Ananthpuram Robbery : గతనెలలో అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన భారీ దొంగతనాల్ని జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ చోరీలకు పాల్పడిన గ్యాంగులోని కీలక సభ్యుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఛోరికి గురైన సొత్తులో కొంతమేర రికవరీ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులతో పాటు నగదు, నగల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామంటున్న పోలీసులు.. నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని జిల్లా ఎస్పీ వివరించారు.
జనవరి 22న జిల్లాలోని అనంత నగరం ప్రాంతంలోని రాజహంస స్వీట్ హోమ్స్ లక్ష్యంగాలో భారీ దొంగతనం జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యాంగా దాడులకు పాల్పడిన దుండగులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివా రెడ్డి, మిస్టర్ చాయ్ నిర్వాహకుడి ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వారి ఇళ్లల్లో ఎవరూ లేని సమయాల్లో చోరికి పాల్పడిన దుండగులు.. భారీగా దోపిడికి పాల్పడ్డారు. ఈ రెండు ఇళ్లల్లో కలిపి.. సుమారు 3.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను మాయం చేశారు. విలువైన వజ్రాలు, రూ.20 లక్షలకు పైగా నగదును అపహరించుకుపోయారు. చోరి జరిగిన తర్వాత గుర్తించి బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంట్లో పెళ్లి కోసం దాచుకున్న సొమ్ములు దొంగలపాలవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో.. కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న అనంతపురం ఎస్పీ జగదీష్.. ఈ చోరిని ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో అనేక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఈ దొంగతనానికి పాల్పడింది.. ధార్ గ్యాంగ్ గా నిర్ధారించారు. గతంలోనూ ఈ గ్యాంగ్ అనేక నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక దాలతో పోలీసుల గాలింపు చేపట్టారు. వివిధ రాష్ట్రాల్లోనూ వీరి కోసం జల్లెడ పట్టిన పోలీసులు.. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు.
ప్రస్తుతం.. ధార్ గ్యాంగులోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి రూ.90 లక్షల విలువైన బంగారు ఆభరణాల్ని, రూ.19 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటే 3 బైక్స్, 2 మొబైల్ ఫోన్లను జప్తు చేశారు. కాగా.. అరెస్టు చేసిన నేరస్థుల్ని పచవార్, సావన్, సునీల్ లుగా తెలుపుతున్నారు. చోరికి పాల్పడినప్పుడు.. వీరితో పాటుగా ఉన్న మరో ఇద్దరిని గుర్తించిన పోలీసులు.. వారిని మహబత్, మోట్లగా గుర్తించారు.
Also Read : ఒక్కడు కాదు.. ఫ్యామిలీ మొత్తం ప్లాన్ చేసి.. గురుమూర్తి కేసులో బయటపడ్డ సంచలన విషయాలు
వీరంతా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ గ్యాంగు గతంలోనూ భారీగానే చోరీలకు పాల్పడినట్లు తెలిపిన పోలీసులు.. వీరిలో ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు నమోదైనట్లుగా గుర్తించారు. పరారీలోని మిగతా ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపిన పోలీసులు.. మిగతా సొమ్ముల్ని త్వరలోనే రికవరీ చేస్తామని ప్రకటించారు.