గణేశన్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నమోదైన అరెస్టుల్లో ఇది నాలుగోది కావడం గమనార్హం. కాగా ఇప్పటికే వీరమణితో పాటు ఆయన ఇద్దరు ప్రధాన అనుచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా గణేశన్ ను అరెస్ట్ చేయడంతో మరోమారు ఈ కేసు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.
అరెస్ట్ సమయంలో గణేశన్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో వీరమణికి సంబంధించిన కొన్ని తీవ్ర అభ్యంతరకర దృశ్యాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించి వీరమణి ఉన్న దృశ్యాలు తన వద్ద ఉన్నప్పటికీ గణేశన్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టాడని అధికారులు వెల్లడించారు. ఈ వీడియోలు అతని వద్దకు ఎలా వచ్చాయి? ఇన్నాళ్లూ పోలీసులకు చెప్పకుండా ఎందుకు దాచాడు? అనే కోణంలో సీసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ నుండి ఏవైనా ఆధారాలు, డేటాను డిలీట్ చేశారా? అనే కోణంలో పరిశీలించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.
మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై యాంటీ వైస్ స్క్వాడ్ వీరమణిపై గత నెల కేసు నమోదు చేసింది. ఆగస్టు 29న వీరమణిని అతని ఇద్దరు అనుచరులతో కలిపి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరమణి, అతని అనుచరులు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. గతంలో లభ్యమైన ఒక యుఎస్‌బీ (USB) డ్రైవ్‌లో వీరమణి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దృశ్యాలు వెలుగు చూడటంతో ఈ కేసు బయటపడింది. ఆ వీడియో ఆధారంగా బాధితురాలిని గుర్తించిన పోలీసులు.. 2019లో ఈ నేరం జరిగినప్పుడు ఆమె మైనర్ అని నిర్ధారించారు.
మరోవైపు ఈ పోక్సో కేసు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. గతంలో డీఎంకే హయాంలో ఈ కేసును ఎలా తీసుకెళ్లారో విచారణ ఎందుకు బలహీనపడిందో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్పష్టం చేయాలని అధికార టీవీకే పార్టీ బుధవారం డిమాండ్ చేసింది. ఈ కేసును అప్పట్లోనే తొక్కేశారని ఆరోపించిన టీవీకే.. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ల నిర్వహణపై అప్పటి లా మినిస్టర్ ఎస్. రఘుపతిని ప్రశ్నించింది. ఎవరి ఒత్తిడి మేరకు అప్పట్లో విచారణను నీరుగార్చారని, సరిగ్గా దర్యాప్తు చేయకుండానే ఫైనల్ రిపోర్ట్ ఎందుకు సమర్పించారో సమాధానం చెప్పాలని టీవీకే గట్టిగా నిలదీసింది.
Also Read: మీ పేరిట దొంగ సిమ్ ఉందా? చిక్కుల్లో పడ్డట్లే.. రూ.50 లక్షల ఫైన్, 3 ఏళ్ల జైలు..!
కేసు తీవ్రత దృష్ట్యా గతంలో ఈ కేసును విచారించి మూసివేసిన అధికారులపై కూడా సీసీబీ దృష్టి సారించింది. అప్పట్లో ఈ కేసుతో సంబంధం ఉన్న అసిస్టెంట్ కమిషనర్ యాస్మిన్, యాంటీ వైస్ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్లు మహేష్ కుమార్, రాజ్యలక్ష్మిలకు చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. వీరిని వ్యక్తిగతంగా హాజరై నాటి విచారణకు సంబంధించిన వివరాలపై సరైన వివరణ ఇవ్వాలని చెన్నై పోలీసులు ఆదేశించారు.
Also Read: Airtel రూ.999 ఫ్యామిలీ ప్లాన్.. కాల్స్, అపరిమిత డేటాతో పాటు.. ఫ్రీగా యాపిల్ కంటెంట్, ఓటీటీలు!