Ranchi News: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ దంపతులు రాజా రఘువంశీ హత్య మరవకముందే అలాంటి దారుణమైన ఘటన వెలుగుచూసింది. పెళ్లయిన 36 రోజులకే భర్తను అత్యంత కిరాతంగా హత్య చేసింది నవ వధువు. ఈ ఘటన జార్ఖండ్‌లో వెలుగుచూసింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఛత్తీస్‌గడ్‌లోని గర్హ్వా జిల్లా విష్ణుపూర్ గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్ కూతురు సునీత దేవి. ఆమె వయస్సు 22 ఏళ్లు. మే 11న బహో కుందర్ గ్రామానికి చెందిన బుధ్‌నాథ్ సింగ్‌తో పెళ్లి జరిగింది. మరుసటి రోజు నుంచి ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. వెంటనే అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది సునీతదేవి. భర్త బుధ్‌నాథ్ తనకు ఏ మాత్రం ఇష్టం లేదని పేరెంట్స్‌కి తెగేసి చెప్పేసింది.
ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీ దృష్టికి తీసుకెళ్లారు. సునీతకు చెప్పాల్సిన నాలుగు మాటలు జెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. అయినా సరే భర్తతో ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తూ వచ్చింది. భర్త అంటే సునీతకు ఏ మాత్రం ఇష్టంలేదు. ఎలాగైనా చంపాలని డిసైడ్ అయ్యింది.
శనివారం భర్తతో కలిసి మార్కెట్‌కు వెళ్లింది సునీత. భర్తతో స్వయంగా పురుగుల మందు కొనిపించింది. ఆదివారం గుమగుమలు వచ్చేలా చికెన్ డిష్ తయారు చేసింది. మార్కెట్లో కొనుగోలు చేసిన పురుగుల మందు చికెన్‌లో కలిపి భర్తకు భోజనం పెట్టింది. రాత్రి భోజనం తర్వాత నిద్రపోయిన భర్త , ఈ లోకాన్ని విడిచిపెట్టాడు.
ALSO READ: మోడల్ శీతల్ దారుణహత్య.. ప్రియుడే ప్లాన్ చేసి
కొడుకు మృతి విషయం తెలియగానే అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడలు.. మా కొడుకుని చంపేసిందని, భోజనంలో విషం కలిపి పెట్టిందని ప్రస్తావించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, సునీతను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తొలుత సునీత తన అత్తపై ఆరోపణలు చేసి దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది.
చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరాన్ని తాను చేసినట్టు అంగీకరించింది. చికెన్ కర్రీలో పురుగుమందు కలిపి భర్తకు భోజనం పెట్టినట్టు నిజాన్ని ఒప్పేసుకుందని పోలీసులు తెలిపారు. భర్త హత్యకు రెండంచెల విధానం ఫాలో అయ్యంది. చికెన్ కర్రీ ప్రయత్నం విఫలం అయితే బ్యాకప్ ప్లాన్‌గా రెండు అదనపు పురుగు మందుల ప్యాకెట్లను రెడీ చేసిందని తెలిపారు.
భర్త చనిపోయినట్లు తెలిసిన తర్వాత మిగిలిన పురుగు మందుల ప్యాకెట్లను సమీపంలోని చెట్ల పొదల్లో వేసిందని తేల్చారు. ఇంతకీ భర్తను హత్య చేయడానికి కారణమేంటి? అన్నదే అసలు పాయింట్. సునీతదేవి తన గ్రామానికి చెందిన ఓ యువకుడితో లవ్‌లో పడింది. ప్రియుడ్ని కలవడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. దారుణంగా చంపేసింది. సునీత ప్లాన్ సక్సెస్ అయ్యింది.. కాకపోతే జైలుకి పరిమితమైంది.