Karnool Tragedy : అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకున్న పిల్లాడు, సరదాగా బంధువులతో కలిసి తిరిగిన వాడు.. అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అల్లారు ముద్దుగా ఇంట్లో సందడి చేసే చిన్నారి.. ఆ సందడిలోనే కనుమరుగవుతాడన అనుకోలేదు. అప్పటి వరకు అమ్మ అంటూ ఆప్యాయంగా పిలిచిన పిలుపులు కాస్తా… భయంతో పెట్టే కేకలుగా మారగా, ఆ తల్లి తల్లడిల్లిపోయ దృశ్యం కనిపించింది. కాస్తా వేడి నీళ్లతో స్నానం చేయించేందుకే వెనుకాడే కన్న తల్లికి.. సలసలలాడే వేడి సాంబురు గిన్నెలో పడి అల్లాడుతున్న కొడుకుని చూసి గుండె ఆగినంత పనైది. ఈ హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లాలోని చోటుచేసుకుంది.
తెలంగాణాలోని గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడుకు చెందిన వీరేశ్ కుటుంబం.. జీవనోపాధి కోసం కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలంలోని ఎన్ గోడు గ్రామానికి వలస వెళ్లింది. అక్కడి బంధువులతో కలిసి జీవిస్తోంది. వీరేశ్ కు ముగ్గురు పిల్లలు.. వారిలో ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఓ అబ్బాయి. ముగ్గురు పిల్లల అల్లరితో ఎప్పుడూ సరదాగా ఉండే ఇంట్లో.. అనుకోని విషాదం చోటుచేసుకుంది.
వీరేశ్ బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుండడంతో అంతా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దలంతా పనుల్లో ఉండగా, పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. ఈ సమయంలోనే మొబైల్ ఫోనుకు బాగా అలవాటు పడిన వీరేశ్ కొడుకు జగదీస్ (6).. ఫోన్ చూస్తూ అక్కడే తిరుగుతున్నాడు. అక్కడే ఉన్నాడుగా అని వారి పనుల్లో మునిగిపోయిన పెద్దలు, తల్లిదండ్రులకు.. ఆ ఫోన్ రూపంలో మృతువుకు దారి దొరుకుతుందని అనుకోలేదు. ఎక్కడికీ వెళ్లకుండా, ఎలాంటి ప్రమాదాల జోలికి వెళ్లకుండా… ఫోన్ చూస్తూ ఒక్కచోటే ఉంటాడులే అనుకున్న వారి తల్లిదండ్రులకు.. ఒక్కసారిగా పెద్దపెట్టున బాలిడి కేకలు వినిపించాయి. కంగారుతో.. పరుగులు పెట్టిన తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలకు గుండెలు పగిలిపోయే దృశ్యాలు కనిపించాయి.
శుభకార్యం జరుగుతున్న ఇంటి పక్కన గుడిసెలో వంటలు చేశారు. అక్కడే వాటిని ఉంచి.. భోజనం సమయానికి తీసుకురావాలనే ఆలోచన చేశారు. అప్పటికే వంటలన్నీ పూర్తవగా, పెద్దలు మిగతా పనిలో పడిపోయారు. సరిగా ఆ సమయంలోనే.. ఫోన్ చూస్తూ లోకాన్ని మరిచిపోయిన బాలుడు.. నేరుగా వెళ్లి సాంబారు గిన్నెపై కూర్చొన్నాడు. కనీసం.. అది కాలుతుంది అనే ఆలోచన కూడా లేనంతంగా.. ఫోన్ లో మునిగిపోయిన బాలుడు, గిన్నెపై కూర్చోవడంతో.. ఒక్కసారిగా మూతజారిపోయి.. బాలుడు సాంబారులో పడిపోయాడు.
Also Read : సన్ రూఫ్ సరదా.. ఎగిరిపడ్డ తలలు, ముక్కలైన శరీరాలు.. కారు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
సలసల కాగిపోతే సాంబారు వేడికి.. బాలుడు ఆర్తనాదాలు పెట్టగా.. అరుపులు విని తల్లి లక్ష్మి, బంధువులు వంటల వద్దకు వెళ్లి చూడగా సాంబారు గిన్నెలో బాలుడు కనిపించాడు. అప్పటికే తీవ్ర గాయాలు కాగా.. బయటకు తీసి చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వేడివేడి సాంబారులో పడి శరీరం, ఇతర అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో.. చికిత్స పొందుతూ బాలుడు జగదీశ్(6) మృతి చెందాడు. దాంతో.. బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా విలపిస్తున్నారు.