Puttaparthi Crime News: తమ్ముడు అనే అనుబంధానికి కళంకం తెచ్చాడు ఈ ప్రబుద్దుడు. తన అక్కపైనే కన్నేసి ఆమె నిరాకరించడంతో ఏకంగా ఆమె కుమారుడిని బలిగొన్నాడు. ప్రస్తుత సమాజంలో మానవీయ బంధాలు ఉన్నాయా.. లేవా అనే రీతిలో జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. చిట్టచివరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కేసు వివరాలను వెల్లడించారు.
జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. సత్యసాయి జిల్లా మడకశిరకు చెందిన అశోక్, చెడు వ్యసనాలకు బానిసై తన సొంత అక్క పైన కన్నేశాడు. అయితే అన్నా చెల్లెలి బంధానికి విలువనిచ్చిన అక్క లొంగక పోవడంతో ఆమె కుమారుడిని చంపుతానని అశోక్ పలుమార్లు బెదిరించాడు. ఆమె ససేమిరా అనడంతో ఏకంగా తన అల్లుడిని చంపేందుకు, అశోక్ ప్లాన్ వేశాడు. ఈ హత్య చేసేందుకు అశోక్ తో అప్పటికే అక్రమ సంబంధం నడుపుతున్న నాగలక్ష్మమ్మ అనే మహిళను సైతం ఒప్పించుకున్నాడు.
నవంబర్ 28వ తేదీన ఆమిదాలగిందిలో గల చేతన్ స్కూలుకు వెళ్లిన అశోక్, చిన్నపిల్లల జీపు బొమ్మ కొనిపిస్తానని నమ్మబలికి, తన అల్లుడిని బైక్ లో ఎక్కించుకుని వెళ్లాడు. అశోక్ మాటలు నమ్మిన బాలుడు చేతన్ సైతం నమ్మకంగా తన మామతో పాటు వెళ్లగా, పావుగడలోని సుంకర్ల హట్టి వద్ద బైక్ ను ఆపివేసి, కిందికి దిగమని చేతన్ కు అశోక్ చెప్పాడు. తన మామ మాటలు విన్న చేతన్ కిందికి దిగగానే, అక్కడే గల నాగలక్ష్మి సహాయంతో అశోక్ చేతులు, కాళ్లు కట్టివేసి బాలుడి గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఎవరికీ అనుమానం కలగని ప్రదేశాన్ని గుర్తించి బాలుడిని ఇద్దరు కలిసి హత్య చేశారు.
Also Read: Heavy Rain In Tirupati: విరుచుకుపడ్డ ఫెంగల్ తుఫాన్.. తిరుపతిలో అధిక వర్షపాతం నమోదు.. తిరుమలలో కూడా..
హత్య చేసిన అనంతరం స్వయంగా బాలుడి తాతకు ఫోన్ చేసిన అశోక్ మీ మనవడు పాఠశాలలో ఉన్నాడో లేదో చూసుకోండంటూ చెప్పడం విశేషం. వారు కంగారుగా పాఠశాలకు ఫోన్ చేసి చెప్పగా, చేతన్ కనిపించని విషయాన్ని గుర్తించిన పాఠశాల హెచ్ఎం సాయంత్రం 5 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదును అందుకొని ముమ్మర దర్యాప్తు నిర్వహించిన అనంతరం, కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించారు. తన అక్క లొంగక పోవడంతో, అల్లుడిని హత్య చేసిన అశోక్ ను, హత్యకు సహకరించిన నాగలక్ష్మి అమ్మా అనే మహిళను తాము అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. అలాగే త్వరగా కేసును ఛేధించి నిందితులను అరెస్ట్ చేసిన మడకశిర పోలీసులను ఎస్పీ అభినందించారు.