Casanova Fraud Battula Prabhakar | బత్తుల ప్రభాకర్ (28) అలియాస్ బిట్టూ జీవిత గమనాన్ని చూస్తే, అది నేరాలను ఆధారంగా చేసుకుని రూపొందిన కథలా ఉంటుంది. అతని లక్ష్యాలు అత్యంత విచిత్రమైనవి. రూ. 333 కోట్లు సంపాదించిన తర్వాత నేరాలను మానుకోవాలని, అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నాడు. ఈ లక్ష్యాలను ప్రతిబింబించేలా తన ఛాతీపై టాటూలు వేయించుకున్నాడు. శనివారం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తి ఇతనే. ఈ కాల్పుల ఘటనలో ఇతడిని అతికష్టం మీద పోలీసులు పట్టుకున్నారు.
నేర జీవితం ఎలా ప్రారంభమైంది?
చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన బత్తుల ప్రభాకర్ ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తండ్రి కృష్ణయ్య ఒక కూలీ. విజయవాడలో చదివిన అతను తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయసులోనే దొంగతనాలను ప్రారంభించాడు. ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్ లక్ష్యంగా పెట్టుకుని దోపిడీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిగా మారాడు. ఇతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.
విలాసవంతమైన జీవనం
చోరీల ద్వారా సంపాదించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపే బత్తుల ప్రభాకర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ముసుగులో అందరినీ మోసం చేసేవాడు. మైండ్‌స్పేస్ సమీపంలో ఒక ఫ్లాట్‌లో నివాసం ఉండేవాడు. ప్రస్తుతం నార్సింగి పరిధిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకుని ఒడిశాకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. అతని ఫ్లాట్‌లో రూ.50 వేలు ఖరీదు చేసే మద్యం బాటిల్స్, హైఎండ్ లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: అతడే విలన్.. అతడే హీరో – బ్లాక్ మెయిల్ చేసి, మళ్లీ రక్షిస్తున్నట్లు నాటకమాడి ఘరానా మోసం
భారీ లక్ష్యాలు
బత్తుల ప్రభాకర్ తన ఛాతీపై 3, 100 అంకెలను, మధ్యలో సిలువను టాటూ చేయించుకున్నాడు. రూ. 3 వేల నుంచి చోరీలు ప్రారంభించి, ఒక్కరోజులో రూ. 3 లక్షలు, మొత్తంగా రూ. 33 లక్షలు దొంగిలించాలని తొలుత నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం రూ. 333 కోట్లు సంపాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అదేవిధంగా, 100 మంది యువతులతో సంబంధం పెట్టుకొని రికార్డ్ సృష్టించాలని ప్లాన్ వేసుకున్నాడు.
పక్కా ప్లానింగ్ తో నేరాలు
తన నేర జీవితాన్ని రహస్యంగా ఉంచడానికి, స్నేహితుల పేరిట అకౌంట్లలో డబ్బు వేసి, వారి యూపీఐలను తన ఫోన్‌లో యాక్టివేట్ చేసుకుని ఖర్చు చేసేవాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు. కెమెరాల్లో చిక్కకుండా ముసుగు ధరించేవాడు. ఫ్లాట్‌లో నివసించే స్నేహితులకు తన గతం తెలియకుండా చూసుకునేవాడు. ఎవరికైనా తెలిస్తే.. వారికి భారీగా డబ్బులిచ్చి నోరు మూయించేవాడు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే వారినే టార్గెట్ చేసేవాడు. అలాగే డిసెంబర్ 2024లో మొయినాబాద్ లోని ఇంజనీరింగ్ కాలేజీలో రూ.8 లక్షలు, జనవరిలోనే వీజేఐటీలో రూ.16 లక్షలు దొంగతనం చేశాడు. ఇంతకుముందు పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లాడు.
పోలీసుల ఆపరేషన్ – అరెస్ట్
ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపిన తర్వాత బత్తుల ప్రభాకర్‌ను మాదాపూర్ హెడ్ కానిస్టేబుళ్లు వెంకట్‌రెడ్డి, వీరస్వామి, ప్రదీప్‌రెడ్డి కలసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మూడు తుపాకులు, 23 స్వాధీనం చేసుకున్నారు. అతడి ఫ్లాట్ నుంచి మరో తుపాకీ, 7.6ఎంఎం 451 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 70కి పైగా కేసులతో వాంటెడ్ నేరస్థుడిగా ఉన్న అతనిపై మరిన్ని విచారణలు జరుగుతున్నాయి.