Accident In Chennai: చెన్నైలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు వీడియో జర్నలిస్ట్ మృతి చెందారు. చనిపోయిన వ్యక్తిని ప్రదీప్ కుమార్ గా గుర్తించారు. మృతుడి ఐడీ కార్డు ఆధారంగా ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. అంతే కాకుండా పార్ట్ టైమ్ ర్యాపిడో నడుపుతున్నట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ ఘటన చెన్నై లోని పాండీ బజార్ ఏరియాలో చోటు చేసుకుంది.
Also read: ఏపీలో దారుణం.. యువకుడిపై కర్రలతో దాడి.. తిరిగివెళుతుండగా వదిలిపెట్టని ఖర్మ
ప్రదీప్ కుమార్ బైక్ పై వెళుతుండగా యాక్సిడెంట్ చేసిన కారు దాదాపు వంద మీటర్లు ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో ప్రదీప్ మరణించినప్పటికీ కారు డ్రైవర్ ఆపకుండా పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యాక్సిడెంట్ చేసిన బీఎండబ్ల్యూ కారును సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. కారు డ్రైవర్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. మొదట కేవలం బైకునే చూడగా వంద మీటర్ల దూరంలో డెడ్ బాడీని చూసి షాక్ అయ్యారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా హిట్ అండ్ రన్ కేసులు ఈ మధ్యన పెరిగిపోతున్నాయి. యాక్సిడెంట్ చేసిన తరవాత కనీసం వ్యక్తులు బతికి ఉన్నారా లేదా అని పట్టించుకోకుండా పారిపోతున్నారు. ముఖ్యంగా బడా బాబులు రాత్రిపూట రెచ్చిపోతున్నారు. అర్దరాత్రుల్లో బడా బాబులు మద్యం మత్తులో కారు నడుపుతూ రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారు. ప్రమాదం తరవాత తప్పుడు సాక్ష్యాలతో కేసుల నుండి బయటపడుతున్నారు. దీంతో కఠిన చట్టాలు తీసుకురావాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.