Dogs Eat Newborn Baby Head | ఒక ఆస్పత్రి బయట అప్పుడే పుట్టిన మానవ పసికందుని కుక్కలు పీక్కుతింటుండగా.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో వైరల్ కావడంతో వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ లలిత్ పూర్ నగరంలోని లలిత్ పూర్ మెడికల్ కాలేజీ బయట ఒక చెత్త కుండీ వద్ద ఒక పసికందుని కుక్కలు పీక్కుతింటుండగా.. స్థానికులు గమనించి ఆస్పత్రి వర్గాలకు సమాచారం అందించారు. ఆస్పత్రి సిబ్బంది కుక్కులను తరిమేసే సమయానికి ఆ పసికందు తలను దాదాపు ఆ కుక్కలు తినేశాయి. అయితే పోలీసులకు ఈ విషయాన్ని ఆస్పత్రి యజమాన్యం చాలా ఆలస్యంగా సమాచారం అందించింది.
పోలీసులు మెడికల్ కాలేజీకి చేరుకొని విచారణ చేయగా.. ఆ పసికందు కాలికి ఆస్పత్రి ట్యాగ్ ఉంది. దీంతో ఆస్పత్రి యజమాన్యందే బాధ్యత అని ఆరోపణలు రావడంతో.. తమకు ఏ సంబంధం లేదని వైద్య సిబ్బంది వాదించారు.
పోలీసుల విచారణలో ఆస్పత్రికి చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మీనాక్షి సింగ్ మాట్లాడుతూ.. “ఆదివారం ఫిబ్రవరి 9, 2025న మెడికల్ కాలేజీలోని జిల్లా మహిళా ఆస్పత్రిలో ఒక మగశిశువు జన్మించాడు. అయితే ఆ శిశువు తక్కువ బరువు ఉండడంతో అప్పుడే పుట్టిన పిల్లల ఐసియు లోకి అడ్మిట్ చేశారు. ఆ శిశువు శరీరం పూర్తిగా అభివృద్ధి చెందలేదు. శిశువుకి వెనెముక లేదు, తల సరిగా అభివృద్ధి చెందలేదు. బరువు కేవలం 1.3 కేజీలు మాత్రమే ఉన్నాడు. శిశువుని ఐసియులోకి అడ్మిట్ చేసే సమయానికి హార్ట్ బీట్ 80 బీట్స్ పర్ మినట్ గా ఉంది. ఆ శిశువు కోలుకుంటాడని, జీవిస్తాడని మాకు నమ్మకం లేదు. ఈ విషయం ఆ శిశువు కుటుంబానికి ముందే తెలియజేశాం.” అని ఆమె తెలిపారు.
Also Read: శవాన్ని దొంగలించిన హోటల్ వ్యాపారి.. దోపిడీకి పెద్ద స్కెచ్
“అదే రోజు సాయంత్రం ఆ శిశువు మరణించాడు. ఆ శిశువు మృతదేహాన్ని అతడి పిన్నికి అప్పగించాం. దానికి సంబంధించిన రసీదు డాకుమెంట్స్ ఉన్నాయి. మృతదేహాన్ని తీసుకున్నట్లు శిశువు పిన్ని వేలిముద్ర కూడా వేసింది. అయితే మంగళవారం మధ్యాహ్నం చెత్త కుండీ వద్ద ఒక శిశువు శవం ఉన్నట్లు తెలిసింది. ఆ మృతదేహాన్ని ప్లాసిక్ కవర్లో చుట్టి.. పసికందు కుటుంబం అక్కడ పడేసినట్లు అనుమానిస్తున్నాం. శవానికి ఆస్పత్రి ట్యాగ్ ఉండడం వల్ల దాన్ని గుర్తించగలగాం.” అని డాక్టార్ మీనాక్షి వివరించారు.
అయితే గతంలో కూడా ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటిదే ఓ ఘటన అమెరికాలో జరిగింది. 2023 సంవత్సరంలో అమెరికాలోని ఇండియానా రాష్టానికి చెందిన డేవిడ్ షోనాబామ్ ఆంబులెన్స్ కు ఫోన్ చేసి తన ఆరు నెలల బాబు ఇంటి బేస్ మెంట్లో రక్తపు మడుగులో ఉన్నాడని చెప్పాడు. ఆంబులెన్స్ వెంటనే చేరుకొని ఆ చంటిపిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చంటిపిల్లాడి శరీరాన్ని ఎలుకలు కొరుక్కు తిన్నట్లు వైద్యులు గుర్తించారు. శరీరంపై 50 గాట్లు (ఎలుకలు కొరుక్కు తిన్నట్లు) ఉన్నాయని.. పిల్లాడి ఒక చేతి అయిదు వేళ్లన్ని ఎలుకలు తినేసి కేవలం ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయని పోలీసులకు తెలిపారు.
దీంతో పోలీసులు పిల్లాడి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. వారి ఇల్లు లోపల చూస్తే మురికి కుంపగా ఉన్నట్లు తేలింది. ఇల్లు పరిశుభ్రంగా లేకపోవడంతో ఎలుకలు, బొద్దింకలు విపరీతంగా ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు, పిల్లాడి అవస్థకు కారణమైనందుకు అతని తండ్రికి కోర్టు 16 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. జైలులో అతని చేత ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు చేయించాలని కోర్టులో న్యాయమూర్తి ఆదేశించారు. అతని తల్లి మానసిక స్థితి సరిగా లేనందు వల్ల ఆమెను మెంటల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.