Bus Accident: పంజాబ్‌లోని హొషియార్ పూర్ పరిధిలోని దాసుహోలో.. ఘోర రోడ్డు ప్రమాద జరిగింది. దాసుహా-హాజీపూర్ రోడ్డులోని సగ్రా అడ్డా సమీపంలో.. ఒక ప్రైవేటు బస్సు అదుపు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు నిర్దారించినప్పటికీ.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా నిర్ధారించింది. గాయపడిన 12 మందిని స్థానిక సమీప ఆస్పత్రికి చేర్చి అక్కడ చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి కారణం ఏమిటి?
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. వాహనంపై డ్రైవర్‌కు పూర్తిగా నియంత్రణ లేకపోవడంతో.. ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా రోడ్డుపై జారి బస్సు పక్కకు ఒరిగిపోయి, పల్టీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
వెంటనే రెస్క్యూ ఆపరేషన్
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు కలసి రక్షణ చర్యలు ప్రారంభించారు. బస్సు లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని సమీపంలోని దాసుహా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
శోకసంద్రంగా మారిన ప్రాంతం
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. మృతుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల చెంత కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు.
అధికారుల స్పందన
పంజాబ్ జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు సంఘటనా స్థలాన్ని సందర్శించి.. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, బస్సు యాజమాన్యంపై విచారణ ప్రారంభించారు.
క్షమించరాని నిర్లక్ష్యం?
ఈ ప్రమాదం మరోసారి ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలో.. ఉన్న లోపాల్ని వెలికితీసింది. డ్రైవర్ వేగంగా నడపడం, రోడ్ల పరిస్థితులు, వాహనాల్లోని భద్రతా పరికరాల లోపం.. ఇవన్నీ కలసి ఈ విధమైన విషాద సంఘటనలకు దారి తీస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ కోసం వెళ్తే.. ప్రాణాలు తీసేశారు..
ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా.. అధికార యంత్రాంగం దర్యాప్తును నిర్ధిష్టంగా, కఠినంగా నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.