Bengaluru Crime News: యువతిని నమ్మించాడు.. పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో తన జీవితం ముగిసిపోతుందని భావించ లేకపోయాడు. చివరకు భార్య, ఆమె తల్లి కలిసి దారుణంగా చంపేశారు అల్లుడ్ని. భోజనంలో మత్తు కలిపి, తమతో తెచ్చుకున్న కత్తితో కసి తీరా పొడిచి పొడిచి చంపేశారు. సంచలనం రేపిన బెంగుళూరులో రియల్టర్ లోక్‌నాథ్ హత్య కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. అసలేం జరిగింది? అల్లుడ్ని చంపేందుకు కారణం ఏమై ఉంటుంది? ఇంకా లోతుల్లోకి వెళ్తే…
అసలేం జరిగింది?
బెంగుళూరులో హెసరఘట్ట సమీపంలోని బీజీఎస్ లేఔట్‌లో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లోకనాథ్ సింగ్ హత్య కేసులో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూశాయి. పోలీసుల కథనం మేరకు.. 37 ఏళ్ల లోకనాథ్ సింగ్ బెంగుళూరులో రియిల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన సొంతూరు రామనగర జిల్లాలోని మాగడి తాలూకాలోని కన్నూర్ గేట్ నివాసి. స్థానిక ఎమ్మెల్యేలతో మంచి పరిచయాలు ఉన్నాయి.
మార్చి 22న ఆయన దారుణహత్యకు గురయ్యారు. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కాకపోతే ఆయన మృతదేహం కారులో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. గత డిసెంబర్‌లో రియల్టర్ లోకనాథ్ ఓ యువతిని బెదిరించారు. ఆపై ఆమె తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. తమ కూతుర్ని లోక్‌నాథ్‌కు ఇవ్వడం ఆ పేరెంట్స్ ఇష్టంలేదు. అయినా దగ్గరుండి వివాహం జరిపించారు.
పక్కాగా ప్లాన్ చేసి
ఆనాటి నుంచి అల్లుడు లోక్‌నాథ్‌పై పగ పెంచుకుంది అత్త. ఎలాగైనా అల్లుడ్ని మట్టుబెట్టాలని తల్లి, కూతురు కలిసి స్కెచ్ వేశారు. అనుకున్నట్టుగానే శనివారం బీజీఎస్ లేఔట్‌కు లోకనాథ్, ఆయన భార్య, ఆమె తల్లి వచ్చారు. కొత్తగా నిర్మిస్తున్న లేఅవుట్ భార్య, అత్తకు చూపించారు. యశస్వినితో పార్టీ చేసుకోవాలనే ఆశతో లోక్‌నాథ్ కొన్ని బీరు బాటిళ్లను ప్యాక్ చేయించాడు.
ALSO READ: టెక్ అధినేత ప్రసన్నకు ఇంటిపోరు
భార్య యశస్విని తెచ్చిన ఆహారాన్ని తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత లేఅవుట్‌లోని ఏకాంత ప్రదేశానికి వెళ్లారు. వాహనం లోపల బీరు తాగిన తర్వాత మత్తులోకి వెళ్లిపోయాడు లోక్‌నాథ్. ఈలోగా అత్త హేమ తనతో తెచ్చుకున్న కత్తితో అల్లుడి మెడపై రెండుసార్లు పొడిచింది. వెంటనే తేరుకున్న లోక్‌నాథ్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దాదాపు 150 మీటర్ల దూరం పరిగెత్తాడు.
చివరకు అక్కడ ఆపిన ఆటోలో దాక్కోవడానికి ట్రై చేశాడు లోక్‌నాథ్. అతడి అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అతడు చనిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి ఏమీ తెలియనట్టు తల్లి-కూతురు ఇంటికి వెళ్లిపోయారు. ఎవరో స్నేహితులు హత్య చేసినట్టు నాటకం ఆడేశారు. నిందితులు 19 ఏళ్ల యశస్విని సింగ్, ఆమె తల్లి హేమా బాయిలను సోలదేవనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు.
హత్య వెనుక అసలు కథ
పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లోక్‌నాథ్ హత్యకు ముందు మత్తులో ఉన్నట్లు తేలింది. దీని ఆధారంగా పోలీసులు తొలుత ఆయన ఇంటికి వెళ్లారు. భార్య, అత్త నుంచి కీలక విషయాలు సేకరించారు. తనపై మోసం కేసులు నమోదు చేయించిన లోక్‌నాథ్, గతేడాది సెప్టెంబర్ నుంచి యశస్విని కుటుంబాన్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పుకొచ్చారు.
తన వివాహ ప్రతిపాదనను అంగీకరించమని బలవంతంగా ఒత్తిడి చేశాడని తెలిపారు. ఆ తర్వాత భార్యను శారీరకంగా వేధించడం మొదలుపెట్టినట్టు వెల్లడించారు. అంతేకాదు అతడికి పలువురితో అక్రమ సంబంధాలున్నట్లు గుర్తించారు. ఇలాంటి ప్రవర్తనను తట్టుకోలేక చంపేయాలని నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. లోక్‌నాథ్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత హత్య ప్రణాళికను రూపొందించారని వెల్లడించారు పోలీసులు.