Man Sets On Fire Himself | దేశంలో భార్యాబాధితుల కేసులు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక యువకుడు విడాకులకు వ్యతిరేకంగా తన భార్య నివసిస్తున్న ఇంటి ముందే తనకు తాను నిప్పింటించుకన్నాడు. ఆ తరువాత అగ్నిజ్వాలలు ఎగసిపడుతుండడంతో ఘటన స్థలంలో ఎవరూ అతడిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కునిగల్ పట్టణానికి చెందిన మంజునాథ్ (39) కు 11 ఏళ్ల క్రితం 2013లో వివాహం జరిగింది. మంజునాథ్ సొంతంగా ఒక ట్యాక్సీ నడుపుకుంటూ బెంగుళూరులో జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే పెళ్లి జరిగిన రెండేళ్ల తరువాత నుంచి అతని భార్యతో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం అతని భార్య కొడుకుని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె బెంగుళూరులోని నగర్‌భావి ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో తన 9 ఏళ్ల కొడుకుతో నివసిస్తోంది.
అయినా మంజునాథ్ తన భార్య, కొడుకుని కలిసేందుకు తరుచూ అక్కడికి వచ్చేవాడు. కానీ కొన్ని రోజుల క్రితం మంజునాథ్ కు విడాకులు నోటీసు అందింది. అతని భార్య కోర్టులో విడాకులు కోరుతూ పిటీషన్ వేసింది. దీంతో మంజునాథ్ మళ్లీ భార్యతో గొడవ పడ్డాడు. ఇంతకాలం తిరిగి వస్తుందనుకున్న భార్య ఇక తెగదెంపులు చేసుకోవడానికి పిటీషన్ వేస్తుందని మంజునాథ్ ఊహించలేదు. అందుకే ఆమెతో గత కొన్ని రోజులుగా కలవడానికి ప్రయత్నిస్తున్నాడు. విడాకుల పిటీషన్ ఉపసంహరించుకోవాలని కోరుతున్నాడు. కానీ అతని భార్య అందుకు ఒప్పుకోలేదు. దీంతో మంజునాథ్.. గురువారం జనవరి 23న తన భార్య నివసిస్తున్న ఇంటి వద్దకు వెళ్లాడు. ఈసారి తనతో పెట్రోల్ తో నిండిన డబ్బా తీసుకెళ్లాడు.
Also Read: డాక్టర్ చేతిలో పేషెంట్ సజీవ దహనం!.. వైద్యుడే హంతకుడు
ఆమె ఇంటి బయట నిలబడి.. వెంటనే విడాకుల పిటీషన్ వెనక్కు తీసుకోవాలని కేకలు వేశాడు. కానీ ఆమె స్పందించలేదు. దీంతో అతను తన శరీరంపై తనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో రోడ్డున అతను కాలిపోతుండగా.. అక్కడ చుట్టుపక్కల ఉన్నవారంతా షాకైపోయారు. ఈ విషయం పోలీసులకు ఫోన్ ద్వారా తెలిసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంజునాథ్ ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అతను చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.
బెంగుళూరులోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ లో మంజునాథ్ ఆత్మహత్య కేసు నమోదైంది. పోలీసులు ఈ కేసులో విచారణ చేస్తుండగా.. మంజునాథ్ తల్లిదండ్రులు తమ కొడుకు మరణానికి అతని భార్యనే కారణమని ఆరోపణలు చేశారు. ఆమె మంజునాథ్ ను మానసికంగా వేధించడం వల్లే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
బెంగుళూరు లోనే కొన్ని నెలల క్రితం అతుల్ సుభాష్ అనే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య పెట్టిన కట్నం వేధింపుల కేసుకు వ్యతిరేకంగా దేశంలోని చట్టాలు మహిళలను అనుకూలంగా ఉన్నాయని.. ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. కోర్టుల్లో పురుషలను న్యాయమూర్తులు సైతం వేధిస్తున్నారని తీవ్రమైన విమర్శలు చేశాడు. ఇదంతా చనిపోయే ముందు సుదీర్ఘంగా వీడియో రికార్డ్ చేసి మరీ చనిపోయాడు.
అతుల్ సుభాష్ భార్య, అమె సోదరుడు తన నుంచి రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నారని.. వారికి బిజినెస్ పెట్టుబడుల కోసం తన నుంచి కోట్లు కావాలని అడిగారని తాను నిరాకరించడంతోనే తనపై, తన తల్లిదండ్రులపై కట్నం వేధింపుల కేసు పెట్టారని ఆరోపణలు చేశాడు. కోర్టులో న్యాయమూర్తి తన బాధను పట్టించుకోకపోగా.. హాస్యమాడారని.. పైగా కేసు కొట్టివేసుందుకు న్యాయమూర్తి రూ.5 లక్షలు అడిగారని చెబుతూ.. దేశంలో చట్టాలు పురుషులకు వ్యతిరేకంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మరణంతో నైనా మార్పు రావాలని కోరుతూఆత్మహత్య చేసుకున్నాడు.
అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తరువాత కూడా ఢిల్లీలో ఒక రెస్టారెంట్ ఓనర్ తన భార్య డబ్బుల కోసం పెట్టే వేధింపులు తాళలేక ఆత్మ హత్య చేసుకున్నాడు.