Medchal Constable Incident: కాపాడమని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కానిస్టేబుల్. ఆపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మేడ్చల్‌లోని ఇందిరానగర్ కాలనీలో చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారని గతేడాది మార్చిలో యువతి మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి సాయం చేస్తానని చెప్పి.. యువతి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తర్వాత మాయమాటలు చెప్పి పాలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
విషయం తన ఇంట్లో తెలిస్తే గొడవలు జరుగుతాయని తెలిసి.. యువతిని అడ్డుతొలగించుకోవాలని పలు మార్లు ప్రయత్నించాడు సుధాకర్ రెడ్డి. విషయం తెలిసి.. మేడ్చల్ ఎస్సై సత్యనారాయణ సైబరాబాద్‌కు బదిలీ చేయించాడు. అయినా అతడి బెదిరింపులు ఆగకపోవడంతో.. యువతి సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సుధాకర్ రెడ్డిని రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీలో నివాసం ఉంటున్న 31 ఏళ్ల యవతి .. గతేడాది మార్చి 21న డబ్బులు విషయంలో కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారనే సమస్యతో తన తల్లితో కలిసి కంప్లైంట్ చేసేందుకు పోలీస్టేషన్ కు వచ్చింది. తిరిగి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చే సమయంలో.. అదే పోలీస్ స్టేషన్ క్రైమ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సుధాకర్ అనే కానిస్టేబుల్ వారిని చూసి, తన వద్దకు పిలుచి, విషయం తెలుసుకుని.. మీ సమస్యను పరిష్కరిస్తాను అంటూ.. వారికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయాలని తెలిపాడు. మరుసటి రోజు ఫోన్ చేసి న్యాయవాదితో మాట్లాడాలి అంటూ ఇంటికి పిలిపించుకున్నాడు. కానిస్టేబుల్ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో న్యాయవాది తమ ఇంటికి వస్తారని అక్కడ మాట్లాడుదాం అని చెప్పి.. బాధిత యువతిని ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో ఇంటికి తాళం వేసి ఉందని న్యాయవాదికోసం ఎదురు చూస్తున్నట్లు ప్రవర్తించి.. యవతికి సన్నిహితంగా మెలిగి.. తనకు వివాహం కాలేదని, అమ్మానాన్నలు పెండ్లి కోసం అమ్మాయిని చూస్తున్నారు. నువ్వు నాకు నచ్చావ్, అన్ని విధాల అండగా ఉంటానంటూ యవతిని మాయమాటల్లోకి దించారు.
అయినా ఆ ఆమ్మాయి తనకు వివాహం మీద ఇంట్రస్ట్ లేదని, తాను ఇదివరకే ఓ వ్యక్తితో మోసపోయి కోర్టు చుట్టూ తిరుగుతున్నానని, ఇద్దరిది కులం వేరని అని తెలుపగా.. ఇంకా కులం ఎక్కడ ఉంది అని తనకు అలాంటి బేదం లేదని, ప్రేమిస్తున్నానంటూ బలవంతం చేసి తన శారీరక కోరిక తీర్చుకున్నాడు కానిస్టేబుల్. కొద్ది రోజుల అనంతరం అమ్మానాన్నలకు పరియం చేస్తానంటూ.. మరోమారు ఇంటికి పిలుచుకుని బలవంతంగా అనుభవించాడు. దీంతో ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో పలుమార్లు కలుసుకోవడంతో సదరు యువతి గత ఏడాది జులై నెలలో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డి పెళ్లి కాకుండా తల్లివి కావడం మంచిది కాదంటూ.. వెంటనే గర్భాన్ని తోలంగించాలని తెలుపగా, అందుకు యువతి ఒప్పుకోలేదు. దీంతో అబార్షన్ అయ్యేందుకు మాత్రలు తీసుకువచ్చి బలవంతంగా ఆమెతో వేయించడంతో అబార్షన్ అయ్యింది.
Also Read: నాకే నోటీసులు ఇస్తారా.. తీన్మార్ మల్లన్న ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
ఆగష్టు 15న ఉదయం యువతి కానిస్టేబుల్ సుధాకర్‌కు ఫోన్ చేయగా, అతని భార్య ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కానిస్టేబుల్ పెళ్లి అయిన విషయం దాచానంటూ యువతికి తెలిపాడు. కానిస్టేబుల్ కుటుంబలో గొడవలు తలెత్తడంతో యువతి అడ్డు తోలగించుకునేందుకు మేడ్చల్‌లోని ఆమె ఇంటికి వెళ్లి ఫినాయిల్ త్రాగించాడు కానిస్టేబుల్. అస్వస్థతకు గురై తరువాత కోలుకుంది. నవంబర్ 23న కానిస్టేబుల్ అతని భార్య కోరిక మేరకు యువతిని వారి ఇంటికి తీసుకువెళ్లగా ఇద్దరు కలిసి బెదిరింపులకు పాల్పడి దాడి చేశారు. డిసెంబర్ 2న కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డికి మిత్రుడైన మరో కానిస్టేబుల్ యువతితో మాట్లాడి ఇద్దరి మద్య ఉన్న గొడవను పరిష్కరిస్తానంటూ మేడ్చల్ పట్టణంలోని తుమ్మచెరువు వద్దకు పిలిపించుకుని.. ఈ విషయం ఇంతటితో వదిలేయానని, విషయం గూర్చి ఇతరులకు తెలిపినా, కేసు పెట్టినా చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. డిసెంబర్ 16 న బయటకు తీసుకెళ్తానని తన బండిపై తీసుకెళ్లి గిర్మాపూర్ సమీపంలో వేగంగా వెళ్తున్న బండిపై నుండి తోసేయడంతో యువతి గాయాలపాలైంది.
భాదితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు..
దీంతో బాధితురాలు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డి వ్యవహారం తెలుసుకున్న మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఉన్నతాధికారులకు విషయం వివరించి.. సుధాకర్‌ను సైబరాబాద్ కమీషనర్ కార్యాలయానికి బదిలీ చేయించారు. యువతి అడ్డు తొలగించుకునేందుకు కానిస్టేబుల్ నిత్యం యువతి ఇంటి చుట్టూ తిరుగుతూ, బెదిరింపులకు పాల్పడడంతో.. బాధిత యువతి ఫిబ్రవరి 3న సైబరాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయానికి వెళ్లి.. కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డి ప్రేమ పేరుతో తనను అనుభవించి మోసం చేశాడని, చంపుతానని బెదిరింపులక పాల్పడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు ఈ నెల 4న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సుధాకర్‌రెడ్డి రిమాండ్‌కు తరలించారు. కాగా సదరు కానిస్టేబుల్‌పై గతంలోను పలు కేసులు నమోదయ్యాయి. అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో నగదు లావాదేవీల విషయంలో కేసు నమోదైనట్లు సమాచారం.