Hyderabad Crime news: నవమాసాలు మోసిన బిడ్డను ఏ కన్నతల్లి చంపుకోదు. ఆర్థిక సమస్యలకు చిన్నారి అడ్డంగా మారుతుందని భావించింది ఆ తల్లి. ఇంట్లో భర్త లేని సమయంలో పసికందును నీళ్ల బకెట్‌లో వేసి చంపేసింది. సంచలనం రేపిన ఈ కేసుకు పోలీసులు వేగంగా ఫుల్‌స్టాప్ పెట్టేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
తమిళనాడు టు హైదరాబాద్
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన ముదులై మణి-ఆరోగ్య విజ్జి దంపతులు. కూలి పనుల నిమిత్తం తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు ఈ దంపతులు వచ్చారు. హైదరాబాద్ ఐడీఏ బండ్లగూడ ప్రాంతంలో ఉంటోంది. శాస్త్రిపురం అలీనగర్‌లోని ఓ కంపెనీలో కూలీలుగా పని చేస్తున్నారు. ఆ జంటకు ఏడాది బాబు ఉన్నాడు.
ఆరు నెలల కిందట ముదులై మణి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షల తర్వాత రెండు కిడ్నీలు పని చేయడం కష్టమని వైద్యులు తేల్చిచెప్పారు. ఈ విషయం తెలియగానే మణి షాకయ్యాడు. నగరానికి వచ్చిన కొద్దిరోజుల్లో ఇలా జరగడంపై లోలోపల కుమిలిపోయాడు. అప్పటికే మణి భార్య ఆరోగ్య గర్భం దాల్చడం, రెండువారాల కిందట ఆడ పిల్ల పుట్టింది.
అసలేం జరిగిందంటే
ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆనారోగ్యం గురించి ఆలోచించాడు. చివరకు పెద్ద మనసు చేసుకుని అనారోగ్యం గురించి భార్యకు చెప్పాడు. ఆమె కాసేపు షాకైంది. భర్త కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఒకవేళ భర్త చనిపోతే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని భావించింది. అందులోనూ ఆడ పిల్ల పుట్టడంతో ఖర్చులు పెరుగుతాయని భావించింది. ఇప్పటికే కూలిపనులతో నెట్టుకుంటూ జీవితం సాగుతోందని, సుధీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టింది.
ALSO READ: కూతుర్ని ప్రేమించాడని నడిరోడ్డుపై చంపేశాడు
కన్న బిడ్డను చంపేసింది
భర్త లేకుంటే ఒంటరిగా తాను ఇవన్నీ భరించలేనని భావించింది. ఇలాంటి సమయంలో ఆడ పిల్ల ఉండడం కంటే లేకుండా చేయడమే బెటరని అంచనాకు వచ్చింది. భర్త ఇంట్లో లేని సమయంలో పసికందును నీళ్ల బకెట్‌లో వేసి చంపేసింది. పసికందు చనిపోయిన తర్వాత డ్రామాకు తెర లేసింది.
గట్టిగా కేకలు వేసి తన పాప కనిపించలేదని చుట్టుపక్కల వెతికింది. ఆ తర్వాత నీళ్ల బకెట్‌లో బిడ్డ మృతదేహం కనిపించిందని కేకలు పెడుతూ కన్నీరు పెట్టింది. చిన్నారిని మంచం మీద పడుకోబెట్టి స్నానానికి వెళ్లానని, ఎవరో నీళ్ల బకెట్‌లో పడేశారని కట్టుకథ మొదలుపెట్టింది. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది.