Air India Gold Smuggling| బంగారం రేట్లు భగభగ మండిపోతున్నాయి. విదేశాల్లో తక్కువ పన్నులు, లేదా పన్ను లేకపోవడంతో చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ బంగారం కొనుగోలు చేస్తారు. అయితే భారతదేశంలో బంగారం దిగుమతిపై భారీగా పన్నులున్నాయి. ఈ కారణంగా విదేశాల్లో కొనుగోలు చేసి దేశంలోకి దొంగచాటుగా తీసుకొస్తున్నారు. కొందరైతే ఇదే పనిగా భారీ మొత్తంలో విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. తాజాగా ఒక విమాన సిబ్బంది బంగారం స్మగ్లింగ్ చేస్తండగా అధికారులు అతడిని పట్టుకున్నారు. మొత్తం రూ.1.41 కోట్ల బంగారాన్ని సిబ్బంది వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జూన్ 13, 2025న జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జూన్ 13న న్యూయార్క్ నుంచి ముంబైకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం (AI-116)లో బంగారం స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఒక సిబ్బంది సభ్యుడిని అడ్డగించారు. మొదట ఆ సిబ్బందిని సోదా చేయగా.. ఏమీ దొరకలేదు, కానీ విచారణలో అతను బంగారం దాచిన విషయం బయటపడింది. విమానం దిగిన తర్వాత బ్రీతలైజర్ టెస్ట్ సమయంలో బ్యాగేజ్ సర్వీస్ ప్రాంతంలో నల్లటి డక్ట్ టేప్‌తో చుట్టిన బంగారం పౌచ్‌ను దాచినట్లు అతను చెప్పాడు.
DRI అధికారులు ఆ పౌచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 1,373 గ్రాముల విదేశీ బంగారం బిస్కెట్లు లభించాయి. దాని విలువ రూ. 1.41 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. విచారణలో మరో అసక్తికర విషయం బయటపడింది. ఆ సిబ్బంది గతంలో కూడా బంగారం స్మగ్లింగ్ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ సమాచారం ఆధారంగా.. ఈ స్మగ్లింగ్ రాకెట్‌కు మాస్టర్‌మైండ్‌గా ఉన్న ఒక హ్యాండ్లర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ హ్యాండ్లర్ విమాన సిబ్బందిని నియమించి బంగారం స్మగ్లింగ్‌ను నిర్వహిస్తున్నట్లు అంగీకరించాడు.
స్వాధీనం చేసుకున్న బంగారం.. కస్టమ్స్ చట్టం కింద జప్తు చేయబడింది. విమాన సిబ్బంది, అతడి హ్యాండ్లర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. విమాన సిబ్బంది, గ్రౌండ్ సిబ్బందిని ఉపయోగించి జరిగే స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా డిఆర్ఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. 2024 డిసెంబర్‌లో.. చెన్నై విమానాశ్రయంలో ఒక ఎయిర్ ఇండియా క్యాబిన్ స్టాఫ్.. 1.7 కిలోల 24-క్యారెట్ బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి ఒక ప్రయాణికుడికి సహాయం చేసినందుకు అరెస్టయ్యాడు. అతను విమానంలో బంగారాన్ని హ్యాండిల్ చేశాడు. అలాగే.. 2024 మేలో, కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్ సురభి ఖాతూన్.. 960 గ్రాముల బంగారాన్ని శరీరంలో దాచుకుని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది.
Also Read: కస్టమర్లకు ఫైన్ వేసే రెస్టారెంట్.. చిన్న తప్పు చేసినా రూ.1500 చెల్లించాల్సిందే
బంగారం స్మగ్లింగ్‌లో ఎయిర్ ఇండియా సిబ్బంది కూడా పాల్గొనడంతో ఆందోళనకర విషయం. DRI అధికారులు ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను ఛేదించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్మగ్లింగ్ కేసులు విమానయాన రంగంలో భద్రత, నియమాల అమలుపై సవాళ్లను లేవనెత్తుతున్నాయి. బంగారం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో విమాన సిబ్బంది పాల్గొనడం దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్య అని అధికారులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా వంటి పెద్ద విమానయాన సంస్థలో ఇలాంటి ఘటనలు జరగడం సంస్థ యొక్క నిర్వహణ, సిబ్బంది శిక్షణపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించడానికి విమానాశ్రయాల్లో భద్రతను మరింత బిగించాల్సిన అవసరం ఉంది.