EV For Petrol Car Price| దేశంలోని పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) ధరలు వచ్చే ఆరు నెలల్లోపు ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దిల్లీలో జరిగిన 32వ కన్వర్జెన్స్ ఇండియా మరియు 10వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్‌పోలో ఆయన ఈ ప్రకటన చేశారు. 212 కి.మీల పొడవున్న దిల్లీ-దేహ్రాదూన్ ఎక్స్‌ప్రెస్‌వే పనులు వచ్చే మూడు నెలల్లో పూర్తవుతాయని కూడా ఆయన తెలిపారు. స్వదేశీ ఉత్పత్తి మరియు కాలుష్య నియంత్రణ వంటి అంశాలను ప్రభుత్వం ప్రాధాన్యతగా పరిగణిస్తోందని గడ్కరీ వివరించారు.
దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలంటే, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆయన నొక్కి చెప్పారు. నాణ్యతతో కూడిన రోడ్లు నిర్మించడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించుకోవచ్చని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఎంతో బాగుంటుందని, ప్రభుత్వం స్మార్ట్ సిటీలు మరియు స్మార్ట్ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. రోడ్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు కొత్త సాంకేతికతలు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కూడా గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read: పోస్ట్ ఆఫీస్ స్కీంలో ఒకేసారి రూ.2 లక్షలు డిపాజిట్..మీ పెట్టుబడి డబుల్ పక్కా
కొత్త టోల్ విధానం త్వరలో ప్రకటన
జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం త్వరలో కొత్త విధానాన్ని ప్రకటిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. కొత్త విధానంలో టోల్ చెల్లింపులపై ప్రజలకు రాయితీలను కూడా ఇస్తామని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి బదులిచ్చారు. దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తోందని, దానికోసం టోల్ ఛార్జీలు తప్పనిసరి అని మంత్రి తెలిపారు. మంచి రోడ్డు కావాలనుకున్నప్పుడు అందుకు తగిన మొత్తం చెల్లించాలనేది రోడ్డు మరియు రహదారుల శాఖ విధానమని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రం దేశంలో నాలుగు లేన్లు మరియు ఆరు లేన్లు అంటూ చాలా పెద్ద రోడ్లు నిర్మిస్తోంది. వాటికోసం మార్కెట్ నుంచి నిధులు సేకరిస్తున్నాం. కాబట్టి టోల్ ఛార్జీలు లేకుండా ఈ పనులు చేయలేం. ప్రభుత్వం నాలుగు లేన్ల మీద మాత్రమే టోల్ వసూలు చేస్తోంది, రెండు లేన్‌లపై వసూలు చేయట్లేదని వివరించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల తర్వాత కొత్త టోల్ విధానాన్ని ప్రకటిస్తాం. ప్రస్తుతం ఇందులోని సమస్యలను పరిష్కరిస్తాం. ప్రజలకు తగిన స్థాయిలో రాయితీ కూడా ఉంటుంది. కాగా, 2023-24లో దేశీయంగా మొత్తం టోల్ వసూళ్లు రూ. 64,809.86 కోట్లు వచ్చాయి. ఇది అంతకుముందు ఏడాది కంటే 35 శాతం అధికం.
యూపీఐ లావాదేవీలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లో యూపీఐ లావాదేవీలు 210 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో భాగంగా భీమ్-యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి రెండు వేల రూపాయల లోపు లావాదేవీలకు 0.15 శాతం ఇన్సెంటివ్ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు రూ. 1,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. యూపీఐ లావాదేవీలు రూ. 210 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రూ. 2 వేలు కంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు ఎలాంటి ఛార్జీ లేదు. అయితే యూపీఐ ప్రస్తుత విధానం గమనిస్తే.. కస్టమర్ బ్యాంక్, ఫిన్‌టెక్ సంస్థ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్, యాప్ సంస్థ ద్వారా 4 దశల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. తద్వారా లావాదేవీల్లో చార్జీలను భరించాల్సి వస్తోంది. చిన్న లావాదేవీలకు ఛార్జీలు విధించడం లేదని.. పైగా రూ. 1,500 కోట్లు ఇన్సెంటివ్ రూపంలో ఇస్తామని ప్రకటించారు.
ఇతర కీలక నిర్ణయాలు:
అసోంలో బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియా యూరియా ఫ్యాక్టరీకి ఆమోదం.
రూ. 10,601 కోట్లతో అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పాటు.
రూ. 2,790 కోట్లతో దేశంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి పచ్చజెండా.
గోకుల్ మిషన్‌కు రూ. 3,400 కోట్లు కేటాయింపు.
రూ. 4,500 కోట్లతో మహారాష్ట్రలో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు ఆమోదం.