Bangalore Crime News: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో షాకింగ్ విషయం ఏంటంటే భర్తను చంపేందుకు పక్కాగా ప్లాన్ చేసింది నిందితురాలు పల్లవి. ఐదు రోజులుగా హత్య కోసం గూగుల్‌లో వెతికింది. హత్య ఎలా చేయాలి? నరాలు ఎక్కడ తెగితే మనిషి వేగంగా చనిపోతాడో తెలుసుకుంది. ఆ తర్వాత తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
సినిమా మాదిరిగా ట్విస్టులు
ఆదివారం మధ్యాహ్నం కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య కలకలం రేపింది. 68 ఏళ్ల వయస్సులో ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని రకరకాలుగా కథనాలు వచ్చాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు, మృతుడి భార్య పల్లవి కదలికలపై పోలీసులు ఆరా తీశారు. కొన్ని కీలక విషయాలను పోలీసు వర్గాలు వెల్లడించాయి.
భర్తను చంపడానికి ముందు ఐదు రోజులుగా గూగుల్‌లో హత్య ఎలా చేయాలని అనేదానిపై వివరాలు సేకరించింది పల్లవి. నరాలు తెగితే మనిషి వేగంగా చనిపోతాడని తెలుసుకుంది. ఓం ప్రకాశ్‌ను ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి కలిసి ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. తాను హత్య చేసినట్లు విచారణలో పల్లవి అంగీకరించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గూగుల్‌లో సమాచార సేకరణ
హత్యలో కృతి పాత్రపై ఉందా అనేదానిపై లోతుగా విచారణ మొదలుపెట్టారు. అలాగే పల్లవి మానసిక స్థితిని డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఓం ప్రకాశ్ కొడుకు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో తల్లి బాధపడుతున్నట్టు పేర్కొన్నాడు. భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఊహించుకునేది, భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటూ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పెడుతూ వచ్చిందన్నారు.
ALSO READ: వీడు మామూలోడు కాదు.. పెళ్లైన రెండు వారాకే మరో పెళ్లి
సోమవారం న్యాయస్థానం ముందు పల్లవిని హాజరుపరిచారు పోలీసులు. ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమెను ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. హత్యకు ముందు నిందితురాలు వాట్సప్ గ్రూప్స్‌లో పలు సందేశాలు పంపినట్టు గుర్తించారు. సొంత ఇంట్లో తనను బంధించారని, నిఘాలో ఉంచారని చెప్పిందట పల్లవి. అలాగే కూతురు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిందట పల్లవి.
ఆస్తి గొడవలు కూడా?
ఓం ప్రకాశ్ భార్య మానసిక స్థితి కాసేపు పక్కనబెడితే, ఆస్తి గొడవలు ఇందుకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. ఓం ప్రకాశ్ భార్య పల్లవి కూతురు కంటే కొడుకు, చెల్లితో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడేవారని అంటున్నారు. ఉత్తర కన్నడ జిల్లా దండేలి వద్ద 17 ఎకరాల భూమిని కుమారుడు, తన చెల్లికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం వల్ల ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవని అంటున్నారు. హత్య వెనుక ఇదీ కూడా ఓ కారణంగా చెబుతున్నారు.