Surat News : మనలో చాలా మంది చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉంటుంటారు. ఏదో ఓ ఉద్యోగంలో ఉన్నా.. చేస్తున్న పని, ఉద్యోగం విషయంలో అసంతృప్తి ఉన్న వాళ్లూ ఉంటారు. మరీ నచ్చకపోతే.. ఉద్యోగం మానేయడమో, మరో ఉపాధి కోసం ప్రయత్నించడమో చేస్తుంటారు. కానీ.. చేస్తున్న పని నుంచి తప్పించుకునేందుకు ఏకంగా చేతి వేళ్లనే నరుక్కున్నాడు ఓ యువకుడి. వినేందుకు అసాధారణంగా ఉన్నా.. గుజరాత్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట ఎవరో వచ్చి తన వేళ్లను నరికారు అని చెప్పుకొచ్చిన ఈ యువకుడి.. పోలీసుల ప్రవేశంతో అసలు వాస్తవం అంగీకరించాడు. తను చేసిన పనికి ఒప్పుకున్నాడు.
గుజరాత్ లోని సూరత్ కు చెందిన మయూర్ తారపరా అనే 32 ఏళ్ల యువకుడు ఓ వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఆ దుకాణం తన తండ్రికి బాగా తెలిసిన బంధువులది కావడంతో.. అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. చాన్నాళ్లుగా ఇదే ఉద్యోగంలో ఉన్న యువకుడికి.. చేస్తున్న పనిపై ఆసక్తి పోయింది. ఈ ఉద్యోగం మానేయాలని, మరేదైనా చేయాలని అనుకున్నాడు. కానీ.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు భయపడ్డాడు.
మయూర్ కు కొన్నాళ్ల క్రితమే వివాహం జరగగా.. ఓ ఆడపిల్ల పుట్టింది. దాంతో.. కుటుంబ బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే అతను ఉద్యోగం పట్ల వ్యతిరేకత ఎక్కువైంది. తన తండ్రి అదే ప్రాంతంలోని ఓ గ్రామంలో రైతు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మయూర్.. ఉద్యోగం కోసం పట్టణంలో ఉంటున్నాడు. చేసేది.. శ్రమ లేని ఉద్యోగమే అయినా.. పనిలో ఒత్తిడికి చిత్తయ్యాడు. అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగ ఒత్తిడి తట్టుకోలేక, బయటకు వచ్చే ధైర్యం లేక.. ఓ వింతైన ఆలోచన చేశాడు. తాను కంప్యూటర్ ఆపరేటర్ కావడంతో.. చేతి వేళ్లు నరికేసుకుంటే ఉద్యోగం చేయాల్సిన బాధ తప్పుతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా.. ఎడమ చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు.
చేతి వేళ్లను నరుక్కున్న తర్వాత చేతికి గుడ్డ చుట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ.. స్పృహ తప్పి పడిపోయాడు. దాంతో.. రోడ్డున పోయే వాళ్లు, స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. మయూర్ చేతి వేళ్లు నరికేసి ఉండడం చూసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు..మయూర్ వాగ్మూలం సేకరించారు. తొలుత.. తాను ఓ చోట మూత్ర విసర్ణన చేస్తుంటే.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన చేతి వేళ్లను క్షుద్ర పూజల కోసం నరికేశారని చెప్పాడు. కానీ.. అతను చెబుతున్న మాటలకు, వాస్తవ ఘటనలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
బాధితుడు చెబుతున్న ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడం, బలవంతంగా నరికేస్తున్నా ఎవరూ చూడకపోవడం సహా, అక్కడ ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడంతో మయూర్ చెబుతున్నది అబద్దం అని తేల్చారు. అతన్ని మరింత లోతుగా విచారణ చేయగా.. అసలు విషయం బయట పడింది. చేస్తున్న ఉద్యోగం నచ్చక.. తానే చేతి వేళ్లను నరికేసుకున్నట్లు తెలిపాడు. దాంతో.. పోలీసులు, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.
Also Read : గ్రామంలో అందరిముందు భర్తను చితకబాదిన భార్య.. గొడవలో మూడో వ్యక్తి మృతి!
తొలుత మూడు వేళ్లను నరికేసుకున్న బాధితుడు, తర్వాత మరో వేలును కత్తిరించుకున్నాడు. ఆ సమయంలో రక్తం కిందపడకుండా గుడ్డను చుట్టుకున్నాడు. వేళ్లను నరికేసుకునేందుకు వినియోగించిన కత్తిని సమీపంలోని నీటి కుంటలో పడేయగా, పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మయూర్ రెండు రోజుల క్రితం స్వయంగా సమీపంలోని దుకాణం నుంచి దాన్ని కొనుగోలు చేయగా.. ఆ విషయాన్ని దుకాణం యజమాని సైతం ధృవీకరించాడు. దాంతో.. మయూర్ చేతి వేళ్లని తానే నరుక్కున్నాడన్న విషయం స్పష్టమైందన్న పోలీసులు.. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోమని ప్రకటించారు.