Hyderabad Crime: స్నేహాని కన్న మిన్న.. లోకాన లేదురా అనే పాట మనం వినే ఉంటాం. సాధారణంగా ఫ్రెండ్షిప్ డే రోజు ఈ పాట మారు మ్రోగుతుంది. వాస్తవంగా కూడ స్నేహం అనే అనుబంధానికి అంతటి విలువ ఉంది. స్నేహితుడు లేని జీవితాన్ని మనం ఊహించలేము. స్నేహం అనే అనుబంధంలో మాట పట్టింపులు ఉంటాయి.. ఆప్యాయతలు, అనురాగాలు కూడ ఉంటాయి. అటువంటి స్నేహా బంధానికి మచ్చ తెచ్చేలా హైదరాబాద్ లోని బండ్లగూడలో దారుణ ఘటన జరిగింది.
తనను తన స్నేహితుడు దూషించాడన్న నెపంతో ఏకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు ఓ స్నేహితుడు. ఈ ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా, నగరంలో సంచలనంగా మారింది. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ పాతబస్తీ ఇందిరా నగర్ కు చెందిన షేక్. షహబాజ్ (25) డ్రైవర్ వృత్తిలో కొనసాగుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి బండ్లగూడకు చెందిన ఆషం అలీ, అయూబ్, అమీర్ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వీరందరూ కలిసిమెలిసి ఉండేవారు.
అయితే గురువారం మధ్యాహ్నం షహబాజ్ ఇందిరానగర్ చౌరస్తా వద్ద తనను కలిసిన స్నేహితుడు ఆషం అలీని సరదాగా జరిగిన విషయంపై దుర్భాష లాడాడు. తన స్నేహితుడు దుర్భాషలాడడంతో, అలీ మనస్థాపానికి గురై అక్కడి నుండి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని అయూబ్, అమీర్ లకు అలీ తెలిపారు. దీనితో వారు ఇందిరానగర్ లోని స్మశాన వాటికలో మద్యం సేవించి.. షహబాజ్ పై దాడి చేయాలని పథకం రూపొందించారు.
అనుకున్నట్టుగానే షహబాజ్ వద్దకు వెళ్లిన ముగ్గురు, అతడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని స్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లారు. తనను ఎందుకు తిట్టావంటూ.. అలీ గొడవ పడ్డాడు. ఆవేశంతో అలీ కత్తి తీసుకొని షహబాజ్ గొంతులోకి పొడిచాడు. తీవ్ర రక్తస్త్రావంతో షహబాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read: Telangana Cabinet: కేబినెట్ విస్తరణకు ముహూర్తం సిద్దం.. జాబితా కూడ రెడీ.. ఆశావాహుల్లో అలజడి
స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలాన్ని చేరుకుని, పూర్తి వివరాలను ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్నేహం మాటున జరిగిన చిన్న గొడవ.. హత్యకు దారి తీయడంతో ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది.