Chittoor News: పాఠశాలకు వెళ్లే వయస్సు లో ఆ విద్యార్థిని ఏకంగా గర్భం దాల్చింది. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు అసలు విషయాన్ని తెలుసుకొనేలోపే అంతా జరిగిపోయింది. చివరకు చిన్న వయస్సులో గర్భందాల్చి ఆ విద్యార్థిని ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరగగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ స్పందించి బాలిక గర్భం దాల్చడం వెనుక గల అసలు కారణాలపై విచారణకు ఆదేశించారు.
కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తెను బడికి పంపించారు. ఉత్తమ విద్యతో తమకు పేరు ప్రఖ్యాతులు సాధించి పెడుతుందని అనుకుంటే, ఆ విద్యార్థిని ఎవరి మాటలు విని మోసపోయిందో కానీ, చివరకు గర్భం దాల్చింది. పదవతరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చి మృతి చెందిన ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఇప్పటికే పోలీసులు స్పందించి ఫోక్సో కేసు నమోదు చేయగా, ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. విద్యార్థిని గర్భానికి కారకుడు ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి చెందిన ఓ బాలిక పెంగరగుంట లోని ఓ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. రెండు నెలల క్రితం బాలిక అనారోగ్యానికి గురైన బాలిక ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు ఆమెను వైద్యశాలకు తీసుకెళ్లి, వైద్యపరీక్షలు చేయించారు. సాధారణంగా అనారోగ్యానికి గురైనట్లు అందరూ భావించారు. ఆ తర్వాత బాలిక గర్భం దాల్చిన విషయం గ్రహించిన తల్లిదండ్రులు ఆమెను బడికి పంపడం మాన్పించారు. అప్పటికే ఆరు నెలల గర్భిణీ కావడంతో చేసేదేమి లేక తల్లిదండ్రులు కూడా సైలెంట్ అయ్యారు.
ఇలాంటి తరుణంలో శనివారం విద్యార్థినికి ఒక్కసారిగా ఫిట్స్ రాగా మళ్లీ వైద్యశాలకు తరలించారు. ఆరోగ్యం విషమించినట్లు గుర్తించిన చిత్తూరు వైద్యులు, తిరుపతి రుయాకు తరలించాలని సూచించారు. విద్యార్థినిని వెంటనే రుయాకు తరలించగా శిశువు జన్మించాడు. ఆ విద్యార్థిని మాత్రం ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు వెంటనే ఘటనపై విచారణకు ఆదేశించారు. పలమనేరు సీఐ నరసింహరాజు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, గర్భానికి కారకుడిని తెలుసుకొనే పనిలో నిమగ్నమయ్యారు.
Also Read: TTD News: టీటీడీ చైర్మన్ కు షాకిచ్చిన కేటుగాడు.. ఏకంగా ఆయన ఫోటోతో..
ఆ గర్భానికి కారకుడు ఎవరు?
పాఠశాలకు వెళుతున్న విద్యార్థిని గర్భందాల్చిన ఘటన సంచలనంగా మారింది. రోజూ విద్యార్థిని పాఠశాలకు వెళ్లేదని, పాఠశాలకు సెలవు రోజుల్లో ఓ మహిళతో విద్యార్థిని బయటకు వెళ్లేదని ప్రచారం సాగుతోంది. ఆ మహిళ మాయమాటలు నమ్మి వెళ్లిన విద్యార్థినిని ఎవరో మోసగించినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. విద్యార్థినికి జన్మించిన శిశువు ఆరోగ్యం కూడా ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తెలుస్తుండగా, ప్రస్తుతం రుయా వైద్యశాలలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద మాయమాటలు నమ్మిన ఆ విద్యార్థిని మాత్రం ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడంతో, భాద్యుడిని గుర్తించి చట్టరీత్యా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు జరుగుతున్న ప్రచారం వాస్తవమా? లేక మరేదైనా కారణం ఉందా? అసలు కారకుడు ఎవరన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.