TRAI Report: దేశీయ టెలికాం రంగంలో వైర్‌లెస్ (మొబైల్) చందాదారుల సంఖ్య మునుపెన్నడూ లేనంత వేగంగా పుంజుకుంటోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన ‘ది ఇండియన్ టెలికాం సర్వీసెస్ – ఈయర్లీ పెర్‌ఫార్మెన్స్ ఇండికేటర్స్ (2025-26)’ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ టెలికాం రంగం చందాదారులు, ఆదాయం రెండింటిలోనూ బలమైన వృద్ధిని నమోదు చేసింది.
మెుబైల్ యూజర్ల సంఖ్య వేగంగా పెరగడం వల్ల గతేడాది మార్చిలో 1,156.99 మిలియన్లుగా ఉన్న సంఖ్య.. ఈ ఏడాది మార్చి నాటికి 1,265.73 మిలియన్ల(126 కోట్లకు పైగా)కు చేరిందని ట్రాయ్ రిపోర్ట్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే 9.40 శాతం వృద్ధి నమోదైనట్లు స్పష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే నికరంగా 108.74 మిలియన్ల కొత్త మొబైల్ చందాదారులు నెట్‌వర్క్‌లలో చేరినట్లు తాజా రిపోర్ట్ స్పష్టం చేసింది.
వినియోగదారుల సంఖ్య పెరగడంతో పాటు ఒక్కో చందాదారుడి నుంచి వచ్చే సగటు నెలవారీ ఆదాయం (ARPU) కూడా పుంజుకుంది. 2024-25లో రూ.174.46గా ఉన్న సగటు ఆదాయం. 2025-26 నాటికి 3.59 శాతం వృద్ధితో రూ.180.73కు చేరింది. ఇందులో ప్రీపెయిడ్ సేవల ARPU నెలకు రూ.190.66గా నమోదు కాగా.. పోస్ట్‌పెయిడ్ సేవల ARPU రూ.119.76 వద్ద నిలిచింది.
ట్రాయ్ రిపోర్ట్ ప్రకారం టెలికాం రంగం భారీగా ఆదాయాన్ని అర్జించింది. గతేడాదితో పోలిస్తే గ్రాస్ ఆదాయం రూ.3,72,097 కోట్ల నుంచి రూ.4,04,067 కోట్లకు పెరిగి 8.59 శాతం వృద్ధిని నమోదు చేసింది. అప్లికేబుల్ గ్రాస్ రెవెన్యూ (ApGR) 7.12 శాతం పెరిగి రూ.3,81,645 కోట్లకు చేరగా.. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) రూ.3,03,025 కోట్ల నుంచి 10.44 శాతం పెరిగి రూ.3,34,659 కోట్లకు పెరిగింది.
ఆదాయం పెరగడంతో ప్రభుత్వం సేకరించే స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు (SUC), లైసెన్స్ ఫీజులు కూడా పెరిగాయి. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం SUC ఛార్జీ ఆదాయం 6.12 శాతం పెరిగి రూ.4,040 కోట్లకు చేరగా.. లైసెన్స్ ఫీజు 10.40 శాతం వృద్ధితో రూ.26,763 కోట్లకు పెరిగింది.
Also Read: జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!
ఇదిలా ఉంటే 2025-26లో ప్రతి చందాదారుడు నెలకు సగటున 950 నిమిషాలు (MOUs) మాట్లాడినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో ప్రీపెయిడ్ వినియోగదారులు నెలకు సగటున 1,055 నిమిషాలు మాట్లాడగా పోస్ట్‌పెయిడ్ చందాదారులు 305 నిమిషాలు మాట్లాడారు. అలాగే వైర్‌లెస్ డేటా వినియోగదారుల సంఖ్య మార్చి 2025లో ఉన్న 939.51 మిలియన్ల నుంచి 9.29 శాతం పెరిగి మార్చి 2026 నాటికి 1,026.75 మిలియన్లకు చేరుకుంది.
Also Read: ఎల్‌నినో దెబ్బకు ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరి స్థానంలో ఇవి వేస్తే కాసుల వర్షమే!