Mass Wedding Scam In Rajkot | మన దేశంలో పలు ప్రాంతాల్లో అప్పుడప్పుడు సామూహిక వివాహాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలు సాధారణంగా కొన్ని ఆలయాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు లేదా సమాజంలో పెద్దలు ఈ కార్యక్రమాలను పేద జంటల పెళ్లిళ్ల కోసం చేపడుతూ ఉంటారు. ఖర్చు తక్కువగా ఉన్నా.. అధిక సంఖ్యలో జంటలకు వివాహాలు చేయడం వల్ల ఈ కార్యక్రమాలు కళకళలాడుతాయి. జంటలకు పుస్తె, మెట్టెలు వంటి వస్తువులు కూడా వారే అందిస్తారు. జంటలకు పెళ్లి తరువాత ఇవి మాత్రమే కాకుండా కానుకలు కూడా ఇస్తారు. అయితే, ఇలా ఎవరు పడితే వారు సామూహిక పెళ్లిళ్లు చేస్తామని చెప్పినా, అందరినీ నమ్మడం మంచిది కాదు. ఇలాంటి ప్రకటనను నమ్మి 28 జంటలు మోసపోయాయి. ఈ సామూహిక వివాహాల ద్వారా పెళ్లి ఖర్చులు తగ్గుతాయని భావించి ఆశతో వెళ్లిన కొన్ని జంటలకు నిరాశ మాత్రమే లభించింది. ఇదంతా ఒక పెద్ద మోసం అని గ్రహించిన కొత్తమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ నగరంలో కొందరు వ్యక్తులు కలిసి ఒక పెద్ద ప్లాన్ వేసి అందరినీ మోసగించారు. తాము సామూహిక పెళ్లిళ్లు నిర్వహిస్తామని, ఆ పెళ్లిళ్లలో పాల్గొనే కొత్త జంటలకు భారీ బహుమతులు, కట్నకానుకలు కూడా ఇస్తామని చెప్పి వారిని నమ్మించారు. అయితే పెళ్లి కోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని చెప్పారు. ఇది నిజమని భావించిన కొన్ని కుటుంబాలు వారికి కొంత డబ్బు కూడా చెల్లించాయి.ఆ డబ్బు తీసుకొని ఆ ప్రచారం చేసిన వారు ఉడాయించారు. తమ పిల్లలకు పెద్దగా ఖర్చు లేకుండానే పెళ్లిళ్లు జరిగిపోతాయని భావించిన కుటుంబాలను మోసగించారు.
రాజ్‌కోట్ చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని కుటుంబాలను సామూహిక వివాహాల పేరుతో నమ్మించి, ఒక్కొక్క కుటుంబం నుంచి రూ. 15,000 వసూలు చేశారని పోలీసులు వద్ద ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. తామే దగ్గర ఉండి పెళ్లి ఏర్పాట్లు చేస్తామని, కానుకలు కూడా ఇస్తామని చెప్పి వారిని నమ్మించారని తెలిపారు. దీంతో 28 జంటలు వారిని నమ్మి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై చెప్పిన తేదీకి, పెళ్లి మండపానికి చేరుకున్నాయి. కానీ ఆ తేదీన అక్కడ వెళ్లి చూస్తే.. ఎలాంటి సామూహిక పెళ్లిళ్లకు ఏర్పాట్లు కనిపించలేదు. దీంతో వారు ఆ నిర్వాహకులకు ఫోన్ చేయగా, వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. తాము మోసపోయామని గ్రహించిన ఆ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది అయితే నిరాశతో తమ ఇళ్లకు వెనుతిరిగారు.
Also Read: కుంభమేళలో యువతుల స్నానాలు – అమ్మకానికి వీడియోలు
ఈ ఘటన తర్వాత పోలీసులు రంగంలోకి దిగి.. వచ్చిన జంటలకు పెళ్లిళ్లు జరిపించే బాధ్యతను తీసుకున్నారు. అయితే అప్పటికే కొన్ని జంటలు అక్కడి నుంచి వెళ్లిపోయి దగ్గర్లో ఉన్న దేవాలయాలు, ఫంక్షన్ హాల్లలో పెళ్లిళ్లు చేసుకున్నారు. మిగిలిన 6 జంటలకు పోలీసులు పెళ్లిళ్లు జరిపించారు. ఈ వ్యవహారంపై స్థానిక ఏసీపీ రాధికా భరాయ్ స్పందించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
హెలికాప్టర్‌లో అత్తారింటికి వధువు
మరోవైపు కూతురి పెళ్లికి గుర్తుండి పోయే కానుక ఇచ్చాడు ఓ తండ్రి. అందరూ జీవితాంతం తన కూతురి పెళ్లి గుర్తుంచుకోవాలని వినూత్నంగా చేశాడు. అందుకోసం భారీగానే ఖర్చు చేశాడు. రాజస్థాన్‌కు చెందిన ఒక వధువు తండ్రి తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించి, హెలికాప్టర్‌లో అత్తారింటికి సాగనంపారు. ఝాలావాడ్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సీతారాం చౌధరీ కుమార్తె చాందినీకి జయపురకు చెందిన రామ్‌తో ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో వివాహం జరిగింది. తర్వాత హెలికాప్టర్‌లో వధువును సాగనంపుతున్న దృశ్యాలను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. హెలిప్యాడ్ వద్దే అప్పగింతల పాటలు పాడారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అధికారుల నుంచి అనుమతి తీసుకుని, అప్పగింతల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడానికి గత నెల రోజులుగా ప్లాన్ చేసినట్లు సీతారాం చౌధరి తెలిపారు.