Palnadu robbery: పల్నాడు జిల్లా మాచవరం మండల కేంద్రంలో భారీ చోరీ వెలుగుచూసింది. దొంగలు ఏకంగా 56 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం కాకుండా, ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి ఈ దోపిడీకి పాల్పడటం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది.
అసలేం జరిగిందంటే..?
మాచవరానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమార్తె దగ్గరకు వెళ్లారు. ఇంట్లో వారి చిన్న కుమార్తె ఒక్కతే ఉంటోంది. ఆమె నిద్రిస్తున్న సమయంలోనో లేదా గమనించని సమయంలోనో దుండగులు గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో దాచిన సుమారు 56 తులాల బంగారాన్ని చేజిక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసుల అనుమానం.. పాత నేరస్థుల పనేనా?
ఈ దొంగతనంలో ఒక ఆసక్తికరమైన, అనుమానాస్పద కోణం దాగి ఉంది. ఇంట్లో బంగారం పక్కనే వెండి వస్తువులు, కొంత నగదు ఉన్నప్పటికీ దుండగులు వాటి జోలికి అస్సలు వెళ్లలేదు. కేవలం బంగారాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఇంట్లోని విషయాలు పూర్తిగా తెలిసిన వారే లేదా నమ్మకస్తులే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
Also Read: కేసీఆర్ అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
రంగంలోకి దిగిన క్లూస్ టీమ్
బాధితుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, వేలిముద్రల నిపుణులు ఇంట్లోని ఆధారాలను సేకరిస్తున్నారు. స్థానిక సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.